చేయదగిన పనులు, చేయకూడని పనులు అని రెండు రకాలు ఉంటాయి. సాధారణంగా ఇవి మంచి చెడులకు ప్రతీకలు. మంచి చెడులు ఏవి అనేది మన బుద్ధిని బట్టే మనం నిర్ణయించుకుంటాం. కానీ.. ‘‘చేయదగిన- చేయకూడని పనులు ’’ అనే నిర్వచనం ప్రతి సందర్భంలోనూ కేవలం మంచి చెడులకు మాత్రమే సంబంధించినది కాదు. విధ్యుక్త ధర్మానికి సంబంధించినది కూడా.
మంచి పనులు (చేయదగిన పనులు) మాత్రమే చేయాలి. చెడ్డ (చేయకూడని) పనులు ఎప్పటికీ చేయకూడదు.. అనే విషయం అందరికీ తెలిసిందే. మంచి చెడుల తూకం రాళ్ల మీద మాత్రమే కాకుండా.. ఇతర దృక్కోణాల్లోంచి కూడా చూడాలి.
ఇదే విషయాన్ని ఒక సుభాషితం కూడా చెబుతుంది..
కర్తవ్యం ఆచరం కామమ్ అకర్తవ్యమ్ అనాచరమ్
తిష్ఠతి ప్రాకృతాచారో య సః ఆర్య ఇతి స్మృతః
చేయవలసిన, చేయదగిన పనులను తప్పకుండా చేసేవాడు. చేయకూడని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా ఉండేవాడు. ప్రకృతికి అనుగుణమైన తర్కబద్ధమైన ప్రవర్తనను కలిగిఉండేవాడిని.. ఆర్యుడు అని అంటారు. .. అనేది శ్లోకభావం
‘ఆర్య’ అనే పదం ఒక జాతిని సూచించేది గానీ.. మన దేశంలో సగభాగం ప్రజలను వివక్షకు గురిచేసేది గానీ కాదు. కేవలం ఒక పాజిటివ్ వ్యక్తిత్వాన్ని సూచించే ధ్వనిగా మాత్రమే స్వీకరించాలి.
చేయదగిన, చేయకూడని అనే పనుల అర్థాన్ని మంచి- చెడుల కోణంలో కాకుండా విధ్యుక్త ధర్మం కోణంలో చూసినప్పుడు.. ఈ శ్లోకం సక్సెస్ కు , విజయానికి బాటలు వేస్తుంది. కాలహరణాన్ని తగ్గిస్తుంది.
చేయదగిన పనులు అంటే మన ప్రాథమిక ధర్మంగా, విధ్యుక్త ధర్మంగా మనం చేసి తీరవలసిన పనులు. చేయకూడని అంటే.. అవి ప్రాథమిక అవసరాలు కాని పనులు.
అంటే.. మనం ఒక విద్యార్థి అనుకుంటే.. చదువుకోవడం, సబ్జెక్టు నాలెడ్జి పెంచుకోవడం అనే ప్రాథమిక, మౌలిక బాధ్యత చేయదగిన పని అనుకుంటే గనుక.. మొబైల్ గేమ్స్ ఆడుతూ గడపడం, ఫ్రెండ్స్ తో చాట్ తో గడపడం అనేది.. చేయకూడని పనిగా అర్థం చేసుకోవచ్చు.
ఈ రెండు రకాల పనుల మధ్య విచక్షణను మనం అర్థం చేసుకోగలిగితే.. అదే మన సక్సెస్ అవుతుంది. మన విధికి తగిన పనులనే మనం చేస్తూ ఉండాలి. ప్రాకృతాచారో.. అన్నా కూడా.. ప్రాథమిక విధికి అనుగుణంగా ఉండే ఇతర పనులను మాత్రమే చేస్తూ పోవాలి. అలాంటి వైఖరి మనల్ని కార్యసాఫల్యత వైపు నడిపిస్తుందని అర్థం చేసుకోవాలి.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post