ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశంపై కాంక్ష ఉంటుంది. అది వ్యక్తిత్వ నిదర్శనం అవుతుంది. డబ్బు- గౌరవం ఏది ముఖ్యం అనే మీమాంస ఎప్పటికీ తెగేది కాదు! నిజానికి గౌరవం గురించిన కాంక్ష కూడా.. ఒకరకమైన బంధనం. డబ్బు ఒక రకమైన ఇంధనం. కానీ.. గౌరవాన్ని కూడా ఇంధనంగా భావించగల జీవితాలు కూడా కొన్ని ఉంటాయి.
ఏ భావన అయినా.. ఇంధనం లాగా మనిషిని నడిపించినంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, అదే భావన.. బంధనంగా మారిపోయిందంటే గనుక.. పతనాన్ని నిర్దేశిస్తుంది.
డబ్బు- గౌరవం ల ప్రియత్వం గురించి.. ఓ సుభాషితం ఇలా చెబుతుంది.
అథమాః ధనమిచ్ఛన్తి ధనం మానం చ మధ్యమాః
ఉత్తమాః మానమిచ్ఛన్తి మానో హి మహతామ్ ధనం
నీచుడికి ఎప్పుడూ డబ్బు మీదనే ఆశ ఉంటుంది… మధ్యముడికి డబ్బుతో పాటు గౌరవం, మంచిపేరు మీద కూడా ఆశ ఉంటుంది. ఉత్తముడికి మంచిపేరు, గౌరవం మీద తప్ప మరొక ధ్యాస ఉండదు. ఈ కోణంలో చూసినప్పుడు.. డబ్బు కంటె గౌరవానిదే గొప్సస్థానం అనిపిస్తుంది! ..అనేది శ్లోకభావం.
సుభాషితం ఏమైనా చెప్పి ఉండొచ్చు. కానీ.. మనిషిలో కాంక్ష డబ్బు మీద ఉండాలా? గౌరవం మీద ఉండాలా? అనేది పెద్ద మీమాంస! మన దృష్టిలో ప్రాధాన్యం అనేది డబ్బుకు ఉండాలా? గౌరవానికి ఉండాలా? అనేది వివాదం రేగకుండా తేల్చిచెప్పడం చాలా కష్టం.
గౌరవం ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అనుకునేవాళ్లు చేతగాని వాళ్లు అనే అభిప్రాయం ఒకటి చెలామణీలో ఉంటుంది. డబ్బు సంపాదించడం.. డబ్బు సంపాదన అనే కొలబద్ధ మీద నిచ్చెన మెట్లు ఎక్కలేని వాళ్లు.. తమ చేతగాని తనానికి ‘గౌరవం ఉంటే చాలు’ అనే ముసుగు వేసుకుని బతుకుతుంటారనే అభిప్రాయం ఉంటుంది.
మనలో కాంక్ష అనేది ఎటువైపు అయినా ఉండొచ్చు. ఏ ఇష్టాయిష్టాలూ తప్పు కాదు. అందులో అతి మాత్రమే మనుషుల్ని దారితప్పేలా చేస్తుంటుంది. మమకారం డబ్బు మీద అయినా గౌరవం మీద అయినా.. శృతి మించి అతిగా మారితే.. దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. డబ్బు మీద ప్రేమ అతి అయితే.. మనిషిని క్రూరుడిగా మార్చేస్తుంది. అలాగే గౌరవం/ మంచి పేరు అనే అంశం మీద ప్రేమ అతి అయితే.. వాడి సొంత జీవితాన్నే చాలా దుర్భరంగా మార్చేస్తుంది.
మంచితనం అనేది చాలా బరువు. ఆ బరువు మోయడం చాలా కష్టం. ఆ బరువును ఎంత ఎక్కువగా నెత్తికెత్తుకునే కొద్దీ.. మనిషి అందులో కూరుకుపోతున్నట్టే లెక్క.
ఈ శ్లోకంలో సుభాషిత కారుడు ఎలా వర్ణించినప్పటికీ.. డబ్బు- గౌరవాలలో దేనిని ప్రేమించినా.. అతికి వెళ్లకుండా పరిధుల్లో ఉన్నంత వరకు జీవితాలు సుఖప్రదంగానే ఉంటాయనే అనుకోవాలి.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post