ఏది బలం? ఏది బలహీనత? ఏది జ్ఞానం. మనకు ఏ విషయాలు తెలియవో.. దాని గురించిన అవగాహన కలిగి ఉండడమే జ్ఞానం.. అని ఒక చైనీస్ సామెత చెబుతుంది. మరి ప్రతి వ్యక్తికీ ఉండగల బలం ఏమిటి?
‘తెలుసుకోవాలి’ అనే తత్వం మనకు అనేక సందర్భాల్లో రక్షగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఇతరుల సంగతులని తెలుసుకోవాలనే విషయం కాదు. విషయపరిజ్ఞానానికి సంబంధించి కొత్త విషయాలను తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఉండగల సంసిద్ధత. కొత్త విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస, నేర్చుకోవడానికి అవసరమైన ఉత్సాహం మనల్ని జ్ఞానం వైపు నడిపిస్తాయి. అదే మనల్ని అత్యంత బలవంతులుగానూ తీర్చిదిద్దుతుంది.
ఇదే విషయాన్ని మనకు ఓ సంస్కృత సుభాషితం చాలా సరళంగా వివరిస్తుంది.
ఉత్సాహో బలవానార్య నాస్తి ఉత్సాహాత్పరం బలం
సోత్సాహస్య చ లోకేషు న కించిదపి దుర్లభం
ఎవరిలో అయితే ఉత్సాహం, జిజ్ఞాస పుష్కలంగా ఉంటాయో.. వారు అత్యంత బలవంతులు. జిజ్ఞాసను, ఉత్సాహాన్ని మించిన బలం లేదు. అలాగే ఉత్సాహవంతుడైన మనిషికి ఈ ప్రపంచంలో అసాధ్యం అనదగ్గ పనే లేదు. అనేది శ్లోకభావం.
ప్రపంచంలో ఒక వ్యక్తి చేయగలిగిన పని ఏదీ కూడా.. మరొక వ్యక్తికి అసాధ్యమైనది కానే కాదు. ఆ పని చేయడానికి తగిన ఉత్సాహం, ఆ పనిని నేర్చుకోవాలనే జిజ్ఞాస లేకపోవడం వల్ల మాత్రమే మనం చేయలేని పనులు కొన్ని ఉంటాయి. మనలో నేర్చుకునే ఉత్సాహం ఉన్నట్లయితే మనం ఎలాంటి పనినైనా చేయగలం.
అలాంటప్పుడు మనిషికి ఉండతగిన నిజమైన బలం ఈ నేర్చుకునే తత్వమే కద. నేర్చుకోవడం తెలుసుకోవడం అనే లక్షణాలు ఉన్నంత వరకు ఎవ్వరూ బలహీనులు కాదు. అలాంటి వారికి ఏ పనీ అసాధ్యం కూడా కాదు. తెలుసుకోనంత వరకు మాత్రమే ఒక విషయం మనకు కొత్తగా, కఠినంగా కనిపిస్తుంది. ఒకసారి అందులోని మర్మం తెలుసుకున్న తర్వాత.. అదివరకు భయపెట్టిన పనే.. ఆ తర్వాత సునాయాసంగా మారుతుంది. అక్షరసత్యం ఇది.
విద్యార్థులకైనా, వయో వృద్ధులకైనా.. నేర్చుకునే తత్వం అనేది ఎప్పటికీ వారి బలసంపదలను పెంచుతూనే ఉంటుంది. వారిని తిరుగులేని వారిగా తీర్చిదిద్దుతుంటుంది.
శుభోదయం.
.