‘ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే వినను’ అనే సినీ డైలాగు.. తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. చాలా సినిమా డైలాగుల్లాగా తెలుగు భాషలోకి ఒక జాతీయం లాగా అది ప్రవేశించేసింది. చిన్న పిల్లల దగ్గరినుంచి- వయో వృద్ధుల వరకు ఆ మాటను యథాలాపంగా వాడేయడం జరుగుతూనే ఉంది. డైలాగు సంగతి ఏమో గానీ.. అలా ‘ఒక్కసారి డిసైడ్ కావడం’లో మాత్రం చాలానే మహత్తు ఉంది.
పూరీ జగన్నాధ్ భాషలో కాకపోయినా.. ఇలా డిసైడ్ కావడం గురించి ఇంకో రకంగా చెప్పాలంటే.. కృతనిశ్చయం అని అంటాం మనం. ఒక పని చేయాలనే విషయంలో చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవడం. గట్టి నిర్ణయం తీసుకుంటే.. ఇక ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా.. అలా ముందుకు వెళ్లిపోవడం మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాం. అలాంటి వైఖరి వలన వారు నష్టపోతారా? లాభపడతారా? అనేది వేరే సంగతి. కానీ.. వారు సంతృప్తిగా మాత్రం ఉంటుంటారు.
అచ్చంగా ఇదే సంగతిని ఒక సుభాషితం కూడా మనకు చెబుతుంది.
అంగణవేదీ వసుధా కుల్యా జలధిః స్థలీ చ పాతాళమ్
వల్మీకశ్చ సుమేరుః కృతప్రతిజ్ఞస్య ధీరస్య
కృతప్రతిజ్ఞస్య అంటే.. కృతనిశ్చయం ఉన్న వ్యక్తికి.. గట్టి నిర్ణయం తీసుకున్న వ్యక్తికి యావత్ భూమండలం కూడా ఒక చిన్న పూతోట లాగా, సముద్రం చిన్న కాలువ లాగా, పాతాళం విహారస్థలంలాగా, మేరు పర్వతం కూడా ఒక చీమల పుట్టలాగా కనిపిస్తాయి. – అనేది శ్లోక భావం.
మనలో కృతనిశ్చయం ఉన్నప్పుడు ఎలాంటి కష్టనష్టాలు కూడా ఇబ్బంది పెట్టవు. అవి మనకు కనిపించవు.
నిజానికి ఇది ప్రతి ఒక్కరికీ కూడా ఎంతో కొంత మేరకు స్వానుభవంలో ఉంటుంది. మనకు ఇష్టమైన పని చేసేప్పుడు చిన్న ఇబ్బందులు వచ్చినా మనం పట్టించుకోం. సైకిలు నేర్చుకునే కుర్రవాడు.. ఆ ప్రయత్నంలో కిందపడి మోకాలికి దెబ్బలు తగిలినా పట్టించుకోడు. దొంగతనాలు చేయాలని డిసైడైన వాడు.. లాఠీ దెబ్బ ఒకటి పడినా పట్టించుకోడు. ఆ వృత్తినే కొనసాగిస్తుంటాడు.
కృతనిశ్చయం అనేది మంచి- చెడు రెండు రకాలుగానూ ఉంటుంది. రెండు విధాలలోనూ కష్టనష్టాలను ఖాతరు చేయకుండా ముందుకు సాగడం ఉంటుంది. అయితే సుభాషిత కారుడు చెప్పినట్లుగా మనం తీసుకున్న కృతప్రతిజ్ఞ.. కృతనిశ్చయం ఎలాంటిది? అనేది మాత్రం మనం బేరీజు వేసుకుంటూ ఉండాలి.
శుభోదయం.
.

Discussion about this post