మాట చాలా విలువైనది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలను నిర్దేశించేది మాటే. మాట- మనుషుల్ని మీ హృదయాలకు దగ్గరగా చేస్తుంది. అలాగే.. మాట- ఎడబాటును కూడా కలిగిస్తుంది. ‘మాటే మంత్రము..’ అని సినీకవి.. ఏదో పాటకోసమే అని ఉండవచ్చు గానీ.. ‘మాటే మంత్రం’ అన్నమాట నిజం. దానికి బోలెడంత బలం ఉంది.
ఇతరులతో మాట్లాడేప్పుడు- మన మాట మీద మనకు అదుపు ఉండాలి. ఫ్లోలో నోరుజారి అనే మాట కూడా ఎదుటి వారిని నొప్పిస్తుంది చాలా సందర్భాల్లో. ఆ మాటలో నెగటివ్ థాట్ ఉన్నది అనే స్పృహ మనకు ఉండకపోవచ్చు. ఒకవేళ నెగటివ్ థాట్ ఉన్నదని తెలిసినప్పటికీ.. మన ఉద్దేశ్యం అది కాకపోవచ్చు. కానీ ఆ సంగతి గ్రహించేలోగా.. మన నోటినుంచి అదుపు లేకపోవడం వలన, అనుకోకుండా జారిన మాట- చేయవలసిన నష్టం చేసేస్తుంది.
ఇతరులకు ప్రియమైన మాటలు మాట్లాడడం వలన రిలేషన్స్ బలపడతాయి. ప్రియంగా మాట్లాడడం అంటే వారు ఏం చెబితే దానికి భజన చేయడం అని కాదు. రిలేషన్స్ కోసం మన భావాల్ని చంపేసుకుని, దాచేసుకుని, ముసుగు వేసుకుని ఎదుటి వాడు చెప్పినదానికి జై కొట్టడం అని కూడా కాదు. ఇవన్నీ మాటలు- చర్చల రూపాన్ని సంతరించుకున్నప్పుడు వచ్చే విషయాలు. అయితే.. ఎదుటి వారికి ప్రియమైన విషయాలు అంటే.. వాళ్ల భావాలు, భావజాలాల చర్చ మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంటాయి.
ఒక మిత్రుడిని కలిసినప్పుడు, ఫోన్ చేసినప్పుడు ‘బాగున్నావా’ అంటాం. ‘ఇంట్లో అందరూ బాగున్నారా’ అంటాం. ప్రియమైన విషయాలు అంటే అవే. ఇవి ఎంత రొటీన్ అయిపోయినా సరే.. ఇతర విషయాల్లోకి మళ్లడానికి ముందు.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యంతో కూడిన ఒక వేదికను ఇవి సిద్ధం చేస్తాయి. అయితే ఇంతేనా, ఇవి సరిపోతాయా?
కేవలం మొక్కుబడి మాటలు కాదు. ఎదుటి వాళ్లకు ఇష్టమైన మాట మాట్లాడడం అంటే.. పై రెండు మాటలకు కొనసాగింపు కూడా ఉంటుంది. మిత్రుడి కుటుంబ సభ్యుల పేర్లు కూడా మీరు గుర్తుంచుకోగలిగితే.. పేరుపేరునా కుశలం అడగండి. మిత్రుడి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోగుల గురించి విచారించండి. సాధారణంగా ఇవన్నీ ఎదుటివారికి ప్రియమైన మాటలే.
మాట గురించి ఓ చక్కటి సుభాషితం ఇలా చెబుతుంది..
ప్రియవాక్యప్రదానేన సర్వే తుష్యన్తి జన్తవః |
తస్మాత్తదేవ వక్తవ్యం ! వచనే కా దరిద్రతా ||
ప్రియమైన మాటలని మాట్లాడడం వలన జనులందరూ కూడా సంతోషిస్తారు. అందుచే ఎప్పుడూ అవే మాట్లాడుతూ ఉంటే సరిపోతుంది కద. మాటలలో దరిద్రం ఎందుకు? .. అనేది భావం.
మాటల్లో దరిద్రం ఎందుకు? నిజమే.. మాటల వల్ల మనకేమీ ఖర్చు కాదు. ఎదుటివాళ్లకు ప్రియంగా మాట్లాడడం అనేది ఎప్పటికీ చాలా మంచి అలవాటు. దానివలన మనం ఖర్చుపెట్టేది గానీ.. నష్టపోయేది గానీ ఏమీ ఉండదు.
మాట్లాడే పద్ధతి గురించి రాగానే.. చాలా మంది.. ‘నేను ఉన్నదున్నట్టుగా మాట్లాడేస్తుంటా’, ‘నాకు ఫిల్టర్ ఉండదు..’, ‘లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం నాకు చేతకాదు..’, ‘అంత లౌక్యం తెలిసిన వాడినే అయితే నేను ఎక్కడో ఉండేవాణ్ని..’ లాంటి డైలాగులు చెబుతుంటారు. నిజానికి ఇవన్నీ కూడా చాలా మంచి అలవాట్లే. అయితే ఇవన్నీ ఈ శ్లోకంలో ప్రస్తావించిన మాటకు సంబంధించిన విషయాలు కానే కావు.
ఇతరులతో చర్చల్లో భావాలను పంచుకునే విషయంలో ఇలా ఫిల్టర్ లేకుండా, ఉన్నదున్నట్టుగా మాట్లాడే నిజమైన అలవాటు కొందరికి ఉంటుంది. చాలా మంది తమ మాట దూకుడుకు, మాట దురుసుతనానికి ఈ ముసుగు వేసుకుంటారు. అదంతా ఒక ప్రత్యేకమైన వేరే చర్చ.. ఇంకో సందర్భంలో గుర్తు చేసుకోవలసినది.
సినీ కవి చెప్పినట్టు మాటే మంత్రం! మాటలో మీరు ఎదుటివారికి ప్రియంగా మాట్లాడగలిగితే.. ఆ మంత్రం అనుబంధాలను దృఢం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
శుభోదయం
.