మన జీవితాన్ని మనమే ఆస్వాదిస్తాం. బతుకుల్లో తీపి చేదులను మనమే అనుభవిస్తాం. మన విజయాలకు మనం మురిసిపోతాం. మన కష్ట నష్టాలకు మనమే బాధ్యులం అని కూడా అనుకుంటాం. అయితే మన జీవితంలో ప్రతి క్షణాన్ని మనమే నిర్మించుకోవాలని.. స్వయం చోదితంగా మన బతుకు బండి నడవాలనే విషయంలో కొంత రాజీ పడుతుంటాం. ఎందుకు?
Dads gift అని రాసి ఉన్న రెండు లక్షల రూపాయల అతి ఖరీదైన మోటార్ బైక్ పై తిరగడం ఎంతో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అయితే అదే అత్యంత ఖరీదైన మోటార్ బైక్ ను.. స్వయంగా సొంత సంపాదనతో కొనుక్కుంటే గనుక, ఆనందంతో పాటు ఒక అద్భుతమైన సంతృప్తి కూడా దొరుకుతుంది! ఆనందానికి సంతృప్తికి మధ్య ఉండే దూరాన్ని మనం మరిచిపోతున్నాం! చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంటారు. అయితే ఆ క్రమంలో వారు జీవితాన్ని సంతృప్తికరంగా తయారు చేసుకునే అవకాశాన్ని తగ్గిస్తూ ఉంటారు.
ఈ విషయాన్ని మనకు చాలా సరళమైన భాషలో ఒక సంస్కృత సుభాషితం వివరిస్తుంది..
ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పిత్రార్జితం
అధమం భ్రాతృ విత్తం చ స్త్రీ విత్తం అధమాధమం
స్వయంగా సంపాదించుకున్న సొమ్ము ఉత్తమమైనది. తండ్రి ద్వారా సంక్రమించినది మధ్యమమైనది. సోదరుల ద్వారా పొందే సొమ్ము అధమం. అలాగే స్త్రీ ద్వారా కోరుకునే సొమ్ము మరింత నీచమైనది. ..అని శ్లోక భావం.
బుడి బుడి అడుగులతో నడక నేర్చుకుంటున్న ఒక పసిపిల్లవాడు పడిపోయిన ప్రతిసారీ మనం లేపి నిల్చోబెడతాము. వాడి బతుకు ప్రస్థానం మొదలు కావడంలో అది తొలి దశ. అలాంటి సందర్భంలో.. మీ సాయం లేకుండా వాడు తొలిసారిగా నడిచిన సందర్భాన్ని గుర్తుచేసుకోండి! వాడి మొహం లో ఒక అనల్పమైన ఆనందం కనిపిస్తుంది. ఆ ఆనందం ఎలాంటి తూకం రాళ్లతో అయినా కొలవగలిగేది కాదు! ఒకరి సాయం ఆశించకుండా.. తన అడుగు తానే వేయగలిగాననే సంతృప్తి అది! అలాంటి సంతృప్తిని.. జీవితం చిట్ట చివరి క్షణం వరకు కాపాడుకోవాలి! అలా కాపాడుకోగలిగిన వాడు ధన్యుడు! ‘సెల్ఫ్ మేడ్’ అనేది ఒక గర్వ ప్రతీక.
తమ జీవితాన్ని తామే నిర్మించుకోవడంలో ఉండే మధురిమను ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలి. అధర్మంగా పరిగణించే ధనాన్ని ఇతరుల నుంచి ఆశించకుండా ఉండే తత్వం అలవాటు అయితే సమాజంలో సగం అరాచకాలు కూడా సమసిపోతాయి.
సుభాషితకారుడు– స్త్రీ ద్వారా ఆశించే ధనం గురించి చెప్పిన మాటలను మనం గుర్తుంచుకుంటే సమాజంలో వరకట్నం లాంటి దురాచారం ఎప్పటికీ కనిపించదు. దీని చుట్టూ ఎన్ని రకాల కలతలు, కలహాలు కుటుంబాలలో నెలకొంటున్నాయో.. ఎన్ని రకాలుగా జీవితాలు ఛిద్రం అయిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
సంపన్నులను సమాజం చాలా గౌరవంగా చూస్తుంది. ఇది చాలా సహజం. అయితే ఆ సంపదను తమకు తాముగా సృష్టించుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వారిని మరింత గౌరవంగా చూస్తుది.
ఒకరినుంచి ఆశించడం అనేదే అసంతృప్తికి బీజం! ఒకరి సంపదలు మనకు దక్కాలనే ఊహ.. మన స్వేదం లేకుండా.. మన చెమట చిందకుండా.. మన కష్టం తెలియకుండా.. దక్కే సుఖం యావత్తూ కూడా క్షణికం మాత్రమే. తాత్కాలికంగానే అది మనకు ఉంటుంది. అలా కాకుండా స్వయం నిర్మితమైన జీవితాన్ని ఆస్వాదించే తత్వం.. శాశ్వతమైన సంతోషాలను సంతృప్తిని మనకు అందిస్తుంది.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post