‘కోరిక’ అనేదే గనుక లేకుంటే మనిషి ఒక అడుగైనా ముందుకు వేస్తాడా? ఎక్కడ ఉన్నవాడు అక్కడే అచేతనంగా, జడంగా మారిపోయి పడుండడా? కోరిక, ఆశ మాత్రమే మనిషిని ముందుకు నడిపించే చోదకశక్తులు driving forces కదా! కోరికల విషయంలో ఆధ్యాత్మ వాదులు.. కోరికలను చంపుకోవాలనే హితవు చెబుతుంటారు ఎందుకు? అనే ప్రశ్నలు చాలా మందికి ఎదురవుతుంటాయి.
కోరిక- ఉండాలా? వద్దా? అనే మీమాంస చిన్నది కాదు. కోరిక ఉండని జీవితం ఉండదు. అన్నీ వదిలేశాం… సర్వసంగ పరిత్యాగులం అనే చెప్పుకునే వారు కూడా.. మోక్షప్రాప్తికోసం బలమైన కోరికను పెంచుకుని.. అందుకోసం దేవుడిని ఆశ్రయించి గడుపుతుంటారు. అందుకోసం దేవుడిని impress చేసే ప్రయత్నంలో ఉంటారు. మరి కోరిక లేనిదెవరికి? కోరికలు ఉండొద్దు.. అని చెప్పగల అర్హులు ఎవరున్నారు మన చుట్టూ? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు.
కోరికను జయించి బతకడం అనేది మానవమాత్రులకు సాధ్యమయ్యే పని కాదు. జయించినట్టు చెప్పుకునే వారు.. అసలైన లాలసులు. ‘కోరికను జయించలేం’ అనే నిజాన్ని ముందుగా మనం ఆమోదించగలగాలి. కోరిక ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే ఎంతవరకు ఆ కోరికను మనం నియంత్రించుకుని ఉండగలం అనేది.. మనలోని పరిణతి మీద ఆధారపడి ఉంటుంది. అతి సర్వత్ర వర్జేయత్ అనేది అన్నింటిలాగే కోరికలకు కూడా వర్తిస్తుంది. ఇదే విషయాన్ని ఒక సుభాషితం కూడా ఇలా చెబుతుంది.
అతితృష్ణా న కర్తవ్యా తృష్ణాం నైవ పరిత్యజేత్
శనైః శనైశ్చ భోక్తవ్యం స్వయం విత్తముపార్జితం
అతిగా కోరికలు పెంచుకోవడం సరైన పని కాదు. అలాగని కోరికలను విడిచిపెట్టేయడం కూడా సరికాదు. స్వయంగా ఆర్జించిన సంపదను మనం నెమ్మది నెమ్మదిగా అనుభవిస్తూ ముందుకు సాగాలి. ..అనేది శ్లోకభావం.
సాధారణంగా ప్రపంచంలో జీవితాన్ని గురించిన, కోరికలను గురించిన రెండు దృక్కోణాలు ఉంటాయి. కోరిక అంటేనే అది దుఃఖహేతువు అని, మనిషిని నెమ్మదిగా శిథిలం చేసేస్తుందని చెప్పేవాళ్లుంటారు. కాబట్టి కోరికలను పూర్తిగా విసర్జించాలని కూడా అంటారు. అలాగే.. మనలో పుట్టే అన్ని కోరికలను తీర్చేసుకోవాలని వాదించేవారూ ఉంటారు. కోరికలను తీర్చేసుకోవడం మాత్రమేత జీవితానికి సంతోషాన్నిస్తుందని అంటుంటారు.
ఇందులో మొదటి వాదనను పాటించడం చాలా చాలా కష్టం. పైగా ఈ కోరికలను అణచిపెట్టుకోవడం అనేది ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడానికి కూడా కారణం కావొచ్చు. రెండో వాదనలో సామాజికంగా, ఆచరణలో అది సరికాదు. ఎందుకంటే అన్ని కోరికలను తీర్చుకోవడం అనేది ఉండదు. ఒక కోరిక తీరితే మరో కోరిక ఆటోమేటిగ్గా పుట్టుకొస్తూ ఉంటుంది. అందుకే ఈ సుభాషితం మధ్యేమార్గాన్ని సూచిస్తుంది.
ఈ సుభాషితం ఆ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. అతి కోరికలు తగవు. కోరికలను విడిచిపెట్టడమూ తగదు.. అనడంతో పాటుగా.. ఈ సుభాషితం చెప్పే మరో గొప్ప విషయం.. ‘స్వయం విత్తం ఉపార్జితం’ అనేది!
శనైః అంటే మెల్లగా అని భావం. మెల్లగా తిరిగే వాడు గనుకనే శనైశ్చరుడు అని శని దేవుడిని అంటారు. సూర్యుడి చుట్టూ శనిగ్రహం కూడా చాలా నెమ్మదిగా తిరుగుతుంది. మెర్కురీ, వీనస్, భూమి, మార్స్, జూపిటర్ గ్రహాలతో పోలిస్తే శనిగ్రహం తిరిగే వేగం చాలా తక్కువ. అందుకే దానికి ‘శనైః చరుడు’ (మెల్లగా తిరిగేవాడు) అని పేరు పెట్టారు. ఈ సుభాషితంలో.. శనిదేవుడి (శనిగ్రహం) ప్రస్తావన లేదు. మెల్లగా అనే అర్థం మాత్రమే ఉంది.
స్వయంగా సంపాదించిన సంపదను మెల్లమెల్లగా అనుభవించాలి- అని ఈ సుభాషితం చెబుతుంది. అంటే.. మన కోరికలు అన్నీ కూడా మన స్వార్జితంతో తీరగలవే అయి ఉండాలి. కోరికల పట్ల నియంత్రణ పాటించడం అంటే అదే. స్వార్జితంతో పూర్తి కాలేనివి.. స్వయంగా సంపాదించదగిన పరిధికి మించినవి.. కోరికలు ఉంటే- మళ్లీ ప్రమాదకరమే. కోరికల విషయంలో ఈ చిన్న మెలికను బోధపరచుకుంటే జీవితం సుఖప్రదంగా ఉంటుంది.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post