జర్నలిస్టుగా, రచయితగా, ప్రచురణకర్తగా డాక్టర్ గోవిందరాజు చక్రధర్ ది సుదీర్ఘ ప్రస్థానం. రచయితగా, ప్రచురణకర్తగా ఆయనకు ఎదురైన స్వానుభవాలు ఈ Writer’s Blues. నలభైకి పైగా పుస్తకాలు తీసుకువచ్చిన వ్యక్తిగా.. ఆయన అనుభవాలను adarsini.com పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు. ఆ వ్యాసపరంపరలో ఇది ఆరవది.
జర్నలిస్టు దిగ్గజాల మధ్య కూడా ఈసునసూయలు ఉంటాయి. పంతాలు, పట్టింపులు ఉంటాయి. సామాజిక స్పృహకు పేరు మోసిన పెద్దలు కూడా మానవాతీతులు కాదు. వారి అలకలు, అసంతృప్తులతో సర్దుకు రావడం ఒక్కోసారి కత్తిమీద సాము అవుతుంది. అలాంటి అనుభవం కలిగించిన పుస్తకం ‘జర్నలిస్టుల కోసం’!
ఆరోజు పొద్దునే పొత్తూరి వెంకటేశ్వరరావు ఫోనుచేసి కాస్తంత గట్టిగానే క్లాసు తీసుకున్నారు. ఆయనా నాలాగే మనసులో ఏదీ దాచుకోలేరు మరి. అభినందించాల్సి వచ్చినా అంతే.
అంతకుముందు సాయంత్రం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘జర్నలిస్టుల కోసం’ పుస్తకావిష్కరణ సభ పెద్ద ఎత్తున నిర్వహించాను. ఆవిష్కరణ సభకు నాటి హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ ముఖ్య అతిధిగా వచ్చారు. జి.కృష్ణ, పొత్తూరి వెంకటేశ్వరరావు, వాకాటి పాండురంగారావు, బూదరాజు రాధాకృష్ణ, కె.రామచంద్రమూర్తి, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. నా పిహెచ్.డి. గైడ్ వి.కిషన్ రావు సభాధ్యక్షులుగా వ్యవహరించారు.
చాలా ఏళ్లనుంచి పరిచయం ఉన్న ఆత్మీయులు ఐ.ఎ.ఎస్. స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆర్.సి.రెడ్డికి ‘జర్నలిస్టుల కోసం’ పుస్తకాన్ని అంకితమిచ్చాను. ఆయనా సభకు హాజరయ్యారు. పుస్తకావిష్కరణ సభకంటే ముందు జర్నలిజం సదస్సును కూడా నిర్వహించాను. సుందరయ్య విజ్ఞానకేంద్రం హాలు నిండింది. 1997 జూన్ నాటి సంగతులివి. ఆరోజుల్లో సుందరయ్య విజ్ఞానకేంద్రం అద్దె రూ.2500 ఉండేది. అప్పటికది పెద్ద మొత్తమే.
అసలు విషయానికి వస్తాను. పొత్తూరి వెంకటేశ్వరరావు ఫోనులో నాతో మాట్లాడిన విషయాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.
‘‘బ్రదర్! నువ్వొక జర్నలిజం కాలేజీకి ప్రిన్సిపల్ వి. నీ అవగాహన కోసం చెబుతున్నాను, నేను ఆంధ్రప్రభ దినపత్రికలో రాసిన ఎడిటోరియల్స్ కి బాగా పాపులారిటీ ఉండేది. ఒకసారి నేను రాసిన ఎడిటోరియల్ ను ప్లకార్డులపై ప్రదర్శిస్తూ ప్రొద్దుటూరులో ఊరేగింపు నిర్వహించారు. వారి ఆందోళనకు మద్దతుగా నా ఎడిటోరియల్ ను ప్రదర్శించారు. జి.కృష్ణ చిత్తూరులో ఆంధ్రప్రభకు రెసిడెంట్ ఎడిటర్‌గా ఉండేవారు. వారంలో కొన్ని రోజులు ఆయన ఎడిటోరియల్స్ రాసి పంపేవారు. అయితే ఏరోజు ఆయన ఎడిటోరియల్ రాస్తారో రాయరో కచ్చితంగా తెలిసేదికాదు. రాసినపుడు రాసేవారు, లేనప్పుడు లేదు.’’
also read : ఇది సర్కారీ దందా.. జగన్ వెనక్కి తగ్గాల్సిందేనా
పొత్తూరి వాగ్ధాటికి నేను అడ్డు తగలలేదు. ఆయనకు బాగా కోపం వచ్చిందని అర్ధమవుతోంది. పొత్తూరి సంభాషణ సాగించారు.
ఎడిటర్ అంగుష్ఠమాత్రుడా!
‘‘అదేమిటి బ్రదర్! ఆ కవర్ మీద జి.కృష్ణను ఆజానుబాహుడిగా చిత్రీకరించి ఎడిటర్ ని అంగుష్ఠమాత్రుడిగా ఆయన కాళ్ల దగ్గర ఉంచారు. ఇదేమీ బాగాలేదు.’’ నిష్టూరంగా అన్నారు పొత్తూరి.
పొత్తూరి వెంకటేశ్వరరావు ఇంత తీవ్రంగా స్పందించడానికి ఒకటి కాదు- ఎక్కువే కోణాలు ఉన్నాయనిపించింది. నేను వాటిని ఇలా క్రోడీకరిస్తాను.
also read : ‘రామ్’ బాణమ్ : కులపిచ్చి నాయకమ్మన్యుల ఫత్వా పాలిటిక్స్!
జర్నలిస్టుల కోసం పుస్తకంలోకూడా ఇంటర్‘వ్యూ’ పాయింట్ శీర్షికలో నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, వి.వాసుదేవ దీక్షితులు, కె.రామచంద్రమూర్తి, జి.కృష్ణ ఇంటర్వ్యూలు పొందుపరిచాను. ఈ పుస్తకం ఎందుకు చదవాలి? శీర్షికలో బూదరాజు రాధాకృష్ణ ముందుమాట రాశారు. ప్రసిద్ధ చిత్రకారుడు తాడి మోహన్ కవర్ డిజైన్ చేశారు. లోపల కొన్ని కార్టూన్లు గీసిచ్చారు. ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రముఖుల క్యారికేచర్లను శంకర్ గీశారు. నల్లగొండ జిల్లాలో డ్రాయింగ్ మేస్టారు గిరీకి గుడ్ బై చెప్పి మోహన్ దగ్గర శంకర్ శిష్యరికం చేస్తున్న రోజులవి. క్యారికేచర్లను శంకర్ గీయగా వాటిని చూసిన మోహన్ కొన్ని సూచనలు చేసి మెరుగు పరిచేవారు.
పొత్తూరికి నచ్చలేదు
పొత్తూరి వెంకటేశ్వరరావు గుంటూరులో చదువుకునే సమయంలో తాలింఖానాకు వెళ్లి వ్యాయామాలు చేస్తుండేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని బస్కీలు తీస్తున్నట్టుగా పొత్తూరి క్యారికేచర్ ను గీయాలని మోహన్ సూచించాడు. వాసుదేవ దీక్షితులు తన సంపాదకీయాల సంకలనానికి ‘ఖడ్గధార’ అని శీర్షిక పెట్టడంతో గుర్రంపై స్వారీ చేస్తున్న దీక్షితులు, చేతిలో ఖడ్గమూ, ఆ ఖడ్గానికి తెగిపడిన శిరస్సులనూ వ్యంగ్యంగా చిత్రీకరించారు.

బూదరాజు రాధాకృష్ణ, నండూరి రామమోహనరావుల క్యారికేచర్లు వారి మేధావితనాలకు దర్పణం పట్టేలా చూపారు. న్యూస్ పేపర్ నే శరీరంపై చూపుతూ కె.రామచంద్రమూర్తి క్యారికేచర్ గీశారు శంకర్. జి.కృష్ణ పొడగరి. దీంతో ఆ పొడుగును హైలైట్ చేస్తూ శిఖర సమానుడిగా గీశారు. ఆయన కాళ్ల దగ్గర మూడునాలుగు చిన్న బొమ్మలను గీసి, ఆయనను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపారు. వాటిలో ఒక బొమ్మపై ఎడిటర్ అని రాశారు.
క్యారికేచర్ల సరళి పొత్తూరి వెంకటేశ్వరరావుకు పూర్తి ఆశాభంగం కలిగించింది. మరీ ముఖ్యంగా ఎడిటర్ బొమ్మను అంగుష్ఠ మాత్రుడిగా చేసి కృష్ణ పాదాల కింద ఉంచడం కష్టం కలిగించింది. పుండుమీద కారం చల్లినట్లుగా తనను మల్లయోధుడిగా చూపారు. బుద్ధిజీవులైన వారిని కేవలం శరీర దారుఢ్యానికి పరిమితం చేయడం పొత్తూరి వారిని నొచ్చుకునేలా చేసింది.
also read : ఘంటసాల 3 : తొలి అడుగులు ముళ్లబాటలోనే
క్యారికేచర్లతో కూర్చిన ఈ కవర్ పై ఈ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుందని ఊహించలేదు. పైగా పుస్తకావిష్కరణ సభలో వయసులో అందరికంటే పెద్దవారన్న ఉద్దేశ్యంతో జ్యోతి ప్రజ్వలనను జి.కృష్ణతో మొదలుపెట్టించాం.
జి.కృష్ణ మాటల సంచిక
మిగిలిన వారి ఇంటర్వ్యూలు ఏడెనిమిది పేజీల నిడివిలో ఉండగా ఒక్క జి.కృష్ణ ఇంటర్వ్యూ మాత్రం ఏకంగా ముప్ఫై పేజీలకు విస్తరించింది. జి.కృష్ణను సమగ్రంగా, విభిన్న కోణాల్లో ఇంటర్వ్యూలు చేయాలన్న సంకల్పంతో కొన్ని రోజుల పాటు వరసగా ఆయన ఇంటికి వెళ్లి సమాధానాలు రాబట్టాను. ‘జి.కృష్ణ మాటల సంచిక’ అని కృష్ణ గారే తన ఇంటర్వ్యూకు శీర్షికను పెట్టారు.
నా అనుభవ రాహిత్యం
మిగిలిన వారికంటే జి.కృష్ణకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశమైతే నాకేమీ లేదు. కానీ చివరకు వచ్చేసరికి అలా తేలింది. నా అనుభవరాహిత్యం కూడా కారణం కావచ్చు. ఇప్పుడైతే రాబోయే విపరిణామాలను ముందే ఊహించి కవర్ డిజైన్ నుంచి ఇంటర్వ్యూ దాకా అన్నింటా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవాడిని.
క్యారికేచర్లను ఎ-4 సైజుకు ఎన్‌లార్జి చేయించి వాటికి మోహన్ తోనే కలరింగ్ చేయించి ప్రజంట్ చేశాను. దీక్షితులుకి కూడా తన క్యారికేచర్ నచ్చలేదు.
బాపట్ల నుంచి వ్యాఖ్యాత
బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో హిందీ రీడర్‌గా పనిచేసిన డాక్టర్ కె.వి.ఎస్.ఆచార్య సభా నిర్వహణలో అందెవేసిన చేయి. నా మిత్రుడు బాపట్ల ఎగ్రికల్చరల్ కాలేజి ప్రొఫెసర్ పి.వి.రామకుమార్ సహకారంతో సభానిర్వహణ కోసం కె.వి.ఎస్.ఆచార్యను ప్రత్యేకంగా ఆహ్వానించాం. అయితే సభాధ్యక్షుడి పాత్రను పరిమితం చేసి సభను ఆచార్యతో నిర్వహించడం వేదిక మీదున్న కొందరు పెద్దలకు నచ్చలేదు.

వాకాటి పాండురంగారావు గారు ప్రచురించిన పుస్తకం మీద రాసుకున్న విషయాలను తీసుకుని, వాకాటి పరిచయ వాక్యాలు రాసి ఆచార్యకు ఇచ్చాను. వాకాటి కొంతకాలం విశాఖ పోర్ట్ ట్రస్టులో పి.ఆర్.వో.గా పనిచేసినట్లు స్వయంగా రాసుకున్నారు. అదే విషయాన్ని పరిచయంలో చెప్పగా వాకాటి అభ్యంతరం చెప్పారు. తాను ఎన్నడూ పి.ఆర్.వో.గా పనిచేయలేదని అన్నారు. నిర్వాహకులు తనకు రాసిచ్చిన ప్రకారమే అలా చెప్పాల్సి వచ్చిందని ఆచార్య వివరణ ఇచ్చారు.
అసంతృప్తులు, అలకలు ఉన్న మీడియా హౌస్ పబ్లికేషన్స్ తరపున ప్రచురణ రంగంలో కాలిడి ముందుకు సాగటానికి ‘జర్నలిస్టుల కోసం’ పుస్తకం గట్టి పునాది ఏర్పరచింది.
కొసమెరుపు
జర్నలిజానికి చెందిన ప్రముఖులు అనేకమంది పాల్గొన్న ఈ సభలో చివరకు ఆ ప్రముఖులందరితో గ్రూప్ ఫోటో తీయిస్తే ఎంతో బావుండేది. వాకాటి పాండురంగారావు కూడా ఈ విషయాన్ని తర్వాత నా దృష్టికి తెచ్చారు. ఏంచేస్తాం, ఆ హడావిడిలో నాకు తోచలేదు. ఇప్పటికీ ఆ విషయం గుర్తొస్తే బాధ కలుగుతుంది. ఒక అరుదైన ఫోటో అవకాశాన్ని మిస్ అయ్యానే అనుకుంటాను.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
మోహన్ దగ్గర శిష్యరికం చేసిన శంకర్ నా దగ్గర జర్నలిజం డిప్లమా కోర్సులో కూడా చేరాడు. బస్సుపాస్ సౌకర్యం కూడా కల్పించాను. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో కార్టూనిస్టుగా రాటుదేలి ప్రస్తుతం సాక్షి కార్టూనిస్టుగా తన ప్రతిభను చాటుకుంటున్నారు శంకర్.
‘జర్నలిస్టుల కోసం’ పుస్తకం రీ ప్రింట్ చేయాల్సినపుడు పొత్తూరి అభ్యంతరం గుర్తొచ్చి జి.కృష్ణ కాళ్ల కింద ఉన్న చిత్రాల్లో ఒక దానిపై ఉన్న ‘ఎడిటర్’ అక్షరాలను తీసేయించాను.
.. డాక్టర్ గోవిందరాజు చక్రధర్

.