నందిత అరవింద్ మొరార్జీ… ఈ పేరు చెబితే ఎవరు అని మనల్ని తిరిగి ప్రశ్నార్ధకంగా చూస్తారు. అదే నగ్మా… అంటే చాలామందికి ముఖ్యంగా 1990-2000 దశకం వాళ్లకి ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పట్టో అటు తమిళ, హిందీ భాషా చిత్రాలతోబాటు ఇటు తెలుగు చిత్ర సీమను తన అందాలతో అలరించిన నటి. ప్రేమికుడు చిత్రంలో తన ప్రియుడిని ప్రేమించే ప్రేయసిగా ఎంతగా తన ప్రేమను కురిపించిందో అలాగే ఒక పొగరున్న కంపెనీ ఓనరుగా, ధన దర్పంతో తుళ్లిపడే భార్యగా ఘరానా మొగుడులో చిరంజీవిని కవ్వించిన నాయకిగా, ధనవంతుడి కూతురే అయినా ఆ ధనగర్వం తనకు కించిత్ కూడా అంటకుండా ఉంటూ… తన తోటివారికి సాయం చేస్తూ నిరాడంబరంగా జీవించే మాణిక్యం ను ప్రేమించిన ప్రియగా బాషా ఒడిలో ఒదిగిపోయింది. ఇలా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మళయాళం, కన్నడ, బెంగాలీ, పంజాబీ, భోజ్ పురి చిత్రాలలో కూడా నటించింది. అయితే ఆమె నటించిన చిత్రాలు చాలా వరకు ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్నవే. ముఖ్యంగా ప్రేమికుడు చిత్రంతో ఆమె అలనాటి ప్రేమికుల మదిలో చిరస్థానాన్ని సంపాదించుకుందంటే అతిశయోక్తి కాదేమో.
ఓ చెలియా నా ప్రియసఖియా చే జారెను నా మనసే… అన్న పాట ఆనాటి ప్రేమికుల నోటిలో నిత్యం నానుతూ వుండేది. అంతలా ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నగ్మా తల్లి ముస్లిం, తండ్రి హిందువు. అందువల్ల తాము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని చెప్పుకునే నగ్మా, తన తండ్రినుండి తల్లి విడిపోయినా, తాను మాత్రం తండ్రి చనిపోయే వరకూ ఆయనకు సన్నిహితంగానే వుండేది. నగ్మా తండ్రి అరవింద్ ప్రతాప్ సింహ్ మొరార్జీ. జైసల్మేర్ రాజరిక నేపథ్యం గల పూర్వీకుల కుటుంబానికి చెందినవాడు. వీరికి పలు ఫ్యాక్టరీలు వుండేవి.
నగ్మా ‘బాగీ: ఎ రెబల్ ఫర్ లవ్’ చిత్రంతో తన తెరంగేట్రం ప్రారంభించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ హీరో. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఈ చిత్రం ఏడవ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఆమె తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. ఆమె నటించిన చిత్రాలు అన్నీ కూడా దాదాపు భారీ వసూళ్లను చేసిన సినిమాలుగానే చెప్పుకోవచ్చు. దక్షిణాదిలో తన స్నేహితురాలైన దివ్యభారతి తెలుగు చిత్రరంగంలో నటిస్తున్న సమయంలో సుమన్ హీరోగా పెద్దింటల్లుడు అనే సినిమాతో తెలుగు తెరపై ప్రవేశించిన నగ్మా తెలుగు అగ్ర హీరోల సరసన తన చక్కటి నటనతో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో ఆమె పలు చిత్రాలలో నటించింది. తెలుగు, తమిళ చిత్రాలతోబాటు పలు భాషా చిత్రాలలో కూడా నగ్మా తన ప్రతిభను ప్రదర్శించింది. పలు అవార్డులను అందుకుంది. భోజ్ పురిలో నగ్మా నటించిన మొదటి చిత్రం ‘పండిత్ జీ బటాయిన బియాహ్ కబ్ హోలీ’. ఈ చిత్రం అక్కడ హిట్టయ్యింది. తర్వాత ఇదే భోజ్ పురి లో నగ్మా ‘దుల్హా మిలాల్ దిల్దార్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు బోజ్ పురి ఫిలిం పురస్కారాల్లో ఉత్తమ నటి పురస్కారాన్ని పొందింది.
అలాగే పంజాబీలో ఆమె రాజ్ బబ్బర్ తో కలిసి ‘ఏక్ జింద్ ఏక్ జాన్’ చిత్రంలో నటించింది. ఇలా పలు చిత్రాల్లో చక్కటి నటనను ప్రదర్శించిన నగ్మా తర్వాత సినిమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత 2002లో జూనియర్ ఎన్టీఆర్ కు అత్త పాత్రలో నటించింది. తర్వాత సినిమాలకు దూరంగా వుంటూ వచ్చింది. తర్వాత ఆమె తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించింది.
మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా హైదరాబాద్ లో ప్రచారం చేసిన నగ్మా తర్వాత తన రాజకీయ ప్రవేశం గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానాలు, అలాగే పేద ప్రజల పట్ల ఆ పార్టీ నిబద్ధత తనకు నచ్చాయి కాబట్టి తాను ఆ పార్టీలో చేరానని, తద్వారా రాజీవ్ గాంధీ కి తన మద్దతు తెలిపినట్లు ఆమె చెప్పుకున్నారు.
తనకు లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేయడానికి అవకాశాలు వచ్చినపుడు తాను పార్లమెంటు మెంబరుగా ఎంపిక కావాలంటే నూటికి నూరుశాతం ప్రజాసేవలోనే ఉండాలని కానీ ఇప్పుడు తనకు అంత సమయం లేదు కనుక తాను పోటీ చేయబోవడం లేదని ఆమె తప్పుకున్నారు. తర్వాత కాలంలో రాజకీయంగా ఆమె తెరమరుగైనా ఆమె ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
నగ్మా తన తల్లిదండ్రుల గురించి చాలా గర్వంగా చెప్పుకుంటూ తన తల్లి చట్టపరంగానే విడాకులు తీసుకున్నారని చెబుతారు. నగ్మా తల్లి మహారాష్ట్ర లోని కొంకణ్ ప్రాంతంలోని కాజీ స్వాతంత్ర్యోద్యమ కారుల కుటుంబానికి చెందినది. ఆమె పేరు షమా కాజీ. సీమ గా ఆమె పరిచితురాలు. అరవింద్ ప్రతాప్ సింహ్ మొరార్జీని ఆమె వివాహం చేసుకున్నా, 1974లో వారు విడాకులు తీసుకున్నారు. తర్వాత సీమ చందన్ సదనాహ్ అనే సినీ నిర్మాతను వివాహం చేసుకున్నారు. అతనికి అప్పటికే రోషిణి, జ్యోతిక అనే ఇద్దరు పిల్లలు. జ్యోతిక కూడా మనకు పరిచితురాలే. సినీ జీవితం తర్వాత నగ్మా బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి, మంచి విజయాన్ని సాధించినా, తండ్రి కోసం ఆయనకు సేవ చేయడంకోసం చివరికి తన వ్యాపారానికి స్వస్థి చెప్పి, అతని చివరి రోజుల్లో ఆయనవద్దే గడిపింది.
ఇలా ఒకప్పుడు తన అందచందాలతో అభిమానుల గుండెల్లో చిచ్చుపెట్టిన అందాల తార నగ్మాకు ఈరోజు ఆదర్శిని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
హ్యాపీ బర్త్ డే నగ్మా… అలియాస్ నందిత…
Discussion about this post