బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయి స్వతంత్రంగా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోగల స్థితిలో ఉన్నారా? అనేది ఇవాళ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెద్ద చర్చ! ఎందుకంటే.. బాలినేని ఏ రోజు కూడా స్వతంత్రంగా ఒక గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడిగా తనను తాను నిరూపించుకోలేదు.
ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన రికార్డు ఆయనకు ఉంది. అలాంటిది.. ఆయన, తనకు స్వయంగా బంధువు కూడా అయిన జగన్మోహన్ రెడ్డిని తోసిరాజని, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని జనసేన పార్టీలో చేరుతారా? నిజమేనా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
బాలినేని- జగన్ మీద గుస్సాగా ఉన్నమాట నిజమే కావొచ్చు. మంత్రి పదవి నుంచి తనను తప్పించబడిన అనేక మంది మాజీలు జగన్ మీద కోపంగానే ఉంటారు. కానీ.. వారిలో పార్టీని వీడిపోగల ధైర్యం ఉన్నది ఎందరికి? ఆ మాటకొస్తే.. తతిమ్మా మాజీలకంటె బాలినేనికే ధైర్యం తక్కువని అనుకోవాలి. కానీ.. ఆయన మాత్రం పవన్ కల్యాణ్ తో ప్రస్తుతానికి స్నేహసంబంధాలను నెరపుతున్నట్లుగా కనిపిస్తోంది.
చేనేత వస్త్రాల విషయంలో పవన్ కల్యాణ్ చాలెంజ్ విసరడమూ, బాలినేని స్వీకరించడమూ ఆదిగా.. ఆయన పార్టీ ఫిరాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన దానిని ఖండిస్తున్నారు. కాకపోతే.. ఆయన జనసేన వర్గాలతో చేరికకు మంతనాలు సాగిస్తున్నారని.. ఇంకా ఫైనల్ డీల్ కుదరలేదని కూడా ఒక వాదన వినిపిస్తోంది.
కానీ స్థూలంగా గమనించినప్పుడు.. బాలినేని వ్యవహారం ‘‘నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండు రెడీ.. డేటు రెడీ ప్లేసు రెడీ పెళ్లాడుకుందాం ఇష్టపడి’’ అంటూ సాగిపోయే సినిమా పాటలాగా ఉంది. జనసేనలో చేరడానికి బాలినేని ఓకే అన్నట్టుగా పుకార్లున్నాయి. ఆయనను చేర్చుకోవడానికి.. అసలే కీలకనాయకులంటూ ఒక్కరు కూడా లేని జనసేన పార్టీ డబల్ ఓకేగా ఉంటుంది.
ఇష్టపడి వాళ్లు పెళ్లాడుకుంటే ఎలా ఉంటుందో మనం చెప్పలేం గానీ.. వ్యవహారం అంతవరకు వెళ్లే అవకాశాలే తక్కువ. వైఎస్సార్ ప్రాపకంతో, బంధుత్వంతో ఆయన అభిమాన ప్రపంచపు ఓటు బ్యాంకును తన బలంగా మార్చుకుని బాలినేని ఎదిగారే తప్ప.. వైఎస్ జగన్ ను కాదని గెలవగల స్థాయి నాయకుడు కాదని పలువురు అంటున్నారు.
.