శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమీపంలోని స్వర్ణముఖినది ఒడ్డున శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పక్కనున్న కర్మ క్రియలు మండపాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు అలంజూరు తారక శ్రీనివాసులు ఆదేశించారు.
ఈ మేరకు ఆయన బుధవారం కర్మక్రియల మండపం పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మండపం సమీపంలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న వస్త్రాలను గమనించి వెంటనే శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ కు ఫోను చేసి తొలగించాలని సూచించారు.
శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ వెంటనే స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, మేస్త్రీ శ్రీకాంత్ సిబ్బంది ద్వారా 2 ట్రాక్టర్ల వస్త్రాలను వెంటనే తొలగించి వేశారు.
ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్వర్ణముఖినదిని ముక్కంటి భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు.
మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి స్వర్గ ప్రాప్తి లభించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు స్వర్ణముఖినది ఒడ్డున ఉన్న కర్మక్రియల మండపంలో పూజలు చేయించి.. నదిలో తర్పణం వదులుతుంటారన్నారు.
ఈ పవిత్రను దృష్టిలో ఉంచుకుని ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని ఆయన కోరారు.
.