నిండా ఏడాది కూడా నిండని ఓ పసిపాప ప్రాణాలను గచ్చిబౌలిలోని కిమ్స్ కడల్స్ వైద్యులు ఎక్మో సపోర్టుతో నిలబెట్టారు. తీవ్రమైన న్యుమోనియాతో చేరిన 11 నెలల పాపకు ఇలా ఎక్మో పెట్టడం అత్యంత అరుదు.
ఈ పాపకు ఆస్పత్రికి చెందిన లీడ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సుమన్ లీంగాబత్తిన, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అలేఖ్యల నేతృత్వంలో చికిత్స అందించారు. ఈ కేసు వివరాలను, పాపకు అందించిన చికిత్సను వారు వివరించారు.
“11 నెలల వయసున్న అన్విక అనే పాపకు హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ), న్యుమోనియా సోకింది. ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స చేశారు. అయినా ఆమెకు తగినంతగా ఆక్సిజన్ అందకపోతుండటంతో గచ్చిబౌలిలోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి పంపారు. వెంటనే పాపను ఎక్మో సపోర్టు మీద పెట్టి, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం. అలా ముందుగా 22 రోజుల పాటు ఎక్మో సపోర్టు పెట్టడంతో పాటు, మరో పది రోజులు ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు పాప పూర్తిగా కోలుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి చేశాం.
ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను తీసుకుని, కార్బన్ డయాక్సైడ్‌ను వదిలేస్తాయి. ఈ ప్రక్రియ చేయడంలో ఊపిరితిత్తులు విఫలమవుతున్నప్పుడు వాటికి ఎక్మో ఎంతగానో సహాయపడుతుంది. దానివల్ల ఊపిరితిత్తులు కోలుకుంటాయి. గుండె గానీ, ఊపిరితిత్తులు గానీ సాధారణంగా పనిచేయకుండా తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు, మామూలు చికిత్సా పద్ధతులు పనిచేయనప్పుడు ఎక్మోను ఉపయోగిస్తాం. అన్ని వయసుల వారికీ దాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా హెచ్1ఎన్1, కొవిడ్-19 సమయాల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.
పాశ్చాత్య దేశాల్లో కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు కూడా ఎక్మో సపోర్ట్ అందిస్తున్నారు గానీ, భారతదేశంలో మాత్రం ఇంకా అంతగా ఉపయోగంలోకి రాలేదు. పిల్లలకు ఎక్మో పెట్టడం చాలా సవాలుతో కూడుకున్నది. ఇందుకు ప్రత్యేకంగా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ వైద్యుల బృందం, సీనియర్ నర్సింగ్ బృందం, ఎక్మో పెర్‌ఫ్యూజనిస్టులతో పాటు.. అడ్వాన్స్‌డ్ ల్యాబ్ కేర్ సదుపాయాలు, పరికరాలు అవసరం. గచ్చిబౌలిలోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఈ సదుపాయాలన్నింటితో పాటు ప్రత్యేక వైద్యబృందం కూడా ఉండటంతో పిల్లలకు సమగ్రవైద్యం అందుతుంది. ఎక్మో సేవలను 2012లోనే ప్రారంభించి, ఈ సేవలు అందించే తొలి ఆస్పత్రిగా కిమ్స్ నిలిచింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ సార్లు ఈ సపోర్ట్‌ను ఉపయోగించింది.
.