‘హర హర మహదేవ.. శంభోశంకర’ అంటూ శివనామస్మరణలు.. స్వర్ణాభరణాలతో దేదీప్యమానమై వెలుగుతున్న శివపార్వతులను చూసి తరించి పోయే భక్తజనం.. స్వర్ణముఖినదిలో పుణ్యస్నానాలు..పితృదేవతలకుత తర్పణం సమర్పించే భక్తులు.. శంఖం పూరించే జంగం దేవరలు.. ఇలా ఎటు చూసినా భక్త జన సందోహమే. మహాశివరాత్రి సందర్భంగా సద్యోముక్తి క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగింది.
శ్రీకాహస్తీశ్వర ఆయలంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మంగళవారం వాయులింగేశ్వరుడు నిత్యాభిషేక మూర్తియై భక్తులకు దర్శనమిచ్చారు. పండుగ వేళ స్వామి వారికి ఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలతో పాటు ఉచ్చికాలాభిషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి నవాభిషేకాలు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని వేకువ జామున 2గంటలకే మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య ఆలయ అర్చకులు పవిత్ర మంత్రోచ్ఛరణలు చేస్తూ స్వామివారిని మేల్కొలిపారు.
ఆ తరువాత గోపూజ నిర్వహించారు. పవిత్రస్నానం చేసిన గోవు స్వామి, అమ్మవార్లను దర్శించుకుంది. ఆ తరువాత సర్వదర్శనానికి అనుమతించారు. ఉదయం 5గంటల నుంచి 10.30గంటల మధ్య స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. రుద్రాభిషేకంతో పాటు క్షీరాభిషేకం, పచ్చకర్పూర అభిషేకం, పంచామృత అభిషేకం ఒకదాని వెంట ఒకటి స్వామివారికి వరుసగా చేశారు. ఈ అభిషేకాలతో స్వామివారు తన భక్తులకు నిత్యాభిషేక మూర్తిగా తన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు.
ఎటు చూసినా శివనామస్మరణే
మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వర ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. వేకువ జామున 2గంటలకే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్శనం కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారికి దక్షిణ గోపురం మార్గం నుంచి అనుమతించారు. మహాలఘు దర్శనం ఏర్పాటు చేయడం వలన వీలైనంత త్వరగా భక్తులు దర్శనం చేసుకున్నారు.
స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం భక్తులను బయటకు పంపడానికి స్పటికలింగం సమీపంలో ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకున్న భక్తులు వీలైనంత వరకు మహాద్వారం వైపు రాకుండా చర్యలు తీసుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకునే సమయంలో భక్తులు ‘ఓం నమ:శివాయ… హరహర మహదేవా శంభోశంకరా’ అంటూ పరమేశ్వరుని స్మరించుకున్నారు.
అంతా గందరగోళం
మహాశివరాత్రి పర్వదినాన ముక్కంటి ఆలయంలో సమన్వలోపం కారణంగా అంతా గందరగోళం నెలకొంది. పోలీసులు, ఆలయ ఉద్యోగులు ఎవరికి తోచినట్లు వారు నడుచుకున్నారు. తమకు అనుకూలమైన వారికి అడ్డదారుల్లో దర్శనాలకు అనుమతించడంతో సామాన్య భక్తులు బాగా ఇబ్బందులు పడ్డారు. దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. అధికారుల తీరుపై ఆగ్రహించిన భక్తులు ఆవేశంతో అరుపులు, కేకలు వేశారు. అధికారుల తీరును ఎండగట్టారు. ఈ నేనథ్యంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్వయంగా గేట్ల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన రాకతో చాలా వరకు సమస్య తగ్గింది.
చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి
మహాశివరాత్రి పర్వదినాన సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఈ ఏడాది కొత్తగా వీఐపీలకు ఉదయం 9నుంచి 11గంటల వరకు… సాయంత్రం 4నుంచి 6గంటల వరకు సమయం కేటాయించారు. అయితే ఆలయ అధికారులు ఈ నిబంధన పాటించలేదు. రాజకీయ నేతల సిఫారుసులతో వీఐపీల మార్గంలో విచ్చల విడిగా అనుమతించారు. కొంతమంది నేతలే స్వయంగా తమ అనుచర గణాన్ని వెంట బెట్టుకుని మాటి మాటికీ వీఐపీల మార్గంలో రావడంతో గందరగోళం నెలకొంది. వీరి కారణంగా సామాన్య భక్తుల చాలా ఇబ్బందులు పడ్డారు. నేతల సిఫారసు కారణంగానే పోలీసులు, ఆలయ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అయిన వారికి అంతరాలయ దర్శనం
మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటి ఆలయంలో రాజకీయ పార్టీల నేతలు నిబంధనలు తుంగలో తొక్కారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలుగకుండా మహా లఘు దర్శనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఈ నిబంధన ఉల్లంఘించి… తమ బంధుగణాన్ని, అనుచరులను అంతరాలయ దర్శనానికి తీసుకెళ్లారు.
ఇలా పలు పర్యాయాలు చేయడంతో సామాన్య భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని వద్ద ఒక్కొక్కరికి ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. రాజకీయ పార్టీల నేతలు అంతరాలయ దర్శనానికి వెళుతున్నప్పటికీ… ఆలయ అధికారులు అడ్డుకోలేక ప్రేక్షక పాత్ర వహించారు. ‘‘పదవులు వస్తుంటాయి. పోతుంటాయి. అధికారులు వస్తుంటారు. పోతుంటారు, దేవుని వద్ద కూడా పైరవీలు ఎందుకంటూ’’ క్యూలైన్లో ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తులకు సేవలు
ముక్కంటి ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శనం సందర్భంగా క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, బిస్కట్లు వంటివి అందజేశారు. అడ్డదారుల్లో వచ్చిన భక్తుల వలన మహాద్వారం వద్ద కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యాయి. స్వామి, అమ్మవార్ల గర్భాలయాల్లో నేతి దీపాలు వెలిగించడం వలన మూల విరాట్లు బాగా కనిపించాయి. దీపాల వెలుగులో స్వామి, అమ్మవార్ల మూల విరాట్లను దర్శించుకుని భక్తులు పరవశించి పోయారు. ఈ ఏడాది సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంద్ర విమానంపై శివయ్య వైభవం
మహాశివరాత్రి పర్వదినాన మంగళవారం ఉదయం గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఇంద్రవిమానంపైనా… ఆయన దేవేరి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరం పైనా ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకు మునుపు గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని అలంకార మండపంలో దివ్యాబరణాలతో విశేషంగా అలంకరించారు. ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారిని ఇంద్ర విమానం, అమ్మవారిని చప్పరంపై అధిష్టించి.. మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య పురవిహారానికి తీసుకువచ్చారు.
మూషిక వాహనంపై వినాయకుడు, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి , చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై వీరిని అనుసరించారు. స్వర్ణకాంతులతో ధగధగ వెలిగి పోతూ పురవిహారం చేస్తున్న శివ,పార్వతులను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఇక ఊరేగింపులో మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రదర్శించే వివిధ కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రేపు రథోత్సవం.. తెప్పోత్సవం
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజైన బుధవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10.30గంటలకు రథోత్సవం ప్రారంభం కానుంది. గంగా భవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఒక రథంపైనా… జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మరో రథంపైనా ఊరేగనున్నారు.
ఇక రథోత్సవం పురస్కరించుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాత్రి నారద పుష్కరణిలో శివ, పార్వతులు తెప్పలపై ఊరేగనున్నారు. ఇందుకోసం నారద పుష్కరణిని సుందరంగా తీర్చిదిద్దారు.

.