శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు గంగాదేవి సమేతుడై భూత వాహనంపై అధిరోహించి పురవిహారం చేశారు.
జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై స్వామి వారిని అనుసరించారు. మూషిక వాహనంపై వినాయక స్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప, స్వామి, అమ్మవార్లను అనుసరించారు.
అంతకు మునుపు ఆలయంలోని అలంకార మండపంలో పంచమూర్తులకు ఆలయ పురోహితులు విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.
అనంతరం పురవిహారానికి తీసుకువచ్చారు. నూతన రాజగోపురం గుండా తేరువీధులోకి ప్రవేశించారు. ఆ తరువాత నెహ్రవీధి, నగరివీధి, బజారువీధి గుండా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. భూత, చిలుక వాహనాలపైన పురవిహారం చేస్తున్న శివ, పార్వతులను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
.