1999 నవంబర్ 17న ప్రతి ఏడాది ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించుకోవాలని యునెస్కో ప్రకటించినప్పుడు కొత్త శతాబ్ధం, కొత్త మార్గంలో పయనించబోతుందని బహుశా ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే సగటు మానవుడికి తన జీవితం మీద ఉన్నంత శ్రద్ధ, భాష మీద ఉండదు.
ఏది నేర్చుకుంటే తనకు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందనే విషయంతో పాటు తన ముందు తరాలను ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా నిలబెట్టే మార్గాలను అన్వేషిస్తాడే తప్ప, భాషా సంస్కృతులను కాపాడుకుని ముందుతరాలకు బహుమతిగా ఇద్దామని ఆలోచించడు. సగటు మనిషి స్వభావమే అలాంటిది. అందుకే ప్రపంచంలో అనేక దేశాల భాషా సంస్కృతులను కనుమరుగు చేసి ఫ్రెంచ్ లాంటి భాషలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఇంగ్లీష్ రాకతో ఆ భాష విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడింది.
అభివృద్ధి చెందే క్రమంలో సమాజం చేస్తున్న పొరపాటు మాతృభాష, సంస్కృతులను విస్మరించటమే. దీని వల్ల సమాజంలో రాబోయే సమస్యలను ఎవరూ గుర్తించరు. అనేక ఉద్యమాల వెనుక ఈ సమస్యే ఉందని తెలిసినా, గుర్తించే ప్రయత్నం చేయరు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి కారణం కూడా మనం దేశం నుంచి విడిపోయిన ముక్కలే. ప్రస్తుత బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్థాన్ గా, ఇప్పటి పాక్ లో అంతర్భాగంగా ఉండేది.
1948లో ఉర్దూను జాతీయ భాషగా పాకిస్థాన్ ప్రకటించింది. ఉర్దూతో పాటు బెంగాలీని కూడా జాతీయ భాషగా ప్రకటించాలని బంగ్లాదేశ్ ప్రాంతంలో డిమాండ్లు మొదలై ఉద్యమ రూపు దాల్చింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి చేసిన ప్రయత్నాల్లో 1952 ఫిబ్రవరి 21న ఎంతో మంది మరణించారు. మరెంతో మంది గాయపడ్డారు. మాతృభాష కోసం మన పొరుగుదేశంలో జరిగిన ఈ త్యాగాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఫలితంగా బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతి ఏడాది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఓ ఇతివృత్తాన్ని యునెస్కో ప్రకటిస్తుంది. 2023 ఏడాదిని “బహు భాషా విద్య – విద్యలో విప్లవాత్మక మార్పుల దిశగా ఓ అవసరం” (‘multilingual education – a necessity to transform education’) అనే ఇతివృత్తంతో ముందుకు తీసుకువెళుతోంది. మూడేళ్ళ క్రితమే జాతీయ విద్యా విధానం – 2020లో భాగంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. విద్యలో మాతృభాషకు పెద్ద పీట వేయటం ద్వారా నిజమైన ఆత్మవిశ్వాసం, అభివృద్ధి సాధ్యమని భారతప్రభుత్వం విశ్వసించింది.
అమ్మపాల వంటి అమ్మభాషను చిన్నతనంలోనే విద్యార్థులకు నేర్పటం ద్వారా, అదే భాషలో విజ్ఞానాన్ని అందించటం ద్వారా వారి వృద్ధి వేగవంతం అవుతుంది. సి.వి.రామన్ వంటి శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. విజ్ఞానాన్ని మన మాతృభాషలోనే నేర్పాలన్నది వారి ప్రగాఢ అభిప్రాయం. ఎందుకంటే ఆంగ్లం వంటివి భాషలే తప్ప, విజ్ఞాన భాండాగారాలు కావు.
మన మాతృభాషలో ఉన్న విజ్ఞాన భాండాగారాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భాష, సంస్కృతి ఎప్పుడూ ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు తెలుగు భాషనే తీసుకుంటే మన పండుగ పాటలు, పెళ్ళి పాటలు… ఇలా ఎన్నో మన సంస్కృతిని తెలియజేస్తాయి. పుట్టుక నుంచి చావు వరకూ తెలుగులో పాట లేని సందర్భం లేదు. వేమన పద్యాలు జీవిత సత్యాలను తెలియజేస్తాయి,
అన్నమయ్య సంకీర్తనలు ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూనే వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తాయి. వాన వాన వల్లప్పా అంటూ వానను ఆహ్వానించే సంస్కృతి మనదైతే… రెయిన్ రెయిన్ గో అవే అంటూ వాన వద్దని చెప్పే సంస్కృతి ఆంగ్లానిది. మన వ్యవసాయ దేశానికి వానలు కావాలి. అందుకే మన సంస్కృతి బతకాలి అంటే మన భాషను కాపాడుకుని, మన ముందు తరాలకు సగర్వంగా అందించాలి.
మాతృభాషను కాపాడుకోవాలని యునెస్కో లాంటి అంతర్జాతీయ సంస్థలు చెబుతుంటే… మనం మాత్రం ఇంగ్లీషు మీడియం చదువులతోనే అభివృద్ధి అనే భ్రమల్లో కొట్టుకుపోతున్నాం. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు మాతృభాషకు తిలోదకాలు ఇచ్చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అయినా మాతృభాష బతుకుతుందేమో అనుకుంటే… వారు కూడా ఆంగ్ల మాధ్యమాలంటూ మాతృభాషను మరుగున పడేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం -2020 ద్వారా మాతృభాష మనుగడ సాగించగలదని ఆకాంక్షించవచ్చు. సగటు మాతృభాషాభిమానికి కాస్తంత ఊరట కలిగించే అంశమిది.
..ఎం.ఎల్.ఎన్. మూర్తి
సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త
Discussion about this post