మరో నెలరోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. సాధారణంగా ఎంత పేదవారైనా సరే.. స్థాయిని బట్టి ఈసరికే పెళ్లి సన్నాహాలు మొదలు కావాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. పెళ్లి చేయగల తాహతు తమకు లేదనే భయం వెన్నాడిందో ఏమోగానీ.. పెళ్లికూతురు సహా, మరో కూతురు సహా తల్లి అఘాయిత్యానికి పాల్పడింది. మనసులు కలచివేసేలా ఆ ముగ్గురూ బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఖమ్మం పట్టణంలోని త్రీ టౌన్ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ (48) వ్యథ ఇది. ఆమె భర్త గోపాలపురం ప్రకాష్ మహబూబాద్‌లోని ఒక బంగారం దుకాణంలో పని చేస్తున్నాడు. వారికి ఇద్దరు కూతుర్లు. రాధిక 30, రమ్య 28. పెద్దమ్మాయి రాధిక డిగ్రీ వరకు చదువుకుంది. చిన్న కూతురు రమ్య పదోతరగతి వరకు చదివింది. అమ్మాయిలిద్దరూ కూడా టైలర్లుగా పనిచేస్తుంటారు. ఆ రకంగా వారిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.
రాధికకు జనగామ అబ్బాయి తో వివాహం కుదిరింది. జనవరి 11 న పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లికి సంబంధించిన లాంఛనాలు, ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవడానికి వియ్యపు వారు మరో రెండు రోజుల్లో ఇంటికి రాబోతున్నారు.
అసలే కటిక పేదరికం. ఇంటి పెద్ద గా ఉన్న భర్త అమాయకకత్వం. ఇలాంటి పరిస్థితుల్లో చేతి లో చిల్లి గవ్వ లేని ఆ తల్లి ఘోరమైన నిర్ణయం తీసుకుంది. ఈ కష్టాలన్నింటికీ మరణం ఒక్కటే సమాధానం అని భావించింది. ఇద్దరు కూతుళ్లతో సహా బలవన్మరణానికి పాల్పడింది. భర్త బంగారం దుకాణంలో పనిచేసే వాడు కావడంతో ఇంట్లో బంగారం శుభ్రం చేసే రసాయనం ఉంది. వారు బుధవారం అర్థరాత్రి దానిని తాగి తనువు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి, పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లూ ఇలా దుర్మరణం పాలయ్యేసరికి బంధువర్గంలో విషాదం అలముకుంది.
.