ప్రతి వ్యక్తికీ ఓ కల ఉంటుంది. నాకూ ఉంది- మా ట్రస్టు తరఫున ఓ వృద్ధాశ్రమం నడపాలని. ఏళ్ల తరబడి మథనం, ప్రణాళికల అనంతరం ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పదిహేనేళ్లకు పైగా కేవలం నా సొంత వనరులతోనే ట్రస్టు కార్యక్రమాలు నిర్వహించిన నేను మొదటిసారి అందరి సహకారం అభ్యర్థించాను. మంచి ప్రోత్సాహం లభించింది.
మా ఊరిలోనే భవన నిర్మాణం ప్రారంభమైంది. ముమ్మరంగా సాగుతున్న పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. కారణం- విరాళాలు తగ్గిపోవటం. విరాళమనేది నిత్యప్రవాహ ధారలా ఉండదని, అడపాదడపా మాత్రమే ట్రస్టు అకౌంటుకు చేరుతుందని అనుభవం మీద అర్థమైంది.
ఆ సమయంలో.. గ్రామంలోని నా ఇల్లు తనఖా పెట్టి, బ్యాంకు నుంచి ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్) అకౌంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాని తాలూకు డాక్యుమెంట్లన్నీ సమకూర్చుకోవటం పెద్ద ప్రహసనమే అయింది.
ఓరోజు బ్యాంకులో సుదీర్ఘంగా వేచి ఉన్నప్పుడు.. మా మేనమామ, ట్రస్టు అధ్యక్షుడైన వంగా సాంబిరెడ్డి గారు ఇలా అన్నారు…
‘‘ఇవన్నీ మనం చేయాల్సిన పనులు కాదు బాబూ. డబ్బులు ఎక్కువై, ఏం చేసుకోవాలో తెలీక, ఇంట్లో కంతల్లో బ్యాంకు లాకర్లలో దాచుకుంటారే.. వాళ్లు చేయాల్సినవి. నీ స్థాయికి మించి సాహసం చేస్తున్నావు’’.
నేను నవ్వాను. ఓ సమాధానం చెప్పాను.
* * * * *
ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు రైడ్ చేశారు. ఆ మండలస్థాయి అధికారి ఇంట్లో నాలుగు కేజీల బంగారం, ఆరు ఇళ్లస్థలాల డాక్యుమెంట్లు, మూడు కోట్ల రూపాయల నోట్లకట్టలు దొరికాయి.
మరో జిల్లాస్థాయి అధికారి ఇంట్లో ఇంకా ఎక్కువే దొరికాయి.
ఆ మధ్య ఉత్తరప్రదేశ్‌లోనైతే ఓ జైన్ గారింట్లో ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల నోట్లకట్టలు పుట్టలో పాముల్లా బయటపడ్డాయి.
రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి ఇంట్లో కేజీల కొద్దీ వెండి, బంగారు నగలు దొరికాయి. అతని బ్యాంకు లాకర్లు తెరిచి చూస్తే… వందలకొద్దీ నోట్లకట్టలు! ఎప్పుడు పెట్టాడో ఏమో, అవి మాసిపోయి చీకిపోయి, మార్చటానికి పనికిరాని స్థితిలో ఉన్నాయి.
* * * * *
బాగా డబ్బున్న ఓ మిత్రుడి కూతురి పెళ్లిబట్టల షాపింగ్ కోసం తోడు వెళ్లాను.
లోపలెక్కడో మంచుపర్వతాన్ని దాచిపెట్టినట్లు, వణుకు పుట్టించే ఏసీ. బట్టలు చూపించేవాళ్లు కూడా ఖరీదైన డ్రెస్‌లో కంప్యూటర్లలా పని చేసుకుంటున్నారు. చూడ్డానికి వచ్చేవాళ్లంతా ఖరీదైన కార్లలోంచి దిగుతున్నారు.
మిత్రుడు, అతని భార్యాకూతుళ్లు చీరల ఎన్నికలో నిమగ్నమైపోయారు. నేను చుట్టూ చూస్తూ కూచున్నాను. నా పక్కనే నలుగురు ఆడవాళ్లు చీరలు చూస్తున్నారు. నేను కావాలనే చెవుల్ని ఆ వైపు విసిరి ఉంచాను.
‘‘దీనికి మ్యాచింగ్ జాకెట్టు కుట్టడానికిచ్చావా వదినా?’’
‘‘ఇచ్చాను. ఆ బొటిక్‌లో లేటెస్ట్ డిజైన్ ఒకటి చూపించింది. అదే కుట్టమన్నాను’’.
‘‘ఎంత చెప్పింది?’’
‘‘తక్కువే. 35 వేలు’’.
నేను కుర్చీలోంచి పడబోయి, తమాయించుకున్నాను.
‘‘ఈ చీరెంత?’’ సేల్స్‌మన్‌ను అడిగిందామె.
‘‘నాలుగు లక్షలు’’.
‘‘బాగుందొదినా. కానీ, ఈ కలర్ ఆ జాకెట్టుకు మ్యాచ్ అవుతుందా?’’
‘‘నిజమే కదా. దగ్గర పెట్టుకొని చూస్తేకానీ తెలీదు. అయితే కలర్ గుర్తుంది. ఓ పని చేద్దాం, ఇదే షేడ్స్‌లో మరో రెండు చీరలు తీసుకుందాం. ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది’’ తాపీగా చెప్పి, మరికొన్ని చీరలు చూడటంలో మునిగిపోయిందామె.
అంటే, ‘ఆప్షనల్’గా ఎనిమిది లక్షల రూపాయలు!
* * * * *
నా దగ్గరకు ఓ పెద్దాయన వచ్చాడు. నిరుపేద. కూతురు కూడా అతని వెంట ఉంది. ఆ అమ్మాయికి మెడిసిన్‌లో గవర్నమెంట్ సీటు వచ్చింది. ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ కోసం ఎంతలేదన్నా కనీసం రెండు లక్షలు అవసరం.
స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా నేను మహా అయితే, పాతిక వేలు అప్రూవ్ చేయగలను. అదే చేశాను. ఆయన కళ్లల్లో నీళ్లు. కానీ అంతకన్నా నేనేం చేయలేకపోయాను.
చెక్కు తీసుకోవటానికి ఆయన ఫైనాన్స్ డిపార్ట్‌మెంటుకు వెళ్లాడు. చెక్కు రాస్తున్న మహిళా ఉద్యోగితో ఆ పెద్దాయన తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆమె చలించిపోయి, నా దగ్గరకొచ్చింది.
‘‘సర్, ఇంతకన్నా మనమేమీ చేయలేమా?’’ అడిగింది.
‘‘నువ్వే చెప్పమ్మా. నా అధికారం అంతవరకే కదా’’ అడిగాను.
‘‘పాపం సర్..’’
‘‘కావాలంటే, నేను వ్యక్తిగతంగా మరో పదివేలు ఇస్తాను’’.
‘‘అవే మూలకు సర్?’’ అని వెళ్లబోయి, మళ్లీ వెనక్కి వచ్చింది.
‘‘పదివేలు ఇవ్వండి సర్’’ అంది. ఆ డబ్బులు తీసుకుని, బయటికి వెళ్లి, ఓ కాగితం తీసుకుని మళ్లీ నా క్యాబిన్‌కు వచ్చింది.
‘‘మన కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ల పేర్లన్నీ రాశాను సర్. నేనే వెళ్లి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. తలా అయిదు వేలో పదివేలో ఇస్తే చాలు. ఆ అమ్మాయి అవసరం తీరుతుంది’’.
‘‘గ్రేట్ ఇనిషియేటివ్. కీపిటప్’’ అన్నాను.
ఆమె అయిదు ఫ్లోర్లలో ఉన్న డిపార్ట్‌మెంట్ హెడ్స్ అందరినీ కలిసింది. ఆ క్రమంలో తనకెదురైన ప్రతి ఉద్యోగికీ విషయం చెప్పింది. ఎవరి తాహతును వారు చాటుకున్నారు.
అరగంటలో రెండు లక్షలు వసూలయ్యాయి.
ఇప్పుడా అమ్మాయి ఎమ్మెస్ చేస్తోంది.
* * * * *
ఆరోజు నేను మా మావయ్యకు చెప్పిన సమాధానం…
‘‘బాగా ఎక్కువ ఉన్నోళ్లకు లేనోళ్ల బాధలు తెలియవు మావయ్యా. అందుకే వాళ్లు దాచుకుంటారు తప్ప పంచిపెట్టరు. వాళ్లను తప్పుగా చూడకూడదు. నీకూ నాకూ అవసరంలో ఉన్నవాళ్ల బాధలు తెలుసు కాబట్టి, సత్కార్యాలకు మనమే నడుం బిగించాలి. మంచిపనికి కచ్చితంగా ఆశీర్వాదాలు లభిస్తాయి. ధైర్యంగా ముందుకెళదాం’’.
.. ఎమ్వీ రామిరెడ్డి
9866777870
Discussion about this post