విజయవాడ వదిలేసరికి సాయంత్రం నాలుగు దాటింది. కారు హైదరాబాదు వైపు పరుగులు తీస్తోంది. మా డ్రైవర్ మాధవ్ చూపులు రోడ్డు మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. పక్క సీటులో నేను, నా ఒళ్లో చిన్నబాబు. మాధవ్‌కు వెనకవైపు సీటులో నా కొడుకు భాస్వంత్. మిగతా సీట్లలో కుటుంబసభ్యులు.
కోదాడకు ఇవతల ఓ ఫుడ్ ప్లాజా దగ్గర ఆగి, టీ తాగి, మళ్లీ బయలుదేరాం. ఎవరికి తోచిన కబుర్లు వారు చెబుతున్నారు. ఆరున్నర కావస్తోంది. చీకటి ముదిరింది. వాహనాల లైట్ల వెలుతురులో రోడ్డు తడిసిపోతోంది. కోదాడ సమీపంలోని మేళ్లచెర్వు ఫ్లై ఓవర్ మీద కారు మెల్లగా వెళ్తుండగా కనిపించిందా దృశ్యం…
ఎడమపక్క ఓ మోటారుసైకిల్ పడిపోయి ఉంది. దాని పక్కనే ఓ యువకుడు పడి ఉన్నాడు. చలనం లేదు. కాస్త ముందుకు పోనిచ్చి, ఎడమవైపు మా కారు ఆపాడు మాధవ్. వెంటనే కిందికి దిగి, వెనక్కి వెళ్లాడు. నా ఒళ్లో బాబు ఉన్న కారణంగా వెంటనే స్పందించలేకపోయాను.
‘‘బాపూ, నువ్వు కూడా వెళ్లి అతన్ని పైకి లేపి, పక్కన కూచోబెట్టండి’’ అని నా కొడుక్కి చెప్పాను. నా మాటలు పూర్తి కాకముందే, బాపు గబగబా దిగి వెళ్లిపోయాడు. బాబును నా శ్రీమతికి అప్పగించి, రెండుమూడు నిమిషాల వ్యవధిలో నేనూ వెళ్లాను.
అప్పటికే మాధవ్, బాపు కలిసి ఆ కుర్రాణ్ని పైకి లేపారు. అతను నిలబడలేకపోతున్నాడు. అసలు స్పృహభరితంగా లేడు. చేతులు, కాళ్లు విపరీతంగా దోక్కుపోయి రక్తం కారుతోంది. ఎడమ భుజం మీద చొక్కా చిరిగిపోయింది. అక్కడ గట్టి దెబ్బే తగిలినట్లుంది. రక్తం కారుతోంది. అతి కష్టం మీద పక్కకు తీసుకెళ్లి రోడ్డు చివర ఓ బండరాయి మీద కూచోబెట్టారు.
రోడ్డుకు ఎడమపక్క అక్కడక్కడా గులకరాళ్ల కుప్పలు పోసి ఉన్నాయి. వేగంగా వచ్చిన ఆ కుర్రాడు చీకట్లో కనిపించని రాళ్లకుప్పను ఢీకొని పడిపోయి ఉంటాడని ఊహించాం. వాహనం హెడ్‌లైటు పగిలిపోయింది. క్లచ్, బ్రేక్ వైర్లు తెగిపోయాయి. బండి నడిరోడ్డు మీద పడి ఉంది. మాధవ్ ఆ వాహనాన్ని కూడా పక్కకు చేర్చాడు.
ఇంతలో మా కన్నా ముందే వచ్చి, చాలా దూరం వెళ్లి, మళ్లీ వెనక్కి వచ్చి, అక్కడ తమ కారును పార్క్ చేసిన ఇద్దరు యువకులు మా దగ్గరకు వచ్చారు. వస్తూనే ఓ యువకుడు చెప్పటం మొదలు పెట్టాడు…
‘‘‘మేం చూస్తూనే ఉన్నాం. రాళ్లకుప్పకు తగిలిన బైక్ ఇంతెత్తున లేచి, కింద పడింది. ఈ కుర్రాడు దభీమని రోడ్డుమీద పడిపోయాడు. హెల్మెట్ అతని తలనుంచి విడిపోయి అదిగో ఆ ఫ్లైఓవర్ గోడకు కొట్టుకొని, మళ్లీ అంతే వేగంగా అతని దగ్గరకే వచ్చి పడింది. మేమైతే స్పాట్‌డెడ్ అనుకున్నాం’’.
హెల్మెట్టే అతని ప్రాణాలు కాపాడిందని అర్థమైంది.
‘చూసినోళ్లు అట్లా కిలోమీటరు దూరం పోయి వెనక్కి రాకపోతే, వెంటనే ఆపి సాయం చేయొచ్చు గదా?’ మనసులోని ప్రశ్న గొంతులోకి రావటానికి ఏదో అడ్డంకి!
మా వెనకే బయల్దేరిన అన్నయ్య వాళ్ల కారు కూడా మమ్మల్ని దాటి, ముందుకెళ్లి ఆగింది. అన్నయ్య హడావుడిగా వచ్చాడు- మా కారుకేమైనా అయిందేమోనని కంగారు పడుతూ!
అక్కడి పరిస్థితి అర్థం కాగానే, ఆయన అందర్నీ అలర్ట్ చేశాడు.
‘‘ఇప్పుడు మనం ఇక్కడ ఈ మలుపులో నిలబడి ఉన్న విషయం అటునుంచి వచ్చే వాహనాల డ్రైవర్లకు తెలియదు. స్పీడు మీద వచ్చారంటే వాళ్లూ కుప్పలకు తగిలి, మన మీదకు దూసుకొచ్చే ప్రమాదముంది’’ అంటూ అందరినీ రోడ్డుకు వీలైనంత పక్కకు జరిపారు. మాధవ్ మొదటి రాళ్లకుప్ప దగ్గర నిలబడి, సెల్‌ఫోన్ లైటును ఊపుతూ వాహనాలు అటువైపు రాకుండా ప్రయత్నిస్తున్నాడు.
ఇంతలో మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కోటి అనే యువకుడు మంచినీళ్ల బాటిల్ తీసుకొచ్చి, క్షతగాత్రుడికి అందించబోయాడు. అతను అందుకునే స్థితిలో లేడు. దిమ్మెరపోయి, అలాగే చూస్తున్నాడు. వివరాలు కూడా చెప్పలేకపోతున్నాడు. కోటి అతని పక్కనే కూచొని, నీళ్లు తాగించాడు. కొన్ని సపర్యలు చేశాడు.
అతని మొహంలో కొద్దిగా తేజం కనిపించింది. మెల్లగా ఒక్కో విషయం చెప్పాడు.
అతని పేరు తరుణ్. ఉద్యోగి. మచిలీపట్నం నుంచి హయత్ నగర్ (హైదరాబాదు) వెళ్తున్నాడు. బండి రాళ్లకుప్పను తాకటం వరకే అతనికి గుర్తుంది.
అప్పటికి కోటి మూడుసార్లు 108కు ఫోన్ చేశాడు. రాలేదు.
‘‘మీరు నా బండెక్కండి. కోదాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తాను. మీ బండి ఎక్కడికీ పోదు. తర్వాత దాన్ని మెకానిక్ షాపుకు చేరుస్తాను’’ అని చెప్పాడు.
తరుణ్ అప్పుడు నోరు విప్పాడు.
‘‘లేదు. నేనెళ్లాలి. నా బండి స్టార్ట్ చేసివ్వండి. వెళ్లిపోతాను’’ అంటున్నాడు.
‘‘మిత్రమా. హయత్ నగర్ ఇక్కడికింకా రెండొందల కిలోమీటర్లుంది. మీకు దెబ్బలు బాగా తగిలాయి. బండి స్టార్ట్ కావటం లేదు. వెళ్లటం అంత శ్రేయస్కరం కాదు. లేచిన వేళావిశేషం మంచిది కాబట్టి, చిన్న దెబ్బలతో బయటపడ్డారు. కోటి వెంట వెళ్లి, వైద్యం చేయించుకోండి. మీ ఫ్రెండ్స్‌ను ఎవరినైనా పిలిపించుకోండి’’ అని చెప్పాను.
అతను ఓ ఫ్రెండ్ నంబరు చెప్పాడు. నేను అతనికి ఫోన్ చేసి, కోదాడ ప్రభుత్వాసుపత్రికి రమ్మని చెప్పాను. అతనికి ఎస్సెమ్మెస్ ద్వారా కోటి ఫోన్ నంబరు పంపాను.
అప్పటికే నలభై నిమిషాలు దాటింది. మా రెండు కార్లలో మహిళలు ఉన్నారు.
‘‘మీదే ఊరు?’’ కోటిని అడిగాను.
‘‘పక్కనే సార్, మేళ్లచెరువు’’ అన్నాడు.
‘‘కాస్త సమయం కేటాయించి అతనికి సాయం చెయ్యగలరా’’ అడిగాను.
‘‘పర్లేదు సార్. నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి’’ అన్నాడు.
తరుణ్‌కు మరికొన్ని ధైర్యవచనాలు చెప్పి, బయల్దేరాం.
* * * * *
మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు వెళ్తున్నాను.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు నా కారును క్రాస్ చేసి, ఎడమవైపు వెళ్లబోయి, స్కిడ్ అయి కింద పడిపోయాడు.
అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. వెంటనే లేచి, వెళ్లిపోయాడు.
రాత్రి సంఘటన మదిలో మెదిలింది.
ఆఫీసుకు చేరుకోగానే కోటికి ఫోన్ చేసి, ఆ తర్వాత ఏమైందని అడిగాను.
‘‘అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాను సార్. గాయాలకు డ్రెస్సింగ్ చేసి, మందు రాశారు. ఇంజక్షన్లు చేశారు. బండిని మెకానిక్ షాపుకు చేర్చాను. రాత్రి పది గంటలకు అతని ఫ్రెండ్ వచ్చాక, నేను ఇంటికి వచ్చేశాను. ఇదుగో, ఇప్పుడు మళ్లీ ఆస్పత్రికి వెళ్తున్నాను, వాళ్లిద్దరికీ టిఫిన్ తీసుకొని’’.
‘‘గ్రేట్ కోటి. ఈ కాలపు నా హీరోవి నవ్వే’’ అన్నాను సంతోషంగా.
అతను హాయిగా నవ్వేశాడు. అది దేవుడి నవ్వులా నా చెవుల్ని పవిత్రం చేసింది.
– ఎమ్వీ రామిరెడ్డి
9866777870
Discussion about this post