నవంబర్ 11ను మనదేశంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే గా పరిగణిస్తారు. స్వతంత్ర భారతదేశానికి మొట్ట మొదటి విద్యా మంత్రి అబుల్ కలామ్ ఆజాద్. ఆయన జయంతి సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. ఆయన భారత దేశానికి 15 ఆగస్టు 1947 నుంచి 2 ఫిబ్రవరి 1958 వరకు సేవ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవెలప్మెంట్ 11 సెప్టెంబర్ 2008 లో ఈ రోజు గురించి ప్రకటించింది. 2008 నుంచి ప్రతి నవంబర్ 11ను నేషనల్ ఎడ్యుకేషన్ డే గా ప్రకటించి, ఆ రోజు సెలవు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పింది. అన్నీ విద్యా సంస్థలు ఈరోజును పాటిస్తూ, చాలా కార్యకలాపాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాయి.
కానీ ఇప్పుడు?
కరోనా వచ్చాక, ఈ సంవత్సరం ఉన్న చదువు అంతా గందరగోళం అయిపోయింది. గూగుల్ క్లాస్‌రూమ్స్ లో, జూమ్ మీటింగ్స్‌లో పిల్లలకు క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఎంత వరకు పిల్లలకు అర్థం అవుతూంది, అనేది ఉపాధ్యాయులకు ఎప్పుడూ ఉండే ప్రశ్న. చాలా మంది విద్యార్థులు, క్లాసుల్లో కెమెరాలు ఆన్ చేయకుండానే ఉంటారు. దీని వల్ల, విద్యార్థికి, ఉపాధ్యాయులకి ఐ-కాంటాక్ట్ లేదు. నా అభిప్రాయంలో, ఈ ఐ-కాంటాక్ట్ ఉన్నప్పుడే, అర్థం చేసుకోవడం కొంచెం సులువుగా జరుగుతుంది. కానీ, చాలా మంది పిల్లలు కెమెరాలు ఆన్ చేయకుండా పోవడం వల్ల, ఈ ప్రత్యేక విషయానికి విలువ లేకుండా పోయింది.
ఇంకొకటి ఏంటంటే, పిల్లలకు ఆన్‌లైన్ లోనే పరీక్షలు కూడా పెడుతున్నారు. పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు కెమెరాలు ఆన్ చేసుకునే రాస్తారు. కానీ ఎవ్వరూ కాపీ కొట్టడంలేదు అనే హామీని ఉపాధ్యాయులు ఇవ్వలేరు. ఇంకొక విషయం ఏంటంటే, రోజుకి తక్కువ క్లాసులు ఉండడం. దీనిని మంచి విషయం అనీ అనుకోలేము, చెడ్డ విషయం అనీ అనుకోలేము. సాధారణంగా రోజుకు 5 క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. మామూలు బడి ఉండి ఉంటే, రోజుకు 8 క్లాసులు. మళ్లీ వాటిల్లో గేమ్స్, ఆర్ట్, ఇలాంటి చాలా క్లాసులు కూడా జరిగేవి. టీచర్స్ కు పోర్షన్ పూర్తి అవ్వలేదంటే, ఇలాంటి ఆక్టివిటీ పీరియడ్ ఏదో ఒకటి తీసేసుకునేవారు.
కానీ, ఇప్పుడు కేవలం 5 పీరియడ్స్, టీచర్స్ కి తీసుకోవడానికి ఆక్టివిటీ పీరియడ్స్ ఏమీ లేవు. స్కూల్‌లో 10వ తరగతి వాళ్లకి ఇంకా పోర్షన్ పూర్తవ్వలేదు. మరోపక్క ప్రీ-బోర్డ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. ప్రి-బోర్డ్స్ తర్వాత బోర్డ్స్ కూడా వస్తాయి. కానీ బోర్డ్స్ కి సరిపడేంత రివిజన్ టైమ్ ఉంటుందా??
స్కూల్ లో చదేవే వాళ్లకి మాత్రమే కాదు. కాలేజీలలో చదివే వాళ్లకు కూడా పరిస్థితి ఇంచుమించు ఇదే రకంగా ఉంది. కొంతమందికి అయితే మరీ ఘోరంగా ఆన్‌లైన్ క్లాసులే జరగడంలేదు. హైదరాబాద్ జే.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ ఫోటోగ్రఫీ విద్యార్థులది అలాగే ఉంది. ఆన్‌లైన్ క్లాసులు సరిగ్గా జరగలేదు. కానీ పరీక్షలు పెట్టేయబోతున్నారట.
ఈ ఆన్‌లైన్ క్లాసులకు ఉన్న సానుకూలతల వైపు చూశామంటే, ఉపాధ్యాయులకు టెక్నాలజీ గురించి అర్థం అవుతోంది. మామూలుగా వాళ్లందరూ స్కూల్ లో విద్యార్థుల సహాయం తీసుకుని కంప్యూటర్ ను వాడిన వాళ్లే. కానీ, ఇప్పుడు వాళ్లకి ఆ సహాయం అవసరం లేకుండా పోయింది. ఇది మాత్రమే కాదు, విద్యార్థి కి సబ్జెక్ట్ మీద మరింత అవగాహన పెరుగుతోంది. దాని మీద మరింత ఆసక్తి ఉండే పిల్లలు ఇంటర్నెట్‌లో నుంచి కొత్త విషయాలు చాలానే తెలుసుకుంటున్నారు.
ఈసారి నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకుంటున్న పరిస్థితిని మంచిది అని అనాలా? చెడ్డది అని అనాలా??
.