సీఎం, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు ఫోబియా, జనసేన అధ్యక్షుడు పవన్ మ్యానియాతో సతమతవుతున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నిత్యం టిడిపి, జనసేన పొత్తులను గూర్చి మాట్లాడటం బట్టి జగన్ తో పాటు, వైకాపా నేతలు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న సమస్యలు, పార్టీలో పెల్లుభుకుతున్న అసంతృప్తి వల్ల జగన్ తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలునిద్రలో కూడా పోత్తులను గూర్చి కలవరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పులికి యే అడవి అయితే నేమి అన్నట్టు తిరిగి గెలిచే సత్తా ఉంటే పొత్తుల భయమెందుకు వెంటాడుతున్నదో చెప్పాలని నిలదీశారు.
జగన్ భజన పరులకు దమ్ముంటే పవన్ చెప్పిన సీబీఐ దత్త పుత్రులు, చంచల్ గూడ జైలు టీమ్ ఎవరో నిగ్గు తేల్చాలని ఆయన సవాల్ చేశారు. తెలియని భయాలతో లేని పొత్తలను ఊహించు కోవడమే ఫోబియాకు చిహ్నమని చెప్పారు.
అలాగే అనవసరంగా పవన్ మీద లేని పోని అరోపణలు చేయడమే మ్యానియా లక్షణమని వివరించారు. ఏడు నియోజక వర్గాలు ఉన్న చిత్తూరు జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చి ఎనిమిది జిల్లాలకు మొండి చేయి చూపిన జగన్ ప్రాంతీయ సమతుల్యత ఎలా పాటిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. బ్రహ్మణ, క్షత్రియ, వైస్య ,కమ్మ కులాలకు మంత్రి వర్గంలో స్థానం లేకుండా చేసిన సీఎం సామాజిక న్యాయం గూర్చి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.
బీసీలకు మత్రివర్గంలో తగిన స్థానం కల్పించామని చెప్పుకునే సీఎం ప్రభుత్వ సలహా దారులు, నామినేటెడ్ పదవులలో ఎస్సీలు, బీసీలు ఎందరు ఉన్నారో చెప్పాలని నిలదీశారు. శ్రీ లంక లాగా రాష్ట్రం ఆర్దికంగా దివాలా తీయక ముందే జాగ్రత్త పడాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్షాలపై బురద చల్లి, కులాల మధ్య చిచ్చు పెట్టి ఎల్లకాలం ప్రజలను మభ్య పెట్టడం కుదరదని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
.