విద్యుత్ కోతలు విధించ వద్దని పలువురు విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజను పరిధిలో సోమవారం సబ్ స్టేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు విద్యుత్ వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులు, రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
విడతల వారీగా విద్యుత్ సరఫరా చేయడం వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల వలన కొన్ని ప్రాంతాల్లో పంటలు కూడా ఎండి పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. రైతుల సమస్యలు గుర్తించి ఏడు గంటల పాటు కోతలు లేకండా విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరాల్లో కూడా కోతలు లేకుండా చూడాలని వినియోగదారులు విజ్ఞప్తి చేశారు. వేసవి అయినందున విద్యుత్ కోతల వలన జనం ఇబ్బందులు పడుతున్నారని వారు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ముఖ్యంగా విద్యుత్ కోతల వలన చిన్నారులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు సహకరించి ఈ సమస్యను తీర్చాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీఈ సతీష్ బాబు, ఏఏఓ రంగారావు. ఏ ఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
.