చిరునవ్వులు చిందించాల్సిన ముఖాలలో
ఆకలి కేకల ఆక్రందనలే ఆనవాళ్లు.
పలక, బలపం పట్టాల్సిన చేతుల్లో
విసిరి పారేసిన వ్యర్ధాలే ఆటబొమ్మలు.
ఆత్మీయతానుబంధాలు నింపాల్సిన పసిహృదయాలలో
నిర్లక్ష్యపు చీదరింపులే వడగళ్ల వానలు.
ప్రగతి వైపు అడుగులు వేయాల్సిన పసి పాదాలలో
బాలకార్మిక బంధిఖానాల్లో బానిస సంకెళ్ళు.
ఇలా..
నిశీధివీధుల్లో నిద్రలేని రాత్రులు గడిపి,
నిప్పులు చెరిగే మండుటెండల్లో మాడిపోయి,
ఎముకలు కొరికే చలిలో గజగజ వణికి,
నిరాశ, నిస్పృహల సుడిగుండాలలో చిక్కుకున్న
ఈ చిన్నారుల జీవితాలలో
ఆశలు రేకెత్తించి, వెలుగునింపే
కొత్త సూరీడు ఎప్పుడు ఉదయిస్తాడో?
.. దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
.