శ్రీరామనవమి.. ఇది వస్తోందంటే చిన్నతనంలో ఎంత సంబరమో… మందిరంలో పెట్టే గుగ్గిళ్లు, కజ్జాయం, తాంబూలం పట్టీల కోసం వారం ముందు నుంచే ఎదురుచూసేవాడ్ని.. పరీక్షల సమయం ఉంటుందిగా.. ఒక్కో ఉభయం అవుతుంటే.. రాత్రి గుగ్గిళ్లు పంచేదాకా చదువుకుని.. ఆ తర్వాత మందిరం దగ్గర వీధిలో తిష్టవేసి. పూజలు, భజనలు అన్నీ అయిపోయాక.. గుగ్గిళ్లు కజ్జాయం దోసిట్లో నింపుకుని ఇంటికొచ్చి పడుకున్న వాళ్లకు వాళ్ల వంతు లేపి మరీ తినిపించి.. పడుకునేవాడిని..
వయసు పెరగడంతోపాటూ శ్రీరామనవమి రోజున ఆచారాలూ మారిపోయాయి.. పెళ్లై, పిల్లాడు పుట్టి.. ఓ ఇంటివాడ్ని కూడా అయ్యాక.. సెలవు పెట్టి లేదంటే వీక్లీ ఆఫ్‌లు మార్చుకుని, అవసరమైతే అరగంట లేటుగా వస్తానని అడుక్కునో.. కాలనీలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యంగా కల్యాణానికి కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడే మధ్యాహ్న భోజనం కూడా అయిపోయేది..
చిన్నప్పుడు.. శ్రీరామనవమికి ప్రత్యేకంగా డ్రస్ కోడ్ లేకపోయినా.. పెరిగేకొద్దీ ముఖ్యంగా పెళ్లయ్యాక ఒక డ్రెస్ కోడ్ వచ్చేసింది.. ఏదో ఒక పాత కుర్తా వేసుకుని.. బొట్టు పెట్టుకుని కాస్త సంప్రదాయంగా కనిపించడం మొదలైంది. గుగ్గిళ్లు, కజ్జాయం పోయినా.. తర్వాత పానకం వడపప్పు భాగమయ్యాయి.. వధూవరులకు చదివింపులు సమర్పించి అక్షతలు తీసుకోవడం కూడా అలవాటయ్యింది..
కానీ, ఆ తర్వాత వయసు ముదిరేకొద్దీ.. దీనికంటే ఉద్యోగాలు మారేకొద్దీ అనడం బెటరేమో.. ఈ ట్రెడిషన్లో కూడా మార్పు వచ్చేసింది.. పొట్టచేతబట్టుకుని ఉత్తరాదికి వచ్చేశాక.. ఎక్కడ శ్రీరామనవమి వేడుకలు జరుగుతుంటే.. అక్కడకు వెళ్లడం.. కల్యాణం చూసి ప్రసాదాలు ఆరగించి రాగానే, హమ్మయ్య ఈసారీ నవమి మిస్ కాలేదులే అనిపించేస్తోంది.. మనం ఈసారికి వదిలేద్దాంలే అనుకున్నా.. ఇంట్లో ఒప్పుకోరుగా.. అంతే..
కానీ, దాదాపు సగం జీవితం అయిపోయాక.. ఈ మధ్యే రాముడి పేరు చెప్పాలన్నా.. బయట బొట్టు పెట్టుకుని కనిపించాలన్నా.. కాస్త జంకుగా ఉంది.. శ్రీరామనవమి రోజున అలవాటుగా కుర్తా వేసుకుందామన్నా.. అవసరమా అనిపిస్తోంది.. చిన్నప్పట్నుంచీ సంప్రదాయంగా ఉంటున్నప్పటికీ.. నాపైన ‘భక్త్’ అని ముద్ర వేసేస్తారేమోనని భయం.. అందులోనూ ఉంటోంది ఉత్తరాదిలో.. ఉద్యోగం వెలగబెడుతోంది స్వతంత్ర సంస్థలో.. దేశంలో అంతకంతకూ పెరుగుతోన్న పోలరైజేషన్… నాలో చిన్నప్పట్నుంచీ ఉన్న శ్రీరామనవమి ఇష్టాన్ని రహస్యంగా ఉంచేస్తోంది..
మతపరమైన నేతలకు భక్తిని రాజేయడం వల్ల ఎంత లాభముందోగానీ.. నాలాంటి వారికి మాత్రం దీనివల్ల నష్టమే అనిపిస్తోంది.. నాలా ఇంకా చాలామంది ఉంటారేమో అనిపిస్తోంది.. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే.. ‘మాంసం తింటామని ఎముకలు మెళ్లో వేసుకుంటామా?’ అనే సామెత కూడా గుర్తొస్తోంది.. పదో పరకో ఇచ్చి కాషాయ కండువాలు కప్పి, జై శ్రీరామ్ నినాదాలు చేసే ఎంతోమంది నేతలు . నాలాంటి శ్రీరామనవమిని ఇష్టపడేవారికి, అసలు సిసలు సంప్రదాయవాదికి (ఇక్కడ కూడా భక్తుడు అనాలంటే భయమేస్తోంది) పండుగ ఫీలింగ్ లేకుండా చేసేస్తున్నారేమో అనిపిస్తోంది..
నేను మాత్రం ఏం చేయగలను.. అందుకే నా మనసులో ఉన్నదాన్ని అక్షరాలుగా పెట్టి ఆ రాముడికి.. పనిలోపనిగా ఈరోజు కుర్తా వేసుకోమంటే నో చెప్పినందుకు బాధపడిన శ్రీమతికి క్షమాపణలు చెప్పేస్తున్నా..
(ఉత్తరాదిన ఉద్యోగం వెలగబెట్టే ఒక స్నేహితుడి ఆత్మఘోషకు అక్షరరూపం)
.