శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారి ధ్వజారోహణం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం పంచమూర్తులు పురవిహారం వైభవంగా జరిగింది.
ఆలయంలోని అలంకార మండపం వద్ద పరమేశ్వరుడు, గంగాభవానీ, పార్వతీదేవి ఉత్సవమూర్తులను దివ్యాభరణాలతో అలంకరించారు. పార్వతీ పరమేశ్వరులు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు.
ఇక శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను కూడా విశేషంగా అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పంచమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులు వెండి అంబారీపై… వినాయకుడు మూషిక వాహనం, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, భక్తకన్నప్ప, చండికేశ్వరుడు చప్పరాలపై అధిష్టించి పురవిహారానికి బయలుదేరారు.
ఈ ఊరేగింపు రాజగోపురం గుండా సాగి మాడవీధుల్లోకి ప్రవేశించింది. దివ్యాభరణాలతో పురవీధుల్లో ఊరేగుతున్న గంగాభవానీ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఇక భక్తకన్నప్ప, వినాయకుడు, చండికేశ్వరుడు, శ్రీవళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వీరిని అనుసరించారు. పంచమూర్తుల పురవిహారం సందర్భంగా పురవీధుల్లో వివిధ కళారూపాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధాకారి పెద్దిరాజు, డిప్యూటీ ఈవో ఎన్ ఆర్ కృష్ణారెడ్డి, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో రేపు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన శనివారం రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడు భూత వాహనం పైనా… జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శుక వాహనం పైనా పురవిహారం చేయనున్నారు. పరమేశ్వరుడు భూత గణాధిపత్యం చెలాయిస్తూ భూత వాహనంపై ఊరేగుతారు. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు తన సుకుమార తనానికి చిహ్ర్ర్నంగా చిలుక వాహనం అధిరోహించి పురవీధుల్లో విహరిస్తారు. ఇక ఉదయం పరమేశ్వరుడు సూర్యప్రభ వాహనం, పార్వతీదేవి అమ్మవారు చప్పరంపై ఊరేగనున్నారు.
రేపు భూత రాత్రి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముక్కంటి ఆలయంలో మూడవ రోజైన శనిబవారం రెండవ తిరునాళ్లు, భూతరాత్రి నిర్వహిస్తారు. భూతరాత్రి అంటే క్షీర సాగర మధనంలో భాగస్వామి అయిన భూత గణాలు శివ సాన్నిధ్యంలో ధ్వజాన్ని ఎగుర వేసే రాత్రి. ఇక దేవతాగణాలు క్షీర సాగర మధనంలో భాగంగా రెండవ రోజున శివ సాన్నిధ్యంలో ధ్వజాన్ని ఎగుర వేసే రాత్రిని దేవరాత్రిగా పిలుస్తారు.
.

Discussion about this post