జనసేనాని పవన్ కల్యాణ్ విజయవాడకు వచ్చిన సందర్భంగా.. ఆయనను భాగస్వామ్య పార్టీ బీజేపీ నాయకులు కూడా కలిశారు. ఆ కలయిక కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే కాదు. ఇద్దరి మనసుల్లోనూ ఆ కలయికకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఎజెండా ఉంది. ‘బద్వేలు ఉపఎన్నిక’లో తమ పార్టీ పోటీచేయకుండా.. మిత్రపక్షం మీదికి నెట్టేయాలనేదే ఇద్దరి మనసుల్లోనూ సింగిల్ పాయింట్ ఎజెండా!
నెలరోజుల వ్యవధిలో కడపజిల్లా బద్వేలు స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. వైఎస్సార్ సీపీ సిటింగ్ ఎమ్మెల్యే అర్థంతర మరణంతో అనివార్యమైన ఎన్నిక అది. అయితే ఆ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమినుంచి ఎవరు బరిలోకి దిగాలి? వైఎస్సార్సీపీ ఆధిపత్యంపై తొడకొట్టి సవాలు విసరడానికి సిద్ధం అయ్యేది ఎవరు? ఎవరికి వారు ఆ పూచీ తమకు లేకుండా ఎదుటి పార్టీ మీదికి నెట్టేయాలనే ఆ మీటింగ్ పెట్టుకున్నారు. చివరికి ఎటూ తేల్చకుండానే లేచి వెళ్లిపోయారు.
పవన్ కల్యాణ్- బీజేపీ ఇరువురూ తాము మిత్రపక్షాలు అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే, తామై చెప్పుకుంటే తప్ప తమను మిత్రపక్షాలుగా ప్రజలు గుర్తించరు అనేది వారి నమ్మకం. ఏనాడూ ఆ రెండు పార్టీల ధోరణి మిత్రత్వంతో సాగుతున్నట్టుగా కనిపించదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో కొంత హడావుడి చేయడం.. ఆ తర్వాత.. ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరించడం మామూలే.
జనసేనాని పవన్ కల్యాణ్.. తన సినిమా షూటింగుల మధ్యలో గ్యాప్ దొరికినప్పుడెల్లా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి వెళుతుంటారు. పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు వచ్చిన ప్రతిసారీ బీజేపీ వారు వచ్చి కలవడం జరగదు. కానీ ఈసారి మాత్రం వచ్చి కలిశారు. ఇద్దరి మనసుల్లోనూ ఒకటే పాయింట్ ఉంది. ‘బద్వేలు స్థానం మాకు వద్దు.. మీ పార్టీనే బరిలోకి దించండి..’ అని చెప్పాలనేదే వారి ఉద్దేశం.
పవన్ కల్యాణ్ సహజంగానే.. రాష్ట్ర బీజేపీ నాయకులంటే చాలా చులకన భావంతో వ్యవహరిస్తుంటారు. ‘నాది మీతో మాట్లాడే రేంజ్ కాదు.. నాదంతా ఢిల్లీ రేంజ్’ అని వాళ్లకు తన ప్రవర్తనతో సంకేతాలు ఇవ్వాలనేది ఆయన నిత్యాభిలాష. మామూలు పరిస్థితుల్లో అయితే.. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా పవన్ ను ఏమాత్రం పట్టించుకోరు గానీ.. ఇప్పుడే బద్వేలును వదిలించుకోడానికి ప్రత్యేకంగా తామే వెళ్లి కలిశారు.
ఇరు పక్షాల నాయకుల మధ్య ముచ్చట్లు మాత్రం మహ జోరుగా నడిచాయి. తిరుపతి ఉప ఎన్నికలో ఆ సీటును తమ పార్టీకి ఇచ్చి మీరు త్యాగం చేశారు గనుక.. ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నికలో మీరే పోటీచేయండి.. అని పవన్ కు చెప్పి వదిలించుకోవాలనేది బీజేపీ ఉద్దేశం. అయితే.. అదే ప్రతిపాదన ఆ పార్టీనుంచి వస్తే.. ఎలా తప్పించుకోవాలో పవన్ కు క్లారిటీ లేదో ఏమో గానీ.. మామూలు ముచ్చట్లు ముగిసి.. వ్యవహారం బద్వేలు వైపు మళ్లుతున్నదని అనిపించగానే.. పవన్ అసలు మీటింగే ముగించి.. అర్థంతరంగా మీటింగ్ లోంచే వెళ్లిపోయారు.
ఎందుకొచ్చిన కష్టం లెద్దూ.. బద్వేలులో బరిలోకి దిగి తల బొప్పి కట్టించుకోవడం కంటె.. దాన్ని బీజేపీ మీదికి నెట్టేసి చేతులు దులుపుకోవడమే మేలని జనసేనాని కూడా భావిస్తున్నారు. దానికి నిదర్శనమే.. బీజేపీ నేతలతో మీటింగ్ నుంచి బయటకు వెళ్లిపోవడం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
తిరుపతి ఉపఎన్నిక విషయంలో కూడా.. ఏదో తాము ఉద్ధరించేస్తాం అన్నట్టుగా సీటు మాకంటే మాకని.. ఇరు పార్టీలు పోటీపడినట్లుగా కొంత హడావిడి నడిపించారు. మొత్తానికి బీజేపీ బరిలోకి దిగింది. పవన్ స్వయంగా ప్రచారానికి కూడా వెళ్లారు. నాదెండ్ల వంటి నేతలు.. అక్కడే ఉండే.. తమ పార్టీ తరఫున పూర్తి ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఇంత చేసినా వారికి అక్కడ కనీసంగానైనా పరువు దక్కలేదు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటె చాలా తక్కువ ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో బద్వేలు ఉపఎన్నిక ఇరుపార్టీల గుండెల్లో రాయిపడినట్టుగా అయింది. తమకు వద్దంటే తమకు వద్దని ఇద్దరూ తలపోస్తున్నారు. బద్వేలును వదిలించుకోవడంలో.. ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.
.

Discussion about this post