సినీ నటుల సంఘం ‘మా’ ఎన్నికలు మామూలు ఎన్నికలను తలపిస్తున్నాయి. విష్ణు- ప్రకాష్ రాజ్ ప్రధానంగా పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ ఆశీస్సులు ఉన్నాయి. దాని అర్థం చిరంజీవి, నాగేంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారనే అంతా అనుకుంటున్నారు. అయితే బహిరంగంగా మద్దతు తెలియజేయకపోయినప్పటికీ.. పవన్ కల్యాణ్ కూడా.. ప్రకాష్ రాజ్ కోసం పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారం చేయడం లేదు. అయితే ఆయన ప్రభావం ఈ ఎన్నికలపై ఉండబోతున్నట్టే కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్రయత్నపూర్వకంగా పవన్ కల్యాణ్ మద్దతును కూడగట్టినట్టే తెలుస్తోంది. కేవలం ఓటు వరకే కాదు.. ప్రకాష్ రాజ్ విజయానికి సహకరించడానికి కూడా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగినట్టే కనిపిస్తోంది.
ప్రకాష్ రాజ్ తొలుత తన ప్యానెల్ ప్రకటించినప్పుడు అందులో బండ్ల గణేశ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్యానెల్ లోకి జీవిత రాగానే.. బండ్ల గణేశ్ తప్పుకున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీద విమర్శలు గుప్పించారు. జీవితను ఓడించడమే లక్ష్యం అంటూ తను ఇండిపెండెంటుగా నామినేషన్ కూడా వేశారు. నామినేషన్ సందర్భంగా.. సినీ కార్మికులకు తానేంచేయగలనో.. చాలా పెద్దపెద్ద ప్రగల్భపు డైలాగులు చెప్పారు. ఇంతా కలిపి.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడగానే చప్పుమని చల్లారిపోయి విత్ డ్రా చేసుకున్నారు.
అయితే బండ్ల గణేశ్ తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం వెనుక పవన్ కల్యాణ్ పాత్ర ఉన్నట్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. విత్ డ్రాకు నిర్ణయం తర్వాత.. తనకు దైవసమానుడు చెప్పాడు కాబట్టి.. తాను తప్పుకుంటున్నానని బండ్ల గణేశ్ ప్రకటించారు.
అయితే.. గతంలో అనేక సందర్భాల్లో పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానం అంటూ గణేశ్ మాటలు చెప్పి ఉన్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయనకు ఎందరు దేవుళ్లయినా ఉండవచ్చు గానీ.. మా ఎన్నికలనుంచి తప్పుకోమని, ఈ ఎన్నికల మీద శ్రద్ధతో చెప్పే దేవుడు ఎవడుంటాడు? అది పవన్ కల్యాణ్ మాత్రమే అని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
మంచు మోహన్ బాబు కుటుంబానికి పవన్ కల్యాణ్ మద్దతిస్తారనుకోవడం కల్ల. పైగా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ వెన్నంటి ఉండగా.. పవన్ కల్యాణ్ మరొకరికి మద్దతిచ్చే చాన్సే లేదు. అయినా సరే.. ప్రకాష్ రాజ్ కోసం గణేష్ ను తప్పించేంత రాయబారం నడిపేంత క్రియాశీలంగా పవన్ ఈ ఎన్నికలను పట్టించుకుంటున్నారా? అనేది చర్చనీయాంశంగా ఉంది.
.