ముక్కంటికి రెండోసారి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సోమవారం ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు.
ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తీసుకువచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, ఆలయ అధికారులు సంప్రదాయ బద్దంగా సుపథ మండపం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అక్కడ నుంచి మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య పట్టు వస్త్రాలను ఆలయం లోపలకు తీసుకువచ్చారు. అలంకార మండపంలో ఈ పట్టు వస్త్రాలను ఆలయ సంప్రదాయాలతో వేద పండితులకు అందజేశారు.
అనంతరం ఆలయ అధికారులు మంత్రి పెద్దిరెడ్డికి స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయం బయట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కూడా మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున తాను పట్టు వస్త్రాలు సమర్పించానని… రెండో సారి ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో… సుబిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన స్వర్ణముఖినది ఒడ్డున ఏర్పాటు చేసిన కైలాసం సెట్టింగ్స్ ను ప్రారంభించారు. ఇది ఇల కైలాసం తలపించే విధంగా ఉందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవీనాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు. మిద్దెల హరి, లోకేష్ యాదవ్, సిరాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

.