రాంగోపాల్ వర్మ తో టీవీ డిబేట్ లో మాట్లాడడం అంటే.. లోపాయికారీగా తనతో మంతనాలు సాగించడానికి పూలబొకేలతో వచ్చే సినిమా రంగం పెద్దలతో మాట్లాడినట్లే ఉంటుంది అని.. మంత్రి పేర్ని నాని అనుకుని ఉంటే గనుక.. ఆయన పప్పులో కాలేసినట్టే. ఆ ప్రభావం ఒక ఛానెల్ డిస్కషన్ లో స్పష్టంగా కనిపించింది.
రాంగోపాల్ వర్మతో టీవీ చర్చ లైవ్ లోకి వచ్చిన పేర్ని నాని.. తన అవగాహన మేరకి మాట్లాడే ప్రయత్నం చేస్తూ.. రాంగోపాల్ వర్మ ప్రశ్నలకు కౌంటర్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ.. అడ్డంగా దొరికిపోయారు. పార్టీనే కాదు, ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టారు. ఒక రకంగా ఆయన మాటలు సెల్ఫ్ గోల్ అయ్యాయి.
సినిమా టికెట్ల ధరల పెంపు అవకాశం లేకుండా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో.. రాంగోపాల్ వర్మ.. కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేసుకుంటున్న పరిశ్రమ పెద్దలంతా లోపాయికారీ మంతనాలు చేస్తున్నారే తప్ప.. ప్రభుత్వాన్ని సూటిగా, బహిరంగంగా ప్రశ్నించడం లేదు. అలాంటి రాంగోపాల్ వర్మ మాత్రం.. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఇష్టం అని, అభిమానినని అంటూనే.. ప్రభుత్వంలోని వారికి సినిమా గురించి తెలియదని.. వారికి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారనే మాటలతో ప్రభుత్వ నిర్ణయం మీద విరుచుకుపడుతున్నారు.
‘ప్రొడక్ట్ తయారుచేసిన వ్యక్తికి- వినియోగదారుడికి మధ్య ట్యాక్సులు వసూలు చేసుకోవడానికి మినహా.. ప్రోడక్ట్ ధరను నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరు?’ అనేది రాంగోపాల్ వర్మ సూటిగా సంధిస్తున్న ప్రశ్న! ఆయన ఇదే ప్రశ్నను పేర్ని నానికి కూడా సంధించారు. దానికి సూటిగా సమాధానం చెప్పలేకపోయిన పేర్ని నాని.. డొంకతిరుగుడుగా తమ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
వినియోగదారులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని, వినియోగదారుల ఫోరం ఉంటుందని రకరకాల మాటలు చెప్పారు. టీవీల్లో సినిమా చాలా అద్భుతం అన్నట్టుగా ప్రోమోలు వేస్తారు.. తీరా సినిమా బాలేకపోతే ఎలా అన్నారు. అందులో భాగంగానే.. ప్రొడక్ట్ నచ్చకపోతే తిరిగిచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయని, సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు తిరిగిచ్చేస్తారా? అంటూ వర్మకు కౌంటర్ వేశారు. బహుశా ఆ సమయంలో ఆయనను అభిమానించే వారికి, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే వారికి అది అద్భుతమైన కౌంటర్ అనిపించి ఉండవచ్చు.
కానీ.. మీరు ఏవేవో హామీలు చెప్పి.. అది చేస్తాం ఇది చేస్తాం అనేసి అధికారంలోకి వస్తారు.. వచ్చిన తర్వాత.. మీరు చేశారో లేదో సంబంధం లేకుండా మీ పరిపాలన నచ్చలేదు అని చెబితే మీరు అధికాంరలోంచి దిగిపోతారా? అని రాంగోపాల్ వర్మ అడిగిన ప్రశ్నతో పేర్ని నాని నిరుత్తరుడయ్యాడు. ఆయన దగ్గర జవాబు లేకుండాపోయింది.
నిజానికి పేర్ని నాని వాదన చాలా కాలంగా ఆయన చెబుతూ ఉన్నదే.. ఆయన వాదనకు వర్మ కౌంటర్ తాజాగా ప్రజల్ని కూడా ఆలోచింపజేస్తోంది. పేర్నినాని వాదనలో పస లేదని తేలిపోతోంది.
అదే సమయంలో.. పెరిషబుల్ ప్రొడక్ట్స్ కింద సినిమాను పరిగణించారు వర్మ. టమోటా కొనుక్కుని వెళ్లిన తర్వాత.. అది పుచ్చు అని తిరిగి షాపులో ఇచ్చేస్తే మరో పండు తీసుకోవచ్చు. కానీ దాన్ని కొరుక్కుని తినేసిన తర్వాత.. అది నాకు నచ్చలేదు కనుక డబ్బు తిరిగచ్చేయమంటే కుదురుతుందా అని అడిగారు. ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి.. సుష్టుగా తినేసిన తర్వాత.. భోజనం నాకు నచ్చలేదని డబ్బు ఇవ్వను అంటే కుదురుతుందా అని అడిగారు. ఇవన్నీ కూడా ఆలోచింపజేసే ప్రశ్నలే. అలాగే ప్రభుత్వం పాలన నచ్చకపోతే అధికారంలోంచి దిగిపోతారా? అనేది కూడా తీవ్రమైన ప్రశ్న. ప్రజలు గమనిస్తున్న వాదన.
పేర్ని నాని.. వినియోగదారుల ఫోరం.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారా? అనే ప్రస్తావనతో.. అనవసరంగా వర్మను కెలికాడని.. దాంతో ప్రభుత్వాన్ని పార్టీని ఇరుకున పెట్టాడని ఇప్పడు వైసీపీ అభిమానులే అనుకుంటున్నారు. మొత్తానికి ఆర్జీవీ లేవనెత్తిన వాదనలు, ప్రశ్నలు ఆలోచించే వారిలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.
Discussion about this post