రైల్లో మనమెక్కితే బాగుంటుంది.. రైలు మనమీదికి ఎక్కడానికి దూసుకొచ్చేస్తోంటే.. ఎలా ఉంటుంది..?
రైల్లో ప్రయాణం చేయడం అందరికీ సరదా.. అదేరైలు మనవైపుకు వేగంగా దూసుకుని వచ్చేస్తుంటే.. పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటి అనుభవం ఎవరికైనా ఎదురైందా.. ఎదురైనా చెప్పడానికి మనం బతికుంటే కదా.. కానీ ఒక పైలట్ కు అలాంటి అనుభవం ఎదురైంది.
అదేంటి.. రైలుకింద పైలట్ ఎలా పడతాడు.. పైలట్ అంటే విమానాన్ని నడిపేవాడు కదా.. అని మీకు అనుమానం రావచ్చు. నిజమే.. విమానాన్ని నడిపే పైలట్ నిజంగానే రైలు పట్టాలపై పడ్డాడు.. మరోవైపు నుండి దూసుకొస్తున్న రైలు.. ఏం చేయాలి?
పట్టాలపై కేవలం పైలట్ మాత్రమే కాదు.. అతను నడిపే విమానం కూడా పడివుంది. అందులో పైలట్ ఇరుక్కుని ఉన్నాడు. ఇది అంతా మనం నేరుగా చూస్తే అదేమన్నా సినిమాలో సీన్ అనుకునే అవకాశం ఉంది. కానీ ఇది నిజంగా జరిగిన నిజం.
లాస్ ఏంజెల్స్ లోని రైలు పట్టాలపై ఆదివారం నాడు మధ్యాహ్నం ఒక చిన్న సెస్నా 72 విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ విమానం స్థానిక ఫెర్నాండో వెల్లీ కమ్యూనిటీ నుండి టేకాఫ్ అయింది. తర్వాత అది ఎల్ఎపీడీ ఫుట్ హిల్ డివిజన్ స్టేషన్ వద్ద పట్టాలపై కూలిపోయింది.
అలా కూలిపోయిన విమానంలో పైలట్ ఇరుక్కుపోయాడు. మరోవైపు నుండి రైలు శరవేగంగా వస్తోంది. అయితే అక్కడే ఉన్న నలుగురు పోలీసులు మాత్రం తమ ప్రాణాలకు తెగించి పైలట్ ను రక్షించడానికి ప్రయత్నించారు. మొత్తానికి విమానం కూలిన ఐదు నిముషాలకు పైలట్ ను అందులోనుండి సురక్షితంగా బయటికి తీశారు. ఇలా పైలట్ ను బయటికి తీశారోలేదో.. వెంటనే వేగంగా వస్తోన్న రైలు విమాన శకలాలను ఢీకొట్టి వెళ్లిపోయింది. రైలుకింద విమాన శకలాలు నుజ్జు నుజ్జు అయిపోయాయి. మొత్తానికి పైలట్ కి ఆయుష్షు ఉంది. బతికి బయటపడ్డాడు. మరోవైపు పోలీసులు చేసిన సాహసం కూడా ప్రశంసనీయం.
.