మతం మత్తుమందు
కులం రొచ్చు జాఢ్యం
మతం ప్రపంచ వ్యాపితం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మతాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పది వరకూ మతాలు ప్రాధాన్యంలో ఉంటాయి. మన దేశంలో ఐదు లేదా ఆరు మతాలు ముఖ్యమైనవి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్, మతాలు మన దేశంలో ఉన్నాయి.
2001 సంవత్సర లెక్కల ప్రకారం భారతదేశపు జనాభాలో హిందూ మతం అవలంబించువారు 80.5% ఉన్నారు. భారత్ లో రెండవ అతిపెద్ద మతం ఇస్లాం (13.43%) జనాభాతో ఉంది. భారత్ లోని 2.34% జనాభా క్రైస్తవ మతం అవలంబిస్తున్నారు. ఇతర భారతీయ మతాలు సిక్కు మతం ( 1.86%), బౌద్ధ మతం (0.77%), జైన మతం (0.41%), అవలంబించు వారు ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం
హిందువులు 79.8%
ముస్లిములు 14.2%
క్రైస్తవులు 2.38%
సిక్కులు 1.7%
బౌద్ధులు 0.7%
ఆదివాసీ 0.5%
జైనులు 0.4%
మతం లేదు 0.25%
ఇతరులు 0.15%
అవలంభిస్తున్న వారు ఉన్నారు.
2001 నుంచి 2011 వరకు ఉన్న దశాబ్దంలో హిందువుల జనాభా శాతం 0.7% తగ్గింది. అదే సమయంలో ముస్లిం జనాభా 0.77% పెరిగింది. ఈ లెక్కన చూస్తే మరే ఏబై ఏళ్ళకి ముస్లిం జనాభా పెరుగుదల 4% కు మించదు. భారత దేశం మొత్తం జనాభా తీసుకుంటే ఈ పెరుగుదల చాలా తక్కువ. కానీ దురదృష్టవశాత్తు ముస్లిం జనాభా పెరుగుదలను ఎక్కువగా చూపిస్తూ మన దేశంలో హిందువులు మైనారిటీ అయిపోతారు అని ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం హిందువులను భయపెట్టి, హిందూ భక్తులను సమీకరించి సంఘటితం చేసేందుకు తద్వారా ఎన్నికలలో గెలిచేందుకు చేసే అబద్దపు ప్రచారమే.
మతం అనేది మొత్తం దేశానికి సంబంధించినది. అన్ని మతాల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండడం దేశ ఐక్యతకు, ప్రజల మధ్య సోదర భావం కలగడానికి మిక్కిలి అవసరం. అది మన రాజ్యాంగంలో మనం నిర్దేశించుకున్న ‘సౌభ్రాతృత్వం‘ యొక్క అర్ధం. మత సామరస్యం, ప్రజల మధ్య సౌభ్రాతృత్వం నెలకొల్పడానికి మతం అనేది కేవలం వ్యక్తిగతం కావాలి. మతం పేరుతో జరిగే రాజకీయ ప్రచారాలను తిప్పికొట్టాలి.
కులం అనేది మన దేశంలో ఉన్న వ్యక్తిగత జాఢ్యం, రుగ్మత, జబ్బు. కుల వివక్ష కారణంగా మనం ప్రజల మధ్య విభేదాలు సృష్టించుకుంటున్నాము. మానవ సంబంధాలు విసృతం చేసుకోవల్సిన ఈ కాలంలో కేవలం కులం కారణంగా మనం కుంచించుకుపోతున్నాము.
మన దేశంలో లెక్క లేనన్ని కులాలు, మళ్ళీ ఉప కులాలు ఉన్నాయి. అన్ని మతాలలోనూ కులాలు ఉన్నాయి. ఎక్కువ జనాభా ఉన్నారు కనుక హిందువులలో ఉన్న కులాల గురించి ఎక్కువగా అందరికీ తెలుసు. ఈ కులాల జాబితా కన్నా ఓసి, బిసి, యస్ సి, యస్ టి, గానే ఎక్కువగా చెప్పుకుంటాము.
దేశం, ప్రపంచం, ఎంతో అభివృద్ధి చెందింది. సైన్సు సాధించిన పరిజ్ఞానం ఎంతో ఉంది. అయినా ప్రజలు కులాల మధ్య చీలిపోయే ఉన్నారు. ప్రతి విషయంలోనూ కులమే ప్రాధాన్యం అయిపోయింది. పెళ్ళి సంబంధాలు కులం చూసుకునే చేసుకుంటున్నారు. కుల సంఘాలు, కుల బోజనాలు, కుల తీర్పులు, కుల రాజకీయాలు, అన్నీ కులం చుట్టూ తిరుగుతున్నాయి.
మనకి స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఎంతో మంది నాయకులు, సంఘ సంస్కర్తలు, కులాలు పోవాలని ఎంతో ప్రయత్నం చేశారు.
వందేళ్ల క్రితం గురజాడ కందుకూరి, జాషువా మొదలగు వారు కులాలకు, మతాలకు వ్యతిరేకంగా తమ రచనలు, ఉపన్యాసాల ద్వారా ఎంతో పోరాటాలు చేశారు.
“మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును.”
– అని ఆశించారు గురజాడ అప్పారావు
“నిమ్మజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చివేయునని ”
— అని హెచ్చరించారు జాషువా.
“గుణం లేని వాడు
కులం గొడుగు పడతాడు
మానవత్వం లేని వాడు
మతం ముసుగు వేస్తాడు
పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు
జనులంతా ఒక కుటుంబం
జగమంతా ఒక నిలయం”
అన్నారు గుర్రం జాషువా.
ఇంకా ఎందరో మహానుభావులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, వాగ్గేయకారులు, గాయకులు, తమ రచనలు, కవితలు, గేయాలు, పాటలు, వివిధ కళారూపాల ద్వారా కులం, మతం, ప్రాంతం, జాతి, విభేదాలు వద్దు అని గత వందేళ్లుగా తమ వంతు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ కుల జాఢ్యం ప్రజలను వదలడం లేదు.
మతం వలన దేశ సమైక్యతకు, సమగ్రతకు, సౌభ్రాతృత్వానికి, విఘాతం కలుగుతోంది. మత రాజకీయాల వలన దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా సమస్యలు వస్తున్నాయి. మన పొరుగు దేశాలతో సరైన సంబంధాలు లేక పోవడానికి మత రాజకీయాలు కూడా కారణమే.
కుల విభేదాల వలన ప్రజల మధ్య సంబంధాలు, సహకారం, సోదర భావం, దెబ్బతింటున్నాయి. కులం వ్యక్తిగతం చేసుకోకుండా సమాజపరం చేయడం వలన సంఘంలో కలుషిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సోదరీ సోదరులుగా కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజలు కులాల విభేదాల వలన దూర దూరంగా జీవిస్తున్నారు.
మతం దేశానికి ప్రమాదకరం.
కులం సమాజానికి హానికరం.
కనుక మతం మరియు కులం వదిలించు కుంటేనే మన భారత దేశం ముందుకు సాగుతుంది.
— పి. పి. శాస్త్రి,
ఏలూరు.
Discussion about this post