బింబిసార అనే పేరుతో సినిమా వస్తుందనగానే చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంలో మగధ సామ్రాజ్యం లో అశోకుడి కంటే ముందు బింబిసారుడు అనే రాజు పరిపాలించినట్లు మనమందరం చదివాం. అయితే బింబిసార చారిత్రక సినిమా కాదు. ఇది ఒక ఫాంటసీ సినిమా. గతంలో వచ్చిన యుగానికొక్కడు సినిమా తరహాలో భిన్నమైన సినిమా.
కథ విషయానికి వస్తే బింబిసారుడు అనే రాజు పాత్రను చరిత్ర నుంచి తీసుకుని దాని చుట్టూ ఒక రసవత్తర మైన కథ అల్లారు. బింబిసారుడు క్రూరుడు. సొంత తమ్ముడు దేవదత్తుడు ను చంపే ప్రయత్నం చేస్తాడు. పక్క సామ్రాజ్యపు రాణి ( కేథరిన్ థెరీసా) ను అపహరిస్తాడు. తనను ప్రశ్నించిన గ్రామస్థులను హింసిస్తాడు. ఒక బాలికను చంపేస్తాడు. అటువంటి బింబిసారుడు ఎలా మంచి రాజుగా మారాడు అనేది మిగతా కథ
హిస్టారికల్, సోషల్ ఫాంటసీ సినిమాలు తెలుగు వారికి కొత్త కాదు. ఆదిత్య 369 సినిమా ఇప్పటికీ అందరూ గుర్తుచేసుకుంటారు. అయితే ఆ సినిమాకు భిన్నంగా కాలంలో ముందుకు నడిచే (టైం ట్రావెల్) ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది.
కొత్త దర్శకుడు వశిష్ఠ ఒక మంచి థీమ్ పట్టుకుంటే దానికి హీరో కళ్యాణ్ రామ్ అండగా నిలబడ్డాడు. బాహుబలి లాంటి సినిమా చూసి వుత్తేజితం పొందిన కొత్త దర్శకుడు అంత కంటే బాగా తీశాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చోటా కె నాయుడు ఫోటోగ్రఫీ , కీరవాణి, చిరంతన్ భట్ పాటలు, కీరవాణి నేపథ్య సంగీతం, కళా దర్శకత్వం, గ్రాఫిక్ వర్క్, ఎడిటింగ్ ఈ సినిమాను నిలబెట్టాయి. దర్శకుడు తన విజన్ ను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాడు. తగర్తల సామ్రాజ్యాన్ని గొప్పగా సృష్టించాడు. రాజమౌళి లా ఎక్కువ హింసకు వెళ్ళలేదు. కొన్ని చోట్ల నవ్వులు తెప్పించాడు. చివరివరకు మన ఉత్సుకతను నిలిపి వుంచి, చివరిలో మన కళ్లు చెమర్చేలా చేశాడు.
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు కీలకం. అతను తప్ప ఈ సినిమాలో వేరే హీరోను ఊహించలేం. బింబిసారునిగా, దేవదత్తుడుగా కళ్యాణ్ రామ్ నటన అద్భుతం. బింబిసారునిగా అతని డైలాగ్ డెలివరీ బావుంది. కేథరిన్ థెరీసా, ప్రకాష్ రాజ్, సుబ్రమణ్య శాస్త్రి గా నటించిన నటుడు వీవెన్ బతేలా, సంయుక్త మీనన్, బాలిక అందరూ బాగా నటించారు.
ఈ తరానికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా బింబిసార. ప్రేక్షకులను ఊహాలోకంలో తీసుకు వెళ్లి మైమరపించే సినిమా ఇది. తక్కువ బడ్జెట్ తో తీసిన గొప్ప సినిమా.
..రాజేంద్రప్రసాద్ రెడ్డి

.
Discussion about this post