పిల్లల్లేని వారు దత్తత తీసుకుంటారు. కొందరు మంచివాళ్లు అనాథల్ని దత్తత తీసుకుంటారు. ఊరునంతా దత్తత తీసుకోవడాన్ని మనం శ్రీమంతుడు సినిమాలో చూశాం. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇలా ఊరిని దత్తత తీసుకుంటున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ.. పులుల్ని దత్తత తీసుకోవడం విన్నారా? వాటినెలా దత్తత తీసుకుంటారు.. అవేమీ వచ్చి మన ఇంట్లో మనతోపాటు నివాసం ఉండవు కదా.. అని డౌటొస్తోందా? అదే మరి!
ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. వాటి రక్షణ, పోషణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని స్పాన్సర్ చేసేలా.. కొందరు జూలకు విరాళం ఇస్తుంటారన్నమాట. అదే తరహాలో.. గత తొమ్మిదేళ్లుగా పులుల్ని దత్తత తీసుకుంటున్న స్టేట్ బ్యాంక్ ఈ ఏడాది కూడా అదే పనిచేసింది.
జంతువులు అంటే మనందరికీ చాలా చాలా ఇష్టం. ప్రత్యేకించి పులులు అంటే అందరికీ ఇష్టమే. పులులకు మచ్చలు ఎలా వచ్చాయి అనే దాని గురించి చాలా చాలా కథలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని వేల కవితలు కూడా ఉన్నాయి. వాటి గురించి మరొక అందమైన విషయం ఏంటంటే, పులి పిల్లలు పెద్దలు లాగా ప్రవర్తిస్తాయి. వాటిని అలా చూడటం చాలా బాగా అనిపిస్తుంది. కానీ, విచారకరమైన విషయం ఏమిటంటే, మనకి ఇంత ప్రేమ ఉన్నా కూడా, పులులు తగ్గిపోతున్నాయి. చనిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక బ్యాంక్ ఏం చేసింది??
హైదరాబాద్ సర్కిల్ కి చెందిన ఎస్‌బీఐ బ్రాంచ్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి 15 పులులను ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకుంది. ఎస్.బీ.ఐ నెహ్రూ జూలాజికల్ పార్క్ పులుల సంరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తోంది అని ఆ బ్యాంక్‌కు చెందిన చీఫ్ జెనరల్ మేనేజర్, ఓం ప్రకాష్ మిష్రా తెలిపారు.
కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాదు, వచ్చే సంవత్సరాలలో కూడా ఎస్.బీ.ఐ పులులను దత్తత తీసుకుంటూనే ఉంటుంది అని కూడా తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జూ మేనేజిమెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకి మిశ్రా శుభాకాంక్షలు తెలిపాడు. దత్తత నిమిత్తం ఫారెస్ట్ అండ్ వైల్డ్-లైఫ్ వార్డెన్‌కి ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ అయిన ఆర్.శోభకు మిశ్రా రూ.15 లక్షల చెక్ సమర్పించాడు.
వరుసగా 9వ సంవత్సరంలో మళ్లీ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి జంతువులను దత్తత తీసుకున్నందుకు ఆర్. శోభ కృతజ్ఞత తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ పట్ల ఇంత మంచి కార్యం చేపట్టడం నిజంగా గమనార్హం.
‘సేవ్ ఎనిమల్స్’, ‘సేవ్ టైగర్స్’ అని స్లోగన్స్ అరుస్తూ ర్యాలీలు చేస్తున్న ఈ కాలంలో ఎస్.బీ.ఐ జంతువుల సంరక్షణ కార్యాన్ని చేపట్టి చాలా మంచి పని చేసింది. అదీ కేవలం ఈ ఒక్క సంవత్సరం కాదు. 9 ఏళ్ల నుంచి వరుసగా దత్తత తీసుకుంటూనే ఉంది. ఎస్.బీ.ఐ ఇలాంటి పని చేస్తున్నందుకు మనందరం అభినందించాలి.
.