చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు బహిరంగంగా నిర్వహించడానికి రాష్ట్ర దేవదాయశాఖ పచ్చజెండా ఊపింది.
ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. కొవిడ్ తీవ్రత నేపథ్యంలో పురవీధుల ఉత్సవాలకు అనుమతి ఉంటుందో… లేదోనని ఆలయ అధికారులు, ముక్కంటి భక్తులు ఇన్ని రోజులు సంశయంలో ఉన్నారు.
ఉత్సవ మూర్తులను ఊరేగించడానికి అనుమతి రావడంతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 24న భక్తకన్నప్ప ధ్వజారోహణం… 25న స్వామి వారి ధ్వజారోహణం… 26న రెండవ తిరునాళ్లు…
27న మూడవ తిరునాళ్లు… 28న నాలుగవ తిరునాళ్లు… మార్చి 1న మహాశివరాత్రి, నందిసేవ, లింగోద్బవం… 2న పగలు రధోత్సవం, రాత్రి తెప్పోత్సవం… 3న శివ, పార్వతుల కల్యాణం…4న సభాపతి కల్యాణం… 5న కైలాస గిరి ప్రదక్షిణం… 6న ధ్వజావరోహణం…
7న పల్లకీ సేవ… 8న ఏకాంతసేవ నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి అభిషేకం, నిత్యోత్సవం ప్రారంభం కానున్నాయి.
శ్రీకాళహస్తిలో ముక్కంటి బ్రహ్మోత్సవాలకు దేవదాయశాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయం లోపల ప్రత్యేకంగా రంగవల్లులు వేస్తున్నారు. భక్తులను ఆకట్టకునే విధంగా రంగు రంగులు విద్యుత్ దీపాలతో అలంకరణ చేస్తున్నారు.
ఆలయ పరిధిలోని అన్ని గోపురాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రథోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని… జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని ఊరేగించే రథాలకు మరమ్మతులు చేపట్టారు. రాజగోపురం వద్ద ఉత్సవమూర్తుల వాహన సేవలకు మండపం సిద్దం చేశారు.
మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందున స్వామి, అమ్మవార్ల దర్శనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ అధికారులు, పోలీసులు కలసి క్యూలైన్లు కూడా ఇప్పటికే పరిశీలించారు.
ఇక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలు కూడా రెండు రోజుల్లో సిద్దం కానున్నాయి. ఆ తరువాత వీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో పాటు ప్రముఖులకు అందచేయనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన ప్రభుత్వం తరపున ముక్కంటికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ధూర్జటి కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమం స్థానికులకే పరిమితం చేయాలని దశలో అధికారులు ఆలోచించారు.
అయితే దేవదాయశాఖ అనుమతి నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు గతంలో లాగా యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రముఖులను పిలిపించడానికి అధికారులు చర్చలు జరుపుతున్నారు. వారితో పాటు స్థానికంగా ఉండే కళాకారులను ప్రోత్సహించాలనే ప్రధాన ఆశయంతో ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.
సమయం తక్కువ ఉన్నందున అన్నిశాఖల అధికారులు బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు, భక్తులు సహకరించాలని ఆలయ కార్యనిర్వహణాధాకారి పెద్దిరాజు విజ్ఞప్తి చేస్తున్నారు.
.