ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. విపరీతంగా మంచు దుప్పటి కప్పేయడంతో… అనేక రాష్ట్రాల్లో జనజీవితం స్తంభిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీఘర్, రాజస్థాన్, యుపి, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో దట్టంగా పొగమంచు అలుముకుంది.
పశ్చిమ హిమాలయాల నుంచి వీస్తున్న చల్లని గాలులతో ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. స్వెటర్లు లేకుండా పగటి వేళలో కూడా ఎవ్వరూ ఇంట్లోంచి వెలుపలికి రాలేకపోతున్నారు. పొగమంచు కారణంగా.. విజిబులిటీ తగ్గడం తో వాహనాలు, రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది.
ఒకవైపు మంచు దుప్పటికప్పేయడం.. జనజీవితాల్ని స్తంభింపజేయడం ఒక ఎత్తయితే.. అదే సమయంలో కాలుష్యభూతం మరింతగా కోరలు విప్పి కాటేస్తోంది.
ఢిల్లీలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. ఢిల్లీలో కాలుష్యం , పొగమంచు కారణంగా రోడ్లపై విజిబులిటీ తగ్గింది. వాహనాల రాకపోకలు తగ్గాయి. ప్రమాదాల భయంతో అంతా పార్కింగ్ లైట్లు కూడా వేసుకుని.. చాలా నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి కాలుష్య తీవ్రత 332పాయింట్లుగా ఉంది.