శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో విద్యాకుసుమాలు విరబూస్తున్నాయి. పట్టణానికి చెందిన ఓ యువతి తన స్వశక్తితో వాల్ మార్ట్ సీనియర్ మేనేజర్ అయ్యారు.
శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన రహంతుల్లా , సాజిద ల రెండవ కుమార్తె షేక్ షామిలీ చిన్నతనం నుంచి విద్యలోనూ, చదరంగం లోనూ రాణిస్తోంది. నేడు ఈ కామర్స్ ప్రపంచ అగ్రగామి సంస్థగా పేరు పొందిన వాల్ మార్ట్ గ్లోబల్ టేక్ (చెన్నై)లో సీనియర్ మేనేజర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి సుమారు రూ.40 లక్షల ప్యాకేజీ సాధించారు.
శ్రీకాళహస్తి లోని సరస్వతి శిశు మందిర్, విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన షామిలి ఇంటర్ మీడియట్ శ్రీ చైతన్యలో అభ్యసించారు. ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి శ్రీ విద్యానికేతన్‌లో బీటెక్ ఈసీఈ చదివారు. బీటెక్ మూడో సంవత్సరం లోనే ఆమెకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చెన్నైలోని టీసీఎస్ లో అవకాశం లభించింది. ఇక్కడ రెండు సంవత్సరాల్లో పనిచేసి మళ్లీ ఎం.టెక్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో శ్రీ విద్యానికేతన్ లో చేరడానికి సిద్ధమైంది. ఆ సమయంలోనే ఇన్ఫోసిస్ లో అవకాశం వచ్చింది.
హైదరాబాదులో పని చేస్తూ టీమ్ లీడర్ అయ్యారు. దీంతో ఆమెకు అమెరికాలో అవకాశం రావడంతో అమెరికాలోని బెన్ టిన్ విల్ లో పని చేశారు. సుమారు ఆరు సంవత్సరాలు ఇన్ఫోసిస్ లో పనిచేసిన ఆమె ప్రతిభ, జవాబుదారితనం, పట్టుదల, క్రమశిక్షణ ను చూసి వాల్ మార్ట్ లో అవకాశం కల్పించారు.
ఇక్కడ ఏడాది పాటు తన ప్రతిభను చూపిన ఆమెకు ఈ కామర్స్ లో కీలకమైన ఎంతో ప్రయత్నిస్తే తప్ప రాని అవకాశం లభించింది. వాల్ మార్ట్ సీనియర్ మేనేజర్ గా నియమితురాలైంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు మైనార్టీ నాయకులు, మిత్రులు అభినందించారు. ప్రాథమిక విద్యకే పరిమితమవుతున్న మైనారిటీల లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన షామిలీ శ్రీకాళహస్తికి కలికితురాయిగా చెప్పవచ్చు.
.