‘సర్’ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– ఈ పదం వింటేనే.. భారతీయ జనతా పార్టీ తమ ప్రత్యర్థులను మరింత బలహీన పరచడానికి పన్నిన ఒక కుట్రగా అభిప్రాయం కలుగుతుండవచ్చు. ఎందుకంటే.. అనూహ్యమైన రీతిలో కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీయే కూటమి సాధించిన విజయాలు- ఆయా రాష్ట్రాల్లో అప్పటికే ‘సర్’ పూర్తయి ఉండడం ఈ అభిప్రాయాన్ని కలిగించడంలో వింతేమీ లేదు. అందుకే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలు.. సర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రతి పార్టీ కూడా సర్ వల్ల మన పార్టీ నష్టపోతుంది. పార్టీ శ్రేణులందరూ సర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే.. ఏపీ ముఖ్యమంత్రి, ఎన్డీయే కీలక భాగస్వామి అయిన నారా చంద్రబాబునాయుడు కూడా తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. సర్ ద్వారా తమ పార్టీ వారి ఓట్లు తీయించేసేందుకు వైసీపీ కుట్రలు చేసే అవకాశం ఉన్నదని, తమ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపు ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో మనం గమనించాల్సింది ఏమిటంటే.. క్షేత్రస్థాయిలో ఏ పార్టీల బలం ఎక్కువగా ఉందో, ఏ పార్టీకి చిత్తశుద్ధి గల కార్యకర్తలు ఉన్నారో లెక్క తేలుతుంది. ఎందుకంటే.. సర్ లో తేల్చిన దొంగఓట్లను తొలగిస్తే.. ఆ జాబితాలను ప్రకటిస్తారు. నిజమైన ఓటర్లు ఆ జాబితాల్లో ఉంటే గనుక.. దరఖాస్తు చేసుకుని తమ ఓటు పోకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి సర్ ద్వారా.. అసలైన ఓటర్ల ఓటు పోతుంది అని అనుకోవడం భ్రమ. కాకపోతే ఇక్కడ ఓ మెలిక ఉంది. సర్ తొలగించిన ఓట్ల జాబితాలను ప్రకటించిన తర్వాత.. వాటిని సామాన్యులైన ప్రజలు చూసుకోవడం, అలాంటి అవగాహన కలిగిఉండడం చిన్న విషయం కాదు. నిత్యం పొట్టకూటి కోసం పరుగులు తీయడమే జీవితంగా గడిపే పేదలు ఇంత చొరవగా, తెలవిడితో వ్యవహరించగలరని అనుకోలేము. అలాంటప్పుడు కొంత అన్యాయం జరగవచ్చు.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే పార్టీ కేడర్ అవసరం ఏర్పడుతుంది. ఏ పార్టీకి క్షేత్రస్థాయి కేడర్ పటిష్టంగా, బలంగా ఉంటుందో వారు తొలగించిన ఓట్ల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి.. తమ తమ ప్రాంతాల్లో తొలగింపబడిన ఓట్లు గల వారిని నేరుగా కలిసి ఆ విషయం వారికి తెలియజెప్పి తిరిగి ఆ ఓటు పొందేలా చేయగలరు. దీనివల్ల ఆయా ఓటర్లలో ఆ పార్టీకి ఆదరణ పెరుగుతుంది. అలాగే.. ఆ పార్టీ అనుకూల ఓట్లు ఏవీ వడపోతలో తేలిపోకుండా కాపాడుకోవడం అవుతుంది. అంటే క్షేత్రస్థాయి లో నిజంగా పార్టీకోసం పనిచేసే నెట్ వర్క్ ఉన్న పార్టీ బలంగా నిలబడుతుంది.
పార్టీలు కేవలం సర్ మీద నిందలు వేస్తూ కూర్చోకుండా.. సర్ ఏరివేసిన ఓట్ల విషయంల తమ పార్టీల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండేలా, తిరిగి ఆ ఓట్లను పొందగలిగేలా వారికి తర్ఫీదు, శిక్షణ ఇవ్వడం అవసరం. అలా జరిగినప్పుడు సర్ ఫలితంగా నకిలీ ఓట్లు మాత్రమే వడపోతకు గురవుతాయి. నిజమైన ఓటర్లు ఎవరూ నష్టపోకుండా ఉంటారు.
.
Discussion about this post