అసలే ఆర్థిక ఇబ్బుందుల్లో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యావసర సరుకులు, వంటగ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి జనం అల్లాడుతుంటే.. ఇపుడు మళ్లీ జనంపై విద్యుత్ ఛార్జీలు బాదడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఏడు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజలపై భారం మోపడం భావ్యం కాదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును టీడీపీ ఖండిస్తున్నట్లు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండు చేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో సామాన్యులు జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఒక్క ఛాన్స్ ఇమ్మని కాళ్ళు గడ్డాలు పట్టుకుని అధికారంలోకి వచ్చి ప్రజలపై ఇలా మోయలేని భారం వేయడం ఏంటన్నారు. ఎన్నికలకు ముందు చార్జీలు తగ్గిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ బిల్లులు షాక్ కొట్టేలా పెంచారని మండిపడ్డారు. ఒక పక్క కరెంటు కోతలతో జనం అల్లాడుతుంటే… వైసీపీ ప్రభుత్వం పేదలపై విద్యుత్ చార్జీల భారం మోపడం అన్యాయమని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎండలు మండుతుంటే విద్యుత్ వాడకం తగ్గించుకోవాలనడం.. జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యానికి నిదర్శనం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం కోసం నమ్మి ఓట్లు వేసిన ప్రజలపై భారం మోపి, ప్రజలను బాధపెడతారా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు.. 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు.. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.40 పైసలు.. 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 6 లు.. 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.75 పైసలు.. 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్‌కు రూ. 9.75 పైసలు ఈ ప్రభుత్వం ఛార్జీలను పెంచిందన్నారు.
అంటే రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వానికి ఎంత ద్వేషం ఉందో ప్రజలందరికి అర్ధం అవుతోందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ పై టాక్స్ ఎక్కువగా వేసి ప్రజలపై భారం మోపడమే కాకుండా, ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మరింత భారం మోపి… ప్రజలకు ఉగాది కానుకగా అధిక చార్జీల భారాన్ని ప్రజలు ఇచ్చారు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో, రాష్ట్రంలో సామాన్యులు జీవించలేని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై ప్రభుత్వం మరో భారాన్ని మోపడం అన్యాయం అని దుయ్యబట్టారు. పరిపాలన చేతకాక వ్యవస్థలన్నిటినీ దిగజార్చి… ఆర్థికంగా కుదేలు చేసి.. ఇప్పుడా భారాన్ని ప్రజల మీద వేయడం దుర్మార్గమన్నారు.
ఆర్టీసీ బస్సు చార్జీలు, పెట్రోలు చార్జీలు, ఫైబర్ గ్రిడ్ చార్జీలు, ఇప్పుడు విద్యుత్ చార్జీలు… సామాన్యుడి మీద ఏంటీ ఆర్థిక భారం? అని విమర్శించారు. టీడీపీ హయాంలో భవిష్యత్తులో కరెంట్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన మాట నిలబెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి అని అన్నారు.
.