రేమాండ్స్ బ్రాండ్ సృష్టికర్త, ఒకప్పటి అపర కుబేరుడు విజయ్‌పత్ కైలాష్‌పత్ సింఘానియా (4 October 1938 – 28 March 2026) ఎనభై ఏడేళ్ల వయస్సులో మూడు రోజుల కిందట మరణించారు. 1967 లో తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన కంపెనీని లాభాల బాటలో నడిపి భారత దేశంలో అత్యధిక సంపన్నుడిగా పేరు పొందారు. #thecompleteman అనే ట్యాగ్ లైన్ తో ఇప్పటికీ మోజు ఉన్న రేమాండ్స్ బ్రాండ్ ను గుడ్డి ప్రేమతో 2016 లో పూర్తిగా కొడుకు చేతికి అప్పగించడంతో సింఘానియా కష్టాలు మొదలయ్యాయి.
వేల కోట్ల అధిపతి షేర్లు అన్నీ కొడుకుకి ఇవ్వడం, నిరాదరణకు గురై అద్దె ఇంట్లో ఉండాల్సిరావడం, కొడుకు మీద కోర్టు మెట్లు ఎక్కినా లాభం లేక సాధారణ జీవితం గడపడం పదేళ్లుగా మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. వస్తు వ్యామోహ సంస్కృతి, జల్సా జీవిత లాలస పెరిగి, నాన్నా అమ్మ ల మీద ప్రేమలు తగ్గుతున్న ఈ డబ్బు సెంట్రిక్ ప్రపంచంలో (అది mini world కాదు… Money World) సింఘానియా జీవితం, మరణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
కుక్క పాట్లు పడి, నానా గడ్డి కరిచి, సొంత లాభం చూసుకోకుండా పిల్లలకు సంపాదించి పెట్టాలన్న సూత్రమే పెద్ద తప్పు. అమ్మాయి, అబ్బాయి ఉంటే… పిల్ల పెళ్ళిచేసి, ఉన్నదంతా పోరగాడికి దూసిపెట్టి వాడి చెంత శేష జీవితం గడపాలన్న టెంప్లేట్ మనది కదా! ఇది గతంలో నడిచింది కానీ ఇప్పుడు చాలా వరకు నడవడం లేదు. సోషల్ మీడియా రీల్స్ లాగా రోజులు వేగంగా మారుతున్నాయి.
అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్నా (బతికే) ఉన్నారా? వాళ్ళు పెళ్లి అయ్యాక కూడా అతనితోనే ఉంటారా? అన్న ప్రశ్న ఇప్పుడు పిల్లనిచ్చే అమ్మాయి వాళ్ళు మొహమాటం లేకుండా అడుగుతున్నారు. అమ్మా నాన్న ఉన్నారా? అని అడగకుండా కాస్త సూచ్యార్థంలో డస్ట్ బిన్ లు ఉన్నాయా? అని అడుగుతున్నట్లు మా బంధువు ఒకరు చెప్పారు.
కోడలు, ఆమె తల్లి దండ్రులు మన జీవితాల శాసకులు అయి కూర్చున్నారు. కోడలు చేతిలో కొడుకు కీలుబొమ్మ అయ్యాడని లోలోపల వగచిపోయే వృద్ధ పేరెంట్స్ పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. అట్లాగని మన కూతురు కుటుంబం పట్ల మనం కనికరంతో ఉంటున్నామా? అంటే అదీ లేదు. ఒక కనిపించని సంక్షోభంలో ఈ సంబంధాలు ఉన్నాయి.
అందుకే, ఇట్లా చేస్తే బాగుంటుందని నాకు ఉంది. నేను పాటించేది కూడా అదే:
1) భావి తరాల కోసం బాగా కూడపెట్టి ఇవ్వాలన్న ఐడియా బ్యాడ్. అయ్య బాగా సంపాదించి గోల్డెన్ స్పూన్ ఇస్తే… బ్యాడ్ బాయ్స్ అయ్యే వాళ్లే ఎక్కువ. తన సొంతకాళ్ళ మీద తాను నిలబడి, తన జీవితాన్ని తాను నిర్మించుకునే అవకాశం ఇవ్వకపోతే… పిల్లవాడు సుఖం మరిగి లేనిపోని తలనొప్పులు తెస్తాడు. బతుకు భయం లేని వాళ్ళు తీరిక బాగా దొరికి నాశనం అయ్యే ఛాన్స్ లు ఎక్కువ.
2) 55 దాటాక వ్యాయామం, విశ్రాంతి మీద దృష్టిపెట్టాలి. డబ్బు కోసం టెన్షన్ తీసుకుని జబ్బుల పాలయ్యమా? ఖతం. మన గొయ్యి మనం తీసుకున్నట్లే. సంపాదన యావ తగ్గించి తీరాలి.
3) పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్ల వరకే మన బాధ్యత అన్న స్పృహతో ఉండాలి. ఈ ఫిలాసఫీ నే పిల్లలకు కూడా బోధించాలి. డబ్బు, ఆస్థుల కన్నా పిల్లలకు సంస్కారం ఇవ్వాలి.
4) ఉన్నదంతా ముందే రాసి ఇవ్వడం ఘోర మైన తప్పు. లోన్స్ కోసమని ఆస్తులు తమ పేరు మీద ఉంటే సులువని కొడుకు, కోడలు వచ్చి ఏడుస్తూ అడిగితే మనసు కరిగిందా? మన పని గోవిందా!
5) పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్ గట్టిగా ఉండాలి. ఈ రోజుల్లో పెన్షన్ లేని వారే ఎక్కువ కాబట్టి… ఇల్లు గడిచేలా నెలకు ఇంత డబ్బు వచ్చి బ్యాంక్ అకౌంట్లో పడే ఏర్పాటు చేసుకోవాలి.
6) మిత్రులు, మిత్రులు, మిత్రులు. ఆరోగ్యవంతమైన, సుఖమయైన జీవితానికి
ఫ్రెండ్స్ చాలా చాలా ముఖ్యం. ఒకరిద్దరు ఆత్మీయ మిత్రులను ముందు నుంచే కేవలం ప్రేమ, ఆత్మీయత ప్రాతిపదికన తయారు చేసుకుని ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ల పిల్లలతో మనం, మన పిల్లలతో వాళ్ళు మాట్లాడే చనువు, విశ్వాసం ఏర్పాటు చేసుకోవాలి.
7) పిల్లలు ఉన్నా… సౌకర్యంగా ఉండే వృద్ధాశ్రమాలలో ఉండడం తప్పు అన్న పిచ్చి భావన వదిలిపెట్టాలి. బాగా నడుస్తున్న రెండు మూడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ తో సంబంధాలు పెట్టుకుని అపుడపుడూ విజిట్ చేసి రావడం ముందుచూపు ఉన్నవారు చేసే పని.

.

Discussion about this post