రెండ్రోజుల కిందట నాకు కూతురు వరస అయ్యే అమ్మాయి ఫోన్ చేసింది. మంచీ చెడూ అడిగింది. సీజనల్ టాపిక్ గనుక.. ఆ అమ్మాయి నెల్లూరు పిల్ల గనుక అనివార్యంగా సంభాషణ క్రిష్ణాపట్నం ఆనందయ్య మందు మీదకు మళ్లింది. ‘మాకు పార్సిల్ వచ్చిందమ్మా.. అందరం తిన్నాం’ అని చెప్పా. ‘వరంగల్లో మా చెల్లెలు ఒకమ్మాయి ఉంటుంది బాబాయ్.. వాళ్లు ఆనందయ్య మందు బ్లాక్ లో కొన్నారంట. అరవై వేలకి కొన్నారు బాబాయ్.. నలుగురికి వచ్చిందంట’ అని చెప్పింది. ఆనందయ్య నలుగురికి సరిపడేలా మందు చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో ఇచ్చాడనే సంగతి మనందరికీ తెలుసు. క్రిష్ణపట్నంలో జనం తొక్కిసలాట, లాఠీచార్జిలు జరిగినా.. అది వరంగల్ దాకా వచ్చి అక్కడ బ్లాక్ మార్కెట్లో అరవై వేలకు అమ్ముడు పోవడం చిత్రమైన సంగతి!
ఈ సీజన్లో చాలా మంది ఆనందయ్యను దేవుడికింద పరిగణించారు. మందు ప్రభావం సంగతి పక్కన పెడితే.. దానిని ఉచితంగా అందరికీ ఇవ్వడం గొప్ప విషయం. ఆ మందు ‘క్లిక్’ అయిందని ప్రచారం జరగగానే రకరకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరిగినా, దానిని మార్కెట్ చేసే ప్రయత్నాలు జరిగినా ఆనందయ్య వద్దనుకున్నాడు. ఉచితంగా మాత్రమే ఇస్తానన్నాడు. తొలిరోజుల్లో డబ్బు నాకు ఇవ్వద్దు… మందు తయారీకి వాడే ముడిదినుసులు మీకు తోచినవి తెచ్చి ఇవ్వండి అని కూడా చెప్పాడు. ఆనందయ్య మందు రేకెత్తించిన సంచలనం, దక్కిన ఆదరణ, వివాదాలు, నిర్బంధాలు అన్నీ ముగిసి ప్రభుత్వం దాన్ని అధికారికంగా ఇవ్వడానికి అనుమతించింది. ఉచితంగా ఇస్తూ వచ్చిన ఆనందయ్య వ్యవహారం.. ప్రభుత్వ జోక్యం తరువాత ఇప్పుడు ఆన్ లైన్ మార్కెట్ లోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. క్రిష్ణపట్నం ఎవ్వరూ రావొద్దని, ఆన్లైన్ లో అందరికీ అమ్ముతారని వార్తలు వచ్చాయి.
ప్రభుత్వం పూనికతో ఆన్ లైన్ లో అమ్మడం అనేది పెద్ద మాయ. ఇది ఇంకో రకంగా బ్లాక్ మార్కెట్ ను పెంచి పోషించే ప్రక్రియ అని అనుమానం పుడితే అతిశయం కాదు. సీజన్ సమయాల్లో రైల్వే టికెట్లు ‘బ్లాక్’ అయినట్లే ఇది కూడా తయారైతే.. ముందు ప్యాకెట్లు మొత్తం దళారీల పరమైతే, కూరగాయలు తక్కువ ధరకు అమ్మే ప్రభుత్వ వెబ్ సైట్ల లాగా.. ఎప్పుడు చూసినా ‘నో స్టాక్’ బోర్డు దర్శనమిస్తే ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఆనందయ్య మందు కరోనా మీద పనిచేస్తుందా లేదా అనేది వేరే చర్చ. కానీ.. దానిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ప్రమాదం లేదన్నది నిరూపణ అయింది. అలాగూ.. చాలా మందిలో ఆ మందు ఒక ‘హోప్’ను నింపింది. కరోనా బారిన పడిన వాళ్లకు హోప్ చాలా అవసరం అని.. వారితో రోజూ మాట్లాడుతూ, పాజిటివ్ థింకింగ్ నింపాలని ఈ సీజన్లో చాలా మంది చెబుతున్నారు. కనీసం ఆనందయ్య మందు కరోనాను చంపేసినా లేకపోయినా.. అలాంటి గొప్ప హోప్ ను వేలమందిలో కలిగించిన మాట నిజం.
‘హోప్’ పుట్టించగలిగే.. నీకు ధైర్యం ఇవ్వగలిగే ప్రతి వ్యవహారం.. తొలుత ఆదర్శంగా ప్రారంభం అయినా.. నెమ్మదిగా దాని చుట్టూ వ్యాపారం ముదురుతుంది. దేవుడు కూడా అంతే. ‘దేవుడు అంటే మొక్కితే.. మనకు మంచి చేస్తాడు’ అని నమ్ముతాం. కానీ, ఆ నమ్మకం చుట్టూ ఇవాళ ఎలా వ్యాపారం వేళ్లూనుకున్నదో మనం చూస్తూనే ఉన్నాం.
ఆనందయ్య ఉచితంగా మందు పంచిపెట్టాలని సంకల్పించిన మంచివాడు. కానీ దళారీతనం, వ్యాపారం అలవాటైన వాళ్లు దాన్ని కూడా వదిలిపెట్టలేదు. దళారీ అనేవాడు ఎప్పటికీ బాగుపడుతుంటాడు. ప్రపంచంలో అన్ని వ్యవస్థలు, వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలు అన్నీ శిథిలమైపోయినా సరే.. దళారీ పనిని మాత్రమే నమ్ముకున్న వాడికి చింత ఉండదు.
అన్నదానం జరుగుతున్న చోటులో కూడా, ఆ టోకెన్లను బ్లాకులో అమ్ముకుని ఆర్జించుకోగల మేథోసంపన్నులు కొందరుంటారు! వారు ‘తివిరి ఇసుమున తైలంబు తీయగల’ ఘనులు. ‘కుందేటి కొమ్మును సాధించ’గలవారు. అలాంటి వారే ఆనందయ్య మందును అమ్మగలిగిన వారు!

.