ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేయక పోవడం బాధాకరమని టీడీపీ మైనార్టీ విభాగం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జిలానీ బాషా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ఆదివారం శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. తమకెంతో పవిత్రమైన రంజాన్ పండుగను అందరితో సమానంగా, సంతోషంగా జరుపుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు పండుగ సరుకులను రంజాన్ తోఫా పేరుతో ఇచ్చేదన్నారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ తోఫాకు మంగళం పాడేసిందన్నారు. దీంతో పేద ముస్లింలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముస్లిం మైనారిటీ వర్గాల మద్దతుతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి మూడేళ్లుగా రంజాన్ తోఫా ను పంపిణీ చేయకుండా పేద ముస్లిం ప్రజల జీవితాలలో చీకటిని నింపాడని జిలానీ దుయ్యబట్టారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు తోడు, కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా సరైన ఉపాధి అవకాశాలు లేక పూట గడవడమే భారమైన పరిస్థితులలో ఎంతో ఉపయోగపడే రంజాన్ తోఫాను పునరుద్దరించాలని కోరారు.
ముస్లింల సాయంతో అధికారంలోకి వచ్చి.. వారికే ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి ముస్లిం సమాజం సిద్ధంగా ఉందని జిలానీ తెలిపారు.
.