పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ అధ్యక్షులు విజయకుమార్ డిమాండు చేశారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ.. జగన్ తన పాదయాత్రలో బాదుడే బాదుడు అని విమర్శించి.. అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు ఇష్టం వచ్చినట్లు పెంచేశారన్నారు.
జగన్ మాటలు అర్ధం చేసుకోలేక జనం నమ్మి ఓట్లు వేస్తే పన్నులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం దూరదృష్టితో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేస్తే… జగన్ పక్షపాత ధోరణితో మొత్తం నాశనం చేశారన్నారు.
పెరిగిన పన్నులు, ధరలతో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. సామాన్యులు నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు రూ.6లకు యూనిట్ విద్యుత్ ను సరఫరా చేస్తే విమర్శించిన జగన్ మోహన్ రెడ్డి ఆయన ప్రస్తుతం రూ.11.20లకు అమ్ముతున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అస్తవ్యస్త పరిపాలనను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.
కొందరు కార్యకర్తలు విసనకర్రలు విసురుతూ, మరికొందరు లాంతరు తలపై పెట్టుకుని కాగడాలు పట్టుకుని ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దశరథాచారి, చక్రాల ఉష, గాలి చలపతినాయుడు, చెంచయ్య నాయుడు, గురువారెడ్డి, కుమారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
.