అమెరికాలోని తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) 2022 సంవత్సరానికి గాను నిర్వహించిన కథల పోటీ ఫలితాలను వెల్లడించింది. కథల పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.లక్ష రూపాయల బహుమతులు ఇస్తాం అని ప్రకటించిన సంస్థ, ఫలితాలు వెల్లడయ్యే సరికి ఏకంగా 17 కథలను బహుమతులకు ఎంపికచేసి అన్నింటికీ కలిపి 3,02,000 రూపాయల బహుమతులను ప్రకటించింది.
తెల్సా సంస్థ 2022 సంవత్సరానికి గాను కథ- కవిత విభాగాల్లో పోటీలు నిర్వహించింది. కవితల పోటీ ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. కవితల పోటీల్లో కూడా రెండు కవితలను ఎంపిక చేసి రూ.40 వేల బహుమతులు ఇస్తామని ప్రకటించిన నిర్వాహకులు, చివరికి ఎనిమిది కవితలకు రూ.72వేల బహుమతులను అందజేశారు.
తెల్సా సంస్థ 2019లో కథ, నాటకం ప్రక్రియల్లో పోటీలను నిర్వహించింది. అప్పుడు కూడా ప్రకటించిన దానికంటె ఎక్కువ మొత్తంలో విజేతలకు బహుమతులు ఇవ్వడం విశేషం.
తెల్సావారి కథల పోటీ విజేతల ప్రకటన :
తెల్సా కథలపోటీకి 200 పైచిలుకు కథలు వచ్చాయి. చేతివ్రాతలో ఉన్నవీ, హామీపత్రం లేనివీ, ఫాంటు కారణంగా మేము చదవలేకపోయినవీ మినహాయించగా, మిగిలిన కథలు పోటీకి పరిశీలించాము. చేయి తిరిగిన రచయితలే కాక, తొలిప్రయత్నంచేసిన రచయితలతోసహా ఎంతోమంది ఆసక్తితో పాల్గొనడం సంతోషం.
ఎలక్ట్రానిక్‍గా ఈమెయిల్ ద్వారా మాత్రమే రచనలు స్వీకరించడం వల్ల వెంటనే రచయితలకి వారి కథ మాకు చేరినట్లు తెలియచేయగలిగాము. కొందరు రచయితలు ఒకటికన్నా ఎక్కువ రచనలు పంపారు. కొందరు రచయితలు తమ కథలకి మార్పులు చేర్పులు చేసి, కొద్దిరోజుల తరువాత రెండవ ప్రతి పంపారు. యూనికోడు వర్డ్ ఫార్మాటులో పంపిన రచనలని మాత్రమే స్వీకరిస్తామని ప్రకటించినా, కొందరు యూనికోడు కాని ఇతర ఫాంటులో కూడా టైపు చేయించి పంపారు. అటువంటి రచనలు పీ.డీ.యఫ్ ఫార్మాటులో ఉంటే వాటిని కూడా పరిశీలించాము. మేము పరిశీలించలేని ప్రతి కథారచయితకీ వారి కథని ఎందుకు పరిశీలించలేమో స్పష్టంగా తెలియచేసాము. కొందరు రచయితలు తిరిగి యూనికోడులో టైపు చేయించి పంపారు.
చాలా కథలమీద టీవీ సీరియళ్ళ, సినిమాల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. జీవితానుభవంతో రాసిన కథలకన్నా, జీవితం గురించి తగినంత అవగాహన లేని కథలు ఎక్కువ రావడం విచారకరం. భాష, శిల్పం, శైలి, పాత్రచిత్రణ విషయంలో కొందరు కథకులు శ్రద్ధ తీసుకోలేదు.
ఈ క్రింది కథలు బహుమతులకి ఎంపిక చేసాము. ముందు మేము అనుకున్నట్లు కాక, ప్రతి బహుమతికి రెండు కథలు ఎంపిక చేసాము. మరొక రెండు కథలని విశిష్టరచనలుగా ఎంపిక చేసాము. తొమ్మిది కథలు సాధారణ ప్రచురణకి ఎంపిక చేసాము. మొత్తం ₹3,02,000 పారితోషకం ఇస్తున్నాము. ఒకే రచయిత పంపిన కథలలో ఒకటి రెండవ బహుమతికి, మరొకటి విశిష్ట రచనకు ఎంపిక కావడం విశేషం.
మొదటి బహుమతి ₹50,000: కర్రెద్దు – కె.వి.వి. సత్యనారాయణ
మొదటి బహుమతి ₹50,000: దాహం – డా. జడా సుబ్బారావు
రెండవ బహుమతి ₹30,000: గేణమ్మ – కె.ఎ. మునిసురేష్ పిళ్లె
రెండవ బహుమతి ₹30,000: జాలారి పూలు – ఎండపల్లి భారతి
మూడవ బహుమతి ₹20,000: ఉల్లిపూసలు – పెద్దింటి అశోక్ కుమార్
మూడవ బహుమతి ₹20,000: వాన మబ్బులు – కె.వి. మేఘనాథ్ రెడ్డి
విశిష్ట రచన ₹15,000: ఆరంజ్యోతి మాకు కనపడే ఆర్నెల్ల అప్పుతో – ఎండపల్లి భారతి
విశిష్ట రచన ₹15,000: వేస్ట్ బాడీ – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు: ఒక్కొక్కదానికి ₹8,000 పారితోషికం
అంగన – ఉయ్యూరు అనసూయ
ఈ శిక్ష మాకొద్దు – బి నర్సన్
ఋణం – గాజోజు నాగభూషణం
పులి వన్నె మేక – ఉమా మహేష్ ఆచాళ్ళ
బృందావనమది – వసుంధర
రాజవ్వ – పొత్తూరి సీతారామరాజు
వజ్రం – శ్రీసుధామయి
వెయిటింగ్ ఫర్ వీసా – డాక్టర్ ఎమ్ సుగుణ రావు
హద్దులకు ఆవల – నస్రీన్ ఖాన్
ఎంపికైన కథలు వీలైనంత త్వరలో తెల్సా వారి వెబ్‍సైటులో ప్రచురిస్తారు. తెల్సా వెబ్‍సైటులో ప్రచురించిన తర్వాతే రచయితలు వేరోచోట ప్రచురించుకోవచ్చునని తెల్సా బృందం అనుమతించింది.
.