ఏపీలో సినిమా థియేటర్లు చాలా వరకు మూతపడ్డాయి. అధికారులు దాడులు నిర్వహించి నిబందనలకు విరుద్ధంగా ఉన్న కొన్నింటిని సీజ్ చేశారు. అధికారుల దాడులకు నిరసన తెలియజేస్తున్నాం అంటూ.. మరికొందరు థియేటర్ యజమానులు తమంతట తామే మూసేశారు. అధికారులు ఆయా థియేటర్లలో రకరకాల నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి.. సీజ్ చేయడం జరిగింది. ఇదంతా గతం–
ఇక వర్తమానంలోకి వస్తే.. మూతపడిన థియేటర్లను తెరిపించుకోవడానికి ప్రభుత్వంతో మంతనాలు ప్రారంభం అయ్యాయి. తాము సినిమా సెలబ్రిటీలం కనుక.. సాక్షాత్తూ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టగలమని కొందరు అనుకుంటున్నారు గానీ.. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరినీ తన చెంతకే రానివ్వడం లేదు. సో, అందరికీ ఇక పేర్ని నాని మాత్రమే దిక్కయ్యారు. పేర్ని నానిని కలిసి.. థియేటర్లను తిరిగి తెరిచేలా అనుమతించాలని కోరుతున్నారు.
ఒకసారి మూసేస్తే.. ఏదో నేరులో కలిసి విన్నపాలు చేసుకుంటే పనైపోతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ.. ఏపీ సర్కారు ఎదుట ఆ పప్పులేమీ ఉడకడం లేదు. సినిమా పరిశ్రమ ప్రముఖులు అనేక దఫాలుగా ఏపీ మంత్రి పేర్నినానిని కలిశారు. మూతపడిన థియేటర్ల గురించి, టికెట్ల ధరల గురించి రకరకాల చర్చలు సాగించారు. అనేక దఫాల చర్చలు సాగాయి తప్ప.. ప్రభుత్వం ఏకొంత అయినా మెత్తబడ్డట్టుగానీ, ఒక మెట్టు దిగివచ్చినట్టుగానీ కనిపించడం లేదు.
ఫైనల్ గా గురువారం నాటికి.. మూతపడిన థియేటర్ల యజమానులు వెళ్లి జేసీలను కలవాలని, అన్ని పత్రాలు దగ్గరుంచుకుని, అన్ని నిబంధనలు పాటిస్తామని నెలలోగా సరిచేసుకుంటామని రాతపూర్వకంగా జేసీలకు హామీ ఇచ్చి తర్వాత.. థియేటర్లు తెరుచుకోవచ్చునని మంత్రి పేర్నినాని అంటున్నారు. ఇక అసలు రాయబారం ఏముంది? ఇన్ని దఫాల విన్నపాలతో వారు సాధించినది ఏముంది.
అన్ని నిబంధనలూ పాటిస్తే.. ఇక జేసీలు డైరక్టుగా అనుమతి ఇచ్చేస్తారు కదా. నెలలోగా నిబంధనల్నీ పాటించే పరిస్థితి ఉన్నా కూడా.. ఇన్నాళ్లూ మంత్రి చుట్టూ తిరిగే బదులు ఆ పనుల మీద ఫోకస్ పెట్టినా సరిపోతుంది కదా..! అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.
ఇన్నాళ్లూ నిబంధనలు అతిక్రమించి థియేటర్లు నడిపిన యజమానులు ఇప్పుడు సీజ్ అయ్యాక/ లేదా వారు మూతపెట్టిన తర్వాత.. నిబందనల గురించి పట్టించుకోకుండా.. ప్రభుత్వం వద్దకు ఎందుకు చర్చలకు వెళుతున్నారనేదే అర్థం కాని సంగతి. నిబంధనలు పాటించి తీరాల్సిందే అని ప్రభుత్వం గట్టిగా ఖండితంగా చెప్పడాన్ని తప్పు పట్టలేం.
థియేటర్ల యజమానులు కూడా ఇప్పటికప్పుడు తెరిచేసుకుంటాం అనే డిమాండ్ తో కాకుండా, వాళ్లు దొంగమార్గాలు అనుసరించాల్సి వచ్చేంత కఠినంగా నిబంధనలు ఉన్నాయని అనిపిస్తే వాటిని సడలించాల్సిందిగా విజ్ఞప్తి చేయాలి. అంతే తప్ప.. నిబంధనలు మీరి నడుస్తామనే డిమాండ్ తో వెళ్లినంత కాలం ఉపయోగం ఉండదు. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండిపట్టును ఎవరైనా తప్పుపట్టగలరేమో గానీ.. థియేటర్ల విషయంలో నిబంధనలు పాటించాల్సిందే అనే ప్రభుత్వ పట్టదలను ఆక్షేపించలేరు. కేవలం మాటల వలన, సానుభూతితో ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు.
.