తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరుకు చెందిన జయంపల్లి శివశంకర్ (23) అనే యువకుడు 20 రోజుల కిందట అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై శివశంకర్ బంధువులు అన్నమయ్య జిల్లా పుల్లంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరుకు చెందిన జయంపల్లి సుబ్బరాయుడు, వెంకటమ్మ దంపతుల కుమారుడు జయంపల్లి శివశంకర్ పుల్లంపేట మండలం ఆర్. రాసపల్లి గిరిజన కాలనీలో తిరుపతి గంగాదేవిని మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.
శివశంకర్ తండ్రి సుబ్బరాయుడు కొంతకాలం కిందట మరణించాడు. ఈ యువకుని తల్లి వెంకటమ్మ బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లింది. మేలచ్చూరులో శివశంకర్ మాత్రమే ఉంటున్నాడు. ఇతనికి వివాహం అయినా… భార్య గంగాదేవి మాత్రం ఎక్కువ భాగం అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది.
వీరి మధ్య విభేదాలు రావడంతో ఇటీవలనే పంచాయతీ నిర్వహించి రాజీ చేశారు. శివశంకర్ భార్య గంగాదేవి సుమారు రెండు నెలల కిందట అమ్మగారి ఇళ్లైన పుల్లంపేట మండలం ఆర్. రాసపల్లి గిరిజన కాలనీకి వెళ్లింది. ఈ నేపథ్యంలో శివశంకర్ నాలుగు వారాల కిందట భార్య వద్దకు వెళ్లాడు. గంగాదేవి తల్లిదండ్రలైన తిరుపతి నారాయణమ్మ, వెంకటయ్య ఆర్. రాసపల్లికి చెందిన సునీల్ రెడ్డి మామిడి తోట వద్ద కాపలాగా ఉంటున్నారు.
తోటలోనే ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. దీంతో గంగాదేవి కూడా తోట దగ్గరే ఉంటోంది. ఈ కారణంగా శివశంకర్ కూడా అక్కడికే వెళ్లాడు. శివశంకర్ మూడు రోజుల పాటు తోటలోనే పని చేశాడు. నాలుగవ రోజు రాత్రి కుందేలు వేట కోసం తోట లోపలికి వెళ్లాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కనిపించలేదు.
ఆ తరువాత శివశంకర్ భార్య గంగాదేవి ఈ విషయాన్ని మేలచ్చూరులోని బంధువులకు ఫోన్ ద్వారా తెలిపింది. దీంతో శివశంకర్ పిన్నమ్మ కుమారుడు నాగేష్ పుల్లంపేటకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జరిగి నాలుగు వారాలు అయినా శివశంకర్ ఆచూకీ తెలియడం లేదు. అతడు ప్రాణాలతో ఉన్నాడా..? లేదా ..? అని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసు పట్ల పుల్లంపేట పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో మామిడితోట చుట్టూ విద్యుత్ తీగలు అమర్చుతారని… శివశంకర్ కుందేళ్ల్ వేట కోసం ఏమైనా జరిగిందేమోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు వెంటపనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుని బంధువులు వేడుకుంటున్నారు.
Discussion about this post