బెంగళూరు నగరంలో ఒమైక్రాన్ అతివేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బీబీఎంపీ మరిన్ని కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే మాల్స్, థియేటర్‌లలో ప్రవేశానికి వ్యాక్సిన్ రెండు డోసుల సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.
ఇదే విధానాన్ని పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లతోపాటు క్యాబ్‌లకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. త్వరలో ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారు.
ప్రజలు అత్యధికంగా గుమిగూడే బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లలో కూడా ఈ నిబంధనలను అమలులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం అందరి వద్దా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నందున ఈ విధానాన్ని అమలు చేయడం పెద్దకష్టం కాదని బీబీఎంపీ అధికారులు అంటున్నారు.
ఒకవేళ స్మార్ట్‌ఫోన్‌లు లేనివారు రెండుడోసులకు సంబంధించిన సర్టిఫికెట్‌ను చూపితే సరిపోతుందన్నారు. పరిస్థితిని బట్టి బీఎంటీసీ, ఆర్టీసీ బస్సులలో కూడా దశలవారీగా అమలు చేసేందుకు ఆలోచిస్తున్నారు.
ఇలా చేయడం వల్ల కనీసం వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకోవచ్చునని తలపోస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు లేనివారు రెండుడోసుల సర్టిఫికెట్ కాపీని ప్రింట్ చేయించుకునేందుకు జిరాక్స్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. రెండు డోసుల సర్టిఫికెట్ ఇప్పటికే విద్యాసంస్థలకు కూడా తప్పనిసరి చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా..
ఒమిక్రాన్ విస్తృతి తెలుగురాష్ట్రాల్లో కూడా వేగంగా జరుగుతోంది. తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మాస్క్ లేకుండా బయట తిరిగితే వెయ్యిరూపాయల జరిమానా విధించేాలా నిబంధనలు అమలు చేస్తున్నారు.
.