ప్రియురాలి కోసం గిఫ్ట్లు… ట్రిప్పులు కోసం అయ్యే ఖర్చులు గురించి మాట్లాడటం లేదు. మనుసుపడ్డ మగువ కంటి చూపు కోసం… చిరునవ్వు కోసం ఎదురు చూసే క్షణం నుంచి వెచ్చించే కాలాన్ని లెక్క వేసుకోండి.
ఆ చిన్నది లిపిలేని కంటి బాసతో ప్రేమకు ఆమోదం తెలిపితే అక్కడి నుంచి ఆమెను చూసేందుకు పడే తపన… కళ్ళు కళ్ళు కలిశాక మాట మాట కలిపేందుకు నిమిషాలను యుగాలుగా గడపాల్సిందే. ఊసుల్లో ఊహల్లో కరిగిపోయే కాలానికి ఖరీదు కట్టే షరాబులెవరు?
దూకుడు సినిమాలో సమంత మాదిరి టైప్ 2 అమ్మాయి అయితే రోమియో కాలం మరీ ఖరీదుగా ఉంటుంది.
గత కాలంలో ప్రేమ లేఖల కోసం… ఈ రోజుల్లో వాట్సాప్ మెసేజుల్లో కాళిదాసుల్లా కవిత్వాలు రాసేందుకు బుర్ర వేడెక్కించాలి. ఆ వేడిని కొలిచే సాధనం ఎక్కడ?
మనసులు ఇచ్చిపుచ్చుకున్నాక వారిద్దరి మధ్య కాల చక్రం గిర్రున తిరిగిపోతూ ఉంటుంది. ప్రేమకు పరమావధి పెళ్లి అనుకొంటే అటూఇటూ ఒప్పించడానికి పోరాటాలే చేయాలి.
ప్రేమ కోసం.. పెళ్లి కోసం వెచ్చించే కాలం, పడే టెన్షన్ తరవాత తియ్యగా అనిపించినా వాటిని కరెన్సీల్లోకి మార్చి చూసుకొంటే చాలా విలువైన కాలాన్ని ప్రేమ బాసల కోసమో.. మనసుపడ్డ వారి చిరునవ్వు కోసమో ఖర్చు చేసేయాల్సి ఉంటుంది.
ఇక ‘లవ్ గురు’లు ఉంటారు… వాళ్లిచ్చే అవిడియాల కోసం వాళ్ళకు చేసే ఖర్చులు జి.ఎస్.టి. లాంటివి.
ప్రేమ పిందె నుంచి పండై మధురంగా మారితే ఈ ఖర్చు గురించి ఎవరూ ఆలోచించరు. తేడా కొడితేనే బ్యాలెన్స్ షీట్ చూసుకొని కాళిదాసులు కాస్తా దేవదాసులైపోతారు. అక్కడి నుంచి వచ్చే ఖర్చు కూడా ప్రేమ పుణ్యమే.
– చక్రవర్తి వట్టికూటి

.