వాట్సప్ గ్రూపులు ఇవాళ చాలా సర్వసాధారణం అయిపోయాయి! స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడుతూ ఉండడం సాధారణం. వాట్సప్ వాడే ప్రతిఒక్కరూ పదుల సంఖ్యలో గ్రూపుల్లో ఉండడం కూడా సర్వసాధారణం అయిపోయింది.
అదే తరహాలో.. సోషల్ మీడియా వెర్రి తలలు వేయడంలో భాగంగా.. చాలా అసహ్యకరమైన అనేక రకాల పోస్టులు, అసభ్యమైనవి, అనుచితమైనవి, ఇతర మతాలు కులాలను కించపరుస్తూ సామరస్యాన్ని దెబ్బతీసేవి అనేక రకాల పోస్టులు వాట్సప్ గ్రూపుల్లో ప్రధానంగా చెలామణీ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియా పెరిగేకొద్దీ.. దానికి పగ్గం వేయడానికి అనేక రకాల చట్టాలు, నియమ నిబంధనలు కూడా తయారవుతున్నాయి.
సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసేలా, హింసను ప్రేరేపించేలా విషం కక్కే పోస్టులు వచ్చినప్పుడు వాటి మీద పోలీసు కేసులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. అయితే అలాంటి పోస్టులు పెట్టిన వారిని మాత్రమే కాకుండా, సదరు గ్రూప్ ఎడ్మిన్ ను కూడా బాధ్యుడిని చేస్తూ.. ఎడ్మిన్ల మీద కూడా కేసులు పెట్టేలా చట్టాలు ఉన్నాయి.
అయితే ఇది ఎడ్మిన్లకు చాలా పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. ఎందుకంటే.. గ్రూపులోని ఎవడో ఒక సభ్యుడు అనుచితమైన అసహ్యమైన పోస్టును పెడితే.. దానిని నిర్ణీత సమయంలోగా డిలిట్ చేయమని అడగడం వరకే ఎడ్మిన్ చేయగలిగిన పని! సదరు సభ్యుడు delete for everyone చేయకపోతే.. ఎడ్మిన్ చేయగలిగింది ఏమీ లేదు. సదరు సభ్యుడిని గ్రూపు నుంచి remove చేయగలడు తప్ప.. ఆ పోస్టు విషయంలో ఎడ్మిన్ చేయగలిగేది ఏమీ లేదు. కాకపోతే కేసు మాత్రం అతని మీద కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఈ తలనొప్పి ఎడ్మిన్లకు తప్పేది కాదు.
అయితే తాజాగా వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఎడ్మిన్లను సభ్యులు పెట్టే పోస్టులను కూడా delete for everyone కొట్టడానికి వారికి అవకాశం ఏర్పడింది. దీనివల్ల వాట్సప్ గ్రూపులద్వారా విషం చిమ్మే చెత్త పోస్టులు వ్యాపించే అవకాశం తగ్గుతుంది. ఎవరైనా ఒక తప్పుడు పోస్ట్ పెడితే.. ఎడ్మిన్ వారిని ఎలర్ట్ చేయడంతో సరిపెట్టకుండా, దానిని తొలగించడానికి అవకాశం ఏర్పడింది! కాకపోతే.. ఎడ్మిన్లు.. తమ వాట్సప్ గ్రూపులో ఎవరేం పోస్టులు పెడుతూ ఉన్నారో ఒక ఉద్యోగం లాగా నిత్యం గమనిస్తూనే ఉండాలి.
అదొకటే భారం గానీ.. కనీసం తప్పుడు పోస్టులు విస్తృతంగా చెలామణీ అయిపోకుండా ఈ కొత్త ఫీచర్ బాగానే ఉపయోగపడుతుంది. తాము ఎడ్మిన్ గా ఉన్న గ్రూపులో చెత్త పోస్టులు రావడం వలన కేసుల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్న ఎడ్మిన్లకు ఈ ఫీచర్ ఖచ్చితంగా శుభవార్తే!
.