ముక్కంటి ఆలయానికి వచ్చే భక్తుల రాక పోకలకు ఇబ్బంది కలిగిస్తే సహించమని ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులతో కలసి బిక్షాల గాలిగోపురం మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించారు.
ఈ సందర్భంగా అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ… బిక్షాల గాలిగోపురం మార్గంలో దుకాణదారులు ఆక్రమణలకు పాల్పడుతుండటంతో భక్తులు బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దుకాణాదారుల కారణంగా ట్రాఫిక్ కూడా తరచూ స్తంభించి పోతోందన్నారు. ఇవి పరిగణనలోకి తీసుకుని ఆక్రమణలు తొలగిస్తున్నట్లు తెలిపారు.
భక్త కన్నప్ప ఆలయం భక్తులకు కనబడే విధంగా ఉండాలని… గతంలో ఎక్కడ వరకు ఇచ్చారో అక్కడి వరకే వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకోవాలన్నారు. నిబంధన పాటించక పోతే పూర్తిగా దుకాణాలు తొలగిస్తామని హెచ్చరించారు. అటు బజారువీధిలోనూ కుంకుమ విక్రయ షాపులను.. ఇతర పూజా ద్రవ్యాల విక్రయ షాపులు రోడ్లపైకి రావద్దని ఆదేశించారు.
గాలి గోపురం లోపల వైపు గో పూజ మండపం వరకు విస్తరించిన దుకాణాలు పూర్తిగా భక్తులకు ఇబ్బంది లేని విధంగా వెనక్కి పెట్టుకునే విధంగా చేశారు. మరోసారి భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా ముందుకు జరిపి దుకాణాలు పెట్టుకుంటే పూర్తిగా తొలగిస్తామని హెచ్చరిక చేశారు. భక్తులే తమ ప్రథమ ప్రాధాన్యమని… స్థానికులుగా వ్యాపారులు సహకరించాలని కోరారు.
బతుకు జీవనం సాగిస్తూ సేవా భావంతో వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అటు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఇటు భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేని విధంగా దుకాణాలు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అలా కాకుండా తమ ఇష్టారాజ్యంగా దుకాణాలు రోడ్లమీద తీసుకువస్తే పూర్తిగా తొలగించాల్సి వస్తుంది అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు కూడా తమ సహకారం అందించాలని కోరారు.
దీనిని రాజకీయ దృష్టితో చూడవద్దన్నారు. సమిష్టి కృషితో శివయ్య దర్శనానికి వచ్చే భక్తులకు అత్యున్నత సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు బుల్లెట్ జయ శ్యామ్, సాధన మున్నా, మహీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్, వన్ టౌన్ ఎస్ఐ సంజీవ్ కుమార్, టెంపుల్ డీఈ మురళీధరన్, శానిటరీ ఇన్స్ పెక్టరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
.