మనుషుల్లోని రాక్షస భావాలను తొలగించడానికి భగవంతుడు భక్తి సంగీత ప్రభోదం కోసం అన్నమాచార్యుల లాంటి వారి రూపంలో భూమి మీదకు వచ్చారని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. అన్నమయ్య కీర్తనల్లోని సారాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే మనిషి జీవితం సార్థకం అవుతుందన్నారు.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన తాళ్ళపాక సంకీర్తనలు పుస్తకావిష్కరణ చేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శాంత వసంత ట్రస్ట్ సహకారంతో ఈ పుస్తకాన్ని ముద్రించింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలు మనసుకు ఊరట కల్పిస్తాయన్నారు. ఈ కీర్తనలు అన్ని స్థాయిలవారికి అనురక్తిని కల్పిస్తాయని ఆయన చెప్పారు. ఈ కీర్తనలు పరిశోధన వైపు నడిస్తే అదే విజ్ఞానం అవుతుందని, భగవంతుని పాదాలు విడిచి పెట్టకుండా ఉండే మార్గంగా మారుతుందన్నారు.
అన్నమయ్య భగవత్ అంశ అని ఆయన తెలిపారు. రాతప్రతుల్లో ఉన్న ఈ కీర్తనలను వెలుగులోకి తేవడానికి కృషి చేసిన శ్రీ శంకర్ రావు, ప్రోత్సహించిన పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి అభినందనీయులన్నారు. ఈ కీర్తనలను రాజముద్ర వేసి, ఉద్యమ స్పూర్తితో ప్రచురణకు పూనుకున్న టీటీడీ ని అభినందించారు. ఈ కీర్తనలు పెద్ద ఎత్తున జనబాహుళ్యంలో కి వెళ్లి ప్రజలు తరించాలని శ్రీ కోటేశ్వరరావు అభిలషించారు.
టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, 20 సంవత్సరాల తరువాత టీటీడీ అన్నమయ్య రాతప్రతుల్లోని 289 కీర్తనలను ముద్రించిందన్నారు. వరప్రసాద్ రెడ్డి, బసవ శంకర మూర్తి ఇందుకు సహకరించారని తెలిపారు. అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనల్లో 14 వేలు లభించాయని, ఇందులో 4 వేల సంకీర్తనలను టీటీడీ స్వరబద్ధం చేసిందని చెప్పారు.
వీటిలో 100 దాకా సంకీర్తనలు మాత్రమే పెద్ద ఎత్తున జనబాహుళ్యంలోకి వెళ్లాయని ఆయన చెప్పారు. మిగిలిన వాటిని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి 4 వేల సంకీర్తనలపై యువతీయువకులకు గాన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంకీర్తనకు అందరికే అర్ధమయ్యే సరళమైన తెలుగు లో భావం, అర్థం ప్రచురించే ప్రక్రియకు టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి చానళ్ల ద్వారా అన్నమయ్య సంకీర్తనలను దేశ వ్యాప్తంగా ప్రసారం చేయాలని సంకల్పించామని ఈవో వివరించారు. దీంతో పాటు తిరుమల లో శ్రీవారి భక్తురాలు తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిర నిర్మాణం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచెంద్ర మాట్లాడుతూ, మరుగున పడ్డ మరిన్ని అన్నమయ్య సంకీర్తనలు కాలగర్భంలో కలసిపోకుండా వెలుగులోకి తేవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. అన్నమయ్య శ్రీవారిని వెంకట కృషుడిగా భావించి అనేక సంకీర్తనలు రాశారని ఆయన చెప్పారు.
శాంత బయోటెక్ అధినేత పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కలియుగంలో కేశవ నామ సంకీర్తనతో పుణ్యం పొందుతామని అన్నారు. భగవత్ భక్తి మనిషిలోని భావ కాలుష్యాన్ని తొలగిస్తుందని ఆయన చెప్పారు. లభ్యం కాని అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తెచ్చి ప్రజా బాహుళ్యంలో ప్రతినోట పలికించాలనే ఉద్దేశంతోనే రాత ప్రతుల్లోని 289 కీర్తనలను పుస్తక రూపంలో తెచ్చామని చెప్పారు. వీటిని స్వరపరచి టీటీడీ ద్వారా ప్రజల్లోకి పంపుతామని ఆయన వెల్లడించారు.
అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో (విద్య మరియు వైద్యం), సదా భార్గవి, జెఈవో వీర బ్రహ్మం, టీటీడీ ఆస్థాన గాయకులు బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ విభీషణ శర్మ, అన్నమాచార్య రాత ప్రతుల పరిశోధకులు బసవ శంకర రావు పాల్గొన్నారు. వర ప్రసాద్ రెడ్డి వీరందరితో పాటు పుస్తక కమిటీ లోని సముద్రాల లక్ష్మణయ్య, ఆచార్య సర్వోత్తమ రావు, మోదుగుల రవికృష్ణ, ఎస్వీబీసీ సిఈవో సురేష్ కుమార్, సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ ను శాలువ తో సన్మానించి, మెమెంటో అందించారు.
ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి పద్మభూషణ్ వర ప్రసాద్ రెడ్డిని టీటీడీ తరపున సన్మానించారు.
ఎస్వీబీసీ న్యూస్ ఇంచార్జ్, శాంత వసంత ట్రస్ట్ సభ్యురాలు రామలక్ష్మి సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
.
Discussion about this post