కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని సత్యవేడు నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ ఏరియా కార్యదర్శి కత్తి రవి డిమాండు చేశారు.
సీపీఐ చిత్తూరు జిల్లా సమితి పిలుపులో భాగంగా బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలో పెంచిన ధరలు తగ్గించాలని వినూత్న పద్ధతిలో మెడలో కాయగూరలు దండలు వేసుకుని… సిలిండర్ తో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కత్తి రవి మాట్లాడుతూ… కొవిడ్ నేపథ్యంలో ఆర్థిక కష్టాలతో ప్రజలు సతమతమౌతుంటే అదనపు భారం మోపడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టడమే కేంద్ర ప్రభుత్వం ధ్యేయంగా కనిపిస్తోందన్నారు. వంట గ్యాస్ సిలిండర్ పై ఒకేసారి రూ.50 పెంచడం దారుణమన్నారు.
పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచడవ వలన నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదముందన్నారు. ఇప్పటికే అధిక ధరలతో పేదలు బతుకు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఐదు నెలల విరామం తర్వాత కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రజల పై భారం మోపుతోందన్నారు. ఎన్నికలు ముగిశాక ప్రజలపై ధరల భారం మోపి మోదీ తన నిజ స్వరూపం నిరూపించుకున్నారన్నారు.
మోదీ కేవలం కార్పొరేట్ శక్తుల కోసమే పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీకి తగిన గుణపాఠం చెప్పడానికి రాజకీయ పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు . కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్త ఆందోళనలో ప్రజల్ని భాగస్వాములు చేస్తామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఏరియా కార్యదర్శి కత్తి ధర్మయ్య, భాస్కర్, అశోక్, వెంకటయ్య, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
.